ఖదీర్‌బాబుకు విశిష్ట కథా పురస్కారం
మూడో రోజూ కొనసాగిన తెలుగు రాష్ట్రాల కథానాటిక పోటీలు
చిలకలూరిపేట టౌన్: అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్, చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్‌ల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల కథానాటిక పోటీలు మూడో రోజు శనివారం కొనసాగాయి. ఇందులో ప్రముఖ కథా రచయిత,‘సాక్షి’ దినపత్రికలో సీనియర్ న్యూస్ ఎడిటర్ మహమ్మద్ ఖదీర్‌బాబుకు ‘సరిలేరు నీకెవ్వరూ’ విశిష్ట కథా పురస్కారం అందజేశారు. సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ... ఖదీర్‌బాబు కథలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయన్నారు. నిత్య పరిశీలన నుంచి జనించిన ఆయన కథలను ప్రతి ఒక్కరూ చదవదగినవన్నారు. ఖదీర్‌బాబు మాట్లాడుతూ... ‘కథకుడు కథను రచించేందుకు భౌతిక, మానసిక శ్రమ చేయాలి.
సంఘటన, పర్యవసానం గుండెలమీద మోయాలి’ అన్నారు. సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, సాహితీవేత్తలు ఎర్రాప్రగడ రామకృష్ణ, కొలకనూరి ఇనాక్, సంస్కృతి సంస్థ అధ్యక్షుడు ఎస్.బాలచందర్, రంగారావు, మన్నం మనోరమ పాల్గొన్నారు. అంతకముందు అమెరికాలోని వర్జీనియాకు చెందిన డాక్టర్ తాడికొండ కె.శివకుమారశర్మ రచించిన ‘విదేశ గమనే’ పుస్తకాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రముఖ కథా విశ్లేషకుడు వాసిరెడ్డి నవీన్ ఈ పుస్తకం సమీక్ష నిర్వహించారు. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయి.