ఎన్‌బీటీపైనా స్మృతి ఇరానీ పెత్తనమేనా!
న్యూఢిల్లీ: సాహిత్య ప్రియులకు ప్రోత్సాహకరంగా గత ఆరు శతాబ్దాలుగా పనిచేస్తున్న ‘నేషనల్ బుక్ ట్రస్ట్’పైనా కాషాయం రంగు పడింది. ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పుస్తకాల క్రయవిక్రయాల ఆర్థిక లావాదేవీలను ఓ ప్రైవేటు ప్రొఫెషనల్ కంపెనీకి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించే వ్యవస్థను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకపక్షంగా రద్దు చేశారు. ఈ విషయంలో నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌నుగానీ, ట్రస్టీ సభ్యులనుగానీ ఏమాత్రం సంప్రతించకుండానే ఏకపక్షంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ట్రస్టీ సభ్యులను ఎన్నుకోవాల్సిన అంశం పెండింగ్‌లో ఉన్నందున తాను స్మృతి ఇరానీ ఉత్తర్వులపైనా స్పందించలేనంటూ నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ బల్‌దేవ్ శర్మ ఆ ఉత్తర్వులను పక్కన పెట్టగా, ట్రస్ట్ డెరైక్టర్ రీటా చౌధురి వాటిని ఆగమేఘాలపై అమలు చేశారు. రీటా చౌధురి అస్సాం బీజేపీ నాయకుడు చంద్రమోహన్ పట్వారీ భార్య. నేషనల్ బుక్ ట్రస్ట్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినప్పుడు, దానికొక ట్రస్టీ ఉన్నప్పుడు ఏకపక్షంగా మంత్రి ఉత్తర్వులు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా, తమ సంస్థ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్ర మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్నందున ఆ శాఖ మంత్రి స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వాటిని అమలు చేయక తప్పదని రీటా చౌధురి మీడియాతో వ్యాఖ్యానించారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ బల్‌దేవ్ శర్మ కూడా బీజేపీ పరివారంకు చెందిన వ్యక్తే అయినప్పటికీ పాత సంప్రదాయాలను పాటించేందుకు మొగ్గు చూపారు. అయితే రీటా చౌధురి తీసుకున్న చర్యలపై ఆయన ఎలా స్పందిస్తారా? అన్న అంశంపై ఆయన నిజాయితీ ఆధారపడి ఉంది. బల్‌దేవ్ శర్మ ఆరెస్సెస్ నడిపిన ‘పాంచజన్య’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఆయన్ని బుక్ ట్రస్ట్ చైర్మన్‌గా నియమించింది. అప్పటి వరకు వామపక్ష భావాలున్న లేదా మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేసిన చరిత్రకారులు, విద్యావేత్తలు ట్రస్ట్ చైర్మన్‌లుగా కొనసాగుతూ వచ్చారు. శర్మకు ముందు సేతుమాధవన్, అంతకు ముందు ప్రముఖ హిస్టారియన్, రచయిత బిపన్ చంద్ర చైర్మన్‌గా ఉన్నారు.
సమాజానికి ఉపయోగపడే మంచి సాహిత్యం పట్ల ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో వాటిని అందుబాటు ధరల్లో అందించేందుకు 1957లో ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటయింది. ఇంగ్లీషు, హిందీ భాషలతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ ట్రస్ట్ ఉత్తమ సాహిత్యాన్ని ఇప్పటివరకు అందిస్తూ వచ్చింది. 2009 నుంచి 2011 మధ్య పుస్తకాల క్రయ,విక్రయ లావాదేవీల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆడిట్ నివేదికలో వెల్లడైంది. దీంతో ట్రస్ట్‌గానీ, ట్రస్టీ సభ్యులకుగానీ సంబంధంలేని ప్రొఫెషనల్ సంస్థకు ఆర్థిక లావాదేవీలను అప్పగిస్తే మంచిదని అప్పటి చైర్మన్ బిపన్ చంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తర్వాత ఆ పదవిని చేపట్టిన సేతుమాధవన్ అమలు చేశారు. 2013లో అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం ప్రకారం టెండర్ ప్రిక్రియ ద్వారా ‘గ్లోబస్ లాగిసిస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి మూడేళ్ల పాటు అప్పగించారు.
అలాగే ఆర్థిక అక్రమాలపై దర్యాప్తునకు కూడా ఆదేశించారు. ఆ దర్యాప్తు నివేదిక ఇంకా అందకముందే ఈ టెండర్ ప్రక్రియను రద్దుచేస్తూ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ స్మృతి ఇరానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం ట్రస్టీ సభ్యులు ఖరారు చేసిన పుస్తకాలనే నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురిస్తూ వచ్చింది. ఎక్కువకాలం అధికారంలోవున్న కాంగ్రెస్ ఏ పుస్తకాలు ప్రచురించాలనే విషయంలో పరోక్ష ప్రమేయం ఉండొచ్చేమోగానీ ఏనాడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రస్టీ అభిప్రాయానికే అవకాశం ఇవ్వలేదంటూ మున్ముందు పుస్తకాల ఎంపికలో కూడా వారికి స్వేచ్ఛనివ్వకపోవచ్చు. ఇక నేషనల్ బుక్ ట్రస్ట్‌లో ‘ట్రస్ట్’ ఎగిరిపోయినట్లే.