సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ డంకా బజాయించింది. అత్యుత్తమ ఉత్తీర్ణతా శాతంతో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులాలకు పోటాపోటీగా ముందుకెళ్లిన విద్యా శాఖ గురుకులాలు 98.54 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆదర్శ పాఠశాలలు (98.45), సాంఘిక సంక్షేమ గురుకులాలు (96.56), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (95.07) ఉన్నాయి. గురుకుల పాఠశాలల కేటగిరీలో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్)ని మినహాయిస్తే మిగతా సొసైటీలన్నీ రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని (92.43) దాటడం గమనార్హం.
పది పాయింట్లతో...
గురుకుల పాఠశాలలు సాధించిన ఉత్తీర్ణత రికార్డు స్థాయిలో ఉండగా.. ఉత్తమమైన గ్రేడ్ పాయింట్లు సాధించిన పిల్లలు సైతం అధికంగానే ఉన్నారు. ఆదర్శ పాఠశాలల్లో 210 మంది, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 53 మంది, విద్యా శాఖ గురుకులాలకు చెందిన 20 మంది, బీసీ గురుకులాల్లో 13 మంది, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నూరు శాతం ఫలితాలు సాధించిన కేటగిరీలో 13 బీసీ గురుకులాలు, 58 ఎస్సీ గురుకులాలు, 15 గిరిజన సంక్షేమ గురుకులాలు, 185 కేజీబీవీలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. ఎస్సీ హాస్టళ్లలో వసతి పొందుతూ ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మంత్రి, అధికారుల అభినందనలు..
పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, బోధన, బోధనేతర సిబ్బందికి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. ప్రత్యేక తరగతులతోపాటు ట్యూటర్‌లను ఏర్పాటు చేసి అభ్యసనం చేయించడం, రాత్రి వేళ ప్రత్యేక డైట్/స్నాక్స్ ఇవ్వడంతో ఫలితాల శాతం గణనీయంగా పెరిగిందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరుతో పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసిన పిల్లలకు అభినందనలు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలతో ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చామని విద్యా శాఖ గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బీసీ గురుకులాలతో సమానంగా విద్యాశాఖ గురుకులాలు పోటీ పడ్డాయని స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ మరింత మెరుగైన పనితీరుతో అగ్రస్థానం కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు.
సర్కారీ సూళ్లది వెనుకబాటే..
పదో తరగతి ఫలితాల్లో సర్కారీ స్కూళ్లు వెనుకబడ్డాయి. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటంతోపాటు విద్యార్థుల సంఖ్య సైతం పెద్ద మొత్తంలో ఉంది. దీంతో ఫలితాల్లో కొంత వెనుకబాటు సహజమే అయినప్పటికీ.. రాష్ట్ర సగటుకు ఆమడ దూరంలో ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా పరిషత్ పాఠశాలలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా నమోదు కాలేదు. గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలు మాత్రం ఫలితాల్లో వెనుకబడ్డాయి. రాష్ట్ర సగటును అందుకోకపోగా 9 శాతానికిపైగా విద్యార్థులు ఫెయిలైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment