లక్షమంది బీసీలకు గురుకులాల విద్య | Article On Telangana BC Gurukul Education | Sakshi
Sakshi News home page

లక్షమంది బీసీలకు గురుకులాల విద్య

Published Wed, Jun 12 2019 1:01 AM | Last Updated on Thu, Jun 13 2019 1:02 AM

Article On Telangana BC Gurukul Education - Sakshi

బహుజన సామాజిక వర్గాలలో మార్పుకు, అన్ని రంగాలలో వారు దూసుకుపోతూ శిరసెత్తుకుని నిలవటానికి విద్యే ప్రధాన సాధనమని చెప్పిన బహుజన పితామహులు మహాత్మాజోతిభాపూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ల ఆలోచనా ధారల్లో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. అందరూ మాటలు చెప్పేవారే కానీ ఆచరణ చేసి చూపే వారేరన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ అవతరణ తర్వాత బహుజన వర్గాలకోసం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు దినదినాభివృద్ధి చెందుతూ పురోభవిస్తున్నాయి. గురుకుల పాఠశాలలు పటిష్టవంతంగా నిలవటానికి కేసీఆర్‌ బలమైన పునాదులు వేస్తున్నారు. ఇది సబ్బండవర్ణాలు ఆహ్వానించదగ్గది మాత్రమే కాకుండా బహుజన వర్గాల చైతన్యానికి ఎంతో దోహదపడతాయి. 

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు మూడు గురుకుల పాఠశాలలు, మూడు ప్రాంతాలలో మూడు జూనియర్, డిగ్రీ గురుకుల పాఠశాలలు నెలకొల్పటం, ఆ తర్వాత మానవవనరుల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలనే నవోదయ విద్యాసంస్థలుగా దేశవ్యాపితంగా ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాపితంగా 29 రాష్ట్రాలలో జిల్లాకు ఒకటి చొప్పున 600 నవోదయ విద్యాసంస్థలున్నాయి.  1986లో జాతీయ విద్యావిధానంలో భాగంగా 12వ తరగతి వరకు విద్యను బోధిస్తూ నవోదయ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. 

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం 906 గురుకుల పాఠశాలలు, 53 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలున్నాయి. ఈ ఏడాది అంటే 2019 విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 56 ఏళ్లపాలనలో బీసీ రెసిడెన్షియల్‌ గురుకులాల సంఖ్యే 280 దాకా వచ్చాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గం పరిధిలోకి గురుకుల పాఠశాలలు వచ్చేశాయి. ఇది గుణాత్మక మార్పుగా చెప్పాలి. ఇది విప్లవాత్మక పరిణామం. అందరూ చెప్పేవారే కానీ ఈ వర్గాలలో విద్యాభివృద్ధికి కృషిచేసిన వారేరన్న ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానంగా మిగులుతారు. 

సరిగ్గా బహుజన సమాజం కోరుకునేది అన్ని రంగాలలో తమ భాగస్వామ్యం. అందుకు తొలి  మెట్లు విద్య. ఆ రంగంలో స్థిరపడితే అన్ని రంగాలలోకి బహుజనవర్గం దూసుకుపోతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు 90శాతం దాకా ఉన్నారు. ఈ వర్గాల అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధి అన్న దార్శనికత కేసీఆర్‌కుంది. అందుకే ఈ వర్గాల సంక్షేమం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఉంది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏడాది లక్షన్నరకుపైగా ఖర్చుచేస్తూ పౌష్ఠికాహారం, దుస్తులు, మంచి చదువు, ఆరోగ్యకరమైన వాతావరణంలో గురుకుల పాఠశాలలున్నాయి. 

సమాజంలో సగభాగమైన బీసీల కోసం అదనంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పటంతో ఆయావర్గాలు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ గురుకుల పాఠశాలలు రాబోయే 10 ఏళ్ల తర్వాత మరిన్ని మంచి ఫలితాలనిస్తాయి. ఇక్కడనుంచి తయారయ్యే విద్యార్థులు సమాజంలో జరిగే మార్పులకు కేంద్రబిందువుగా నిలుస్తారు. ఈ గురుకుల పాఠశాలలను బహుజనవర్గాలే కంటికి రెప్పలా కాపాడుకోవలసిన అవసరం ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలూ అందించనంత ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. బహుజన బిడ్డలకు సంతృప్తికరమైన పౌష్ఠికాహారంతోపాటు వారికి మంచి వైద్యసదుపాయాలు అంది స్తున్నారు. క్రీడల్లో, సాంస్కృతిక రంగాల్లో ఈ పిల్లలు శక్తివంతులుగా ఎదుగుతున్నారు. మొత్తంగా పదవతరగతి, ఇంటర్‌ఫలితాల్లో బహుజన విద్యాసంస్థలే అత్యధికశాతం ఫలితాలు సాధించటమేగాక ర్యాంకులన్నీ వీళ్లే స్వంతం చేసుకుంటున్నారు. ఆంగ్ల బోధనలో విద్యార్థులు సాధనచేస్తున్నారు. ఒక బీసీ గురుకులాల్లోనే లక్షమంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది బీసీ విద్యార్థులకు ఈ గురుకులాల ద్వారా విద్యనందించటం విశేషం. తెలంగాణ సమాజ మంతా శక్తివంతం కావటానికి ఈ స్కూళ్లు దోహదకారులవుతాయి. భవిష్యత్‌ కాలంలో రాబోయే విప్లవాత్మక మార్పులకు గురుకులాలనుంచి వచ్చిన వారే శ్రీకారం చుడతారు. బహుజన వర్గాల పిల్లల చైతన్యం గురుకులాల నిండా నిండి ఉన్నంతకాలం ఆ వర్గాల మనస్సులో తెలంగాణ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అదే జ్ఞాన తెలంగాణకు బాటలు వేస్తుంది.


-జూలూరు గౌరీశంకర్‌
(వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌సభ్యులు ‘ 94401 69896)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement