juluri gowri shankar
-
Hyderabad National Book Fair: బుక్‌ఫెయిర్‌కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్‌ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రత్యామ్నాయ నాయకత్వం కోసమే...
ఢిల్లీ గద్దె మీది సర్కారు ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వంగా, కార్మిక –కర్షక – రైతు కూలీల వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిన స్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే, మత ఘర్షణలకు తలుపు తెరిచే, ఆధిపత్య బలంతో రెచ్చగొట్టే చర్యల రహస్య అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం ఉంది. ఆ అవసరాన్ని తీర్చడానికి తెలంగాణ నుంచి కేసీఆర్ తన వంతు ప్రయత్నం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ప్రస్తుత కేంద్రపాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తెస్తున్న ముప్పును దేశానికి వివరించనున్నారు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను, బహుజన వర్గాలను అణగదొక్కుతున్న తీరును నిరసిస్తూ ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించడానికి జాతీయ వేదికపైకి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లుగానే దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు గాంధీ మార్గంలో మరో కొత్త మార్పుకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా దేశ మౌలిక విలువలను కాపాడుకోవటం అత్యవసరమైంది. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీతో దేశంలో మౌలిక విలువలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీ దుష్ప్రభావం అన్ని రంగాలనూ కుదిపేసింది. అంతే కాకుండా దేశ మౌలిక విలువలకు భంగం వాటిల్లడంతో ప్రజాస్వామిక శక్తుల ఏకీకరణ అన్నది ఒక చారిత్రక అవసరంగా ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ కంటే ముందు ‘ఇందిరాయే ఇండియా’ అన్న నినాదంతో ముందుకు సాగిన పాలనలో దేశం ఆర్థికంగా క్షీణదశకు వచ్చేసింది. అప్పటికే మొదలైన కొద్దిపాటి ఆర్థిక సంస్కరణలు కూడా దేశానికి ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. ఎమర్జెన్సీ కాలం పోయింది. జయప్రకాష్ నారాయణ్ ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కూడగట్టారు. రామ్మనోహర్ లోహియా భావజాలాన్ని నింపుకొని అప్పుడప్పుడే యువతరం నాయకులుగా ఎదిగివస్తున్న తరుణమది. ఆ తరం క్రియాశీలురు బ్రహ్మండమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. ఎమర్జెన్సీలో దేశాన్ని ఎలా జైలుగా మార్చారో వారు ఎలుగెత్తి చాటారు. జయప్రకాష్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ వేదిక రూపు దాల్చింది. రాజకీయంగా కాంగ్రెస్ కుదేలై పోయింది. అప్పటివరకూ తిరుగులేకుండా పాలించిన కాంగ్రెస్‌కు మొట్టమొదటిసారిగా చావుదెబ్బ తగిలింది. జనతా పార్టీ అధికారంలో వచ్చింది. అది భారత రాజకీయాలలో కొత్త మలుపు. అయితే జనతా ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు, అది చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అలా వచ్చిన కాంగ్రెస్ మళ్లీ చానా ఏళ్లు దేశాన్ని పాలించింది. నేటికీ కోలుకోని స్థితి రాజీవ్ గాంధీ పాలనలో చాప కింద నీరు లాగా దేశంలో అనేక సమస్యలు చోటుచేసుకున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. నిరుద్యోగ సమస్య వికృత రూపం దాల్చింది. దేశానికి ఆర్థికంగా వెసలుబాటు లేకుండా పోయింది. 1990 నాటికి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి. అలాగే సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొద లైంది. దేవెగౌడ, చంద్రశేఖర్, వీపీ సింగ్, పీవీ నరసింహరావు ప్రభుత్వాలు సంకీర్ణ యుగంలో వచ్చినవే. (ఆ మాటకొస్తే ఆ తర్వాత వచ్చిన యూపీఏ, ఇప్పుడున్న ఎన్డీఎ ప్రభుత్వాలూ సంకీర్ణ ప్రభు త్వాలే). వీపీ సింగ్ రాకతో బీసీల కోసం మండల కమిషన్ని తీసుకు రావడం దేశ రాజకీయ పరిస్థితులలో మళ్ళీ ఒక కొత్త పరిణామానికి తలుపులు తీసింది. పీవీ నరసింహారావు ప్రధాన స్రవంతి సంస్కర ణలకు ఆద్యులు. దేశంలో సరళీకృత ఉదార విధానాలకు తలుపులు తెరిచారు. అయితే భారతదేశం సంప్రదాయ మార్కెట్లది కావడంతో రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. అప్పుడు ప్రారంభమైన రూపాయి విలువ పతనం మోదీ ప్రభుత్వం వరకు 32 సంవత్స రాలుగా కొనసాగుతూ వచ్చింది. నిస్తేజంగా దేశ పాలన మన్మోహన్ సింగ్ పాలన దేశాన్ని మరింత నిస్తేజ స్థితికి తీసుకు పోయింది. అది 2014 దాకా సాగింది. ఈ పరిస్థితుల్లో అవినీతి వ్యతి రేక ఉద్యమాలు కేజ్రీవాల్, అన్నా హజారే రూపాలలో ముందుకు వచ్చాయి. ఇలాంటి సమయంలో గుజరాత్ మోడల్ని ముందు పెట్టి బీజేపీ దేశంలో తన బలాన్ని పెంచుకొని కోరలు చాచింది. 2014లో కార్పొరేట్ శక్తుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇవాళ దాకా కొనసాగుతూ వచ్చింది. బీజేపీ దేశంలో మత విభజనకు గీతలు గీసింది. కులాలను రెచ్చగొడుతోంది. కుల, మతాల్ని అడ్డు పెట్టుకొని దేశంలో ఆధిపత్య రాజకీయాలను చలాయించే దశకు వారు వచ్చేశారు. దేశాన్ని బనియాలు (వర్తకులు), ఉన్నత వ్యాపారుల చేతుల్లో పెట్టేశారు. దేశంలో పేదరికం బాగా పెరిగిపోయింది. రాజ్యాంగ మౌలిక లక్షణాలను దెబ్బతీసేదాకా బీజేపీ నిర్ణయాలు వెలువడ్డాయి. అబద్ధాలతో ఆధిపత్యం దేశంలోని సర్కారు ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వంగా, కార్మిక, కర్షక, రైతు, కూలీల వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిన స్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న పాలకులు ఫేక్ సోషల్ మీడియాను పట్టుకొని అబద్ధపు ప్రపంచాన్ని దేశం చుట్టూ నిర్మించే పనిలో ఉన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే, మత ఘర్షణలకు తలుపులు తెరిచే విధంగా ఆధిపత్య బలంతో రెచ్చగొట్టే చర్యలను రహస్య అజెండాగా ముందుకు సాగుతోంది. రైతాంగాన్ని ఉరితీసే విద్యుత్ చట్టాలను తెస్తోంది. అన్నం పెట్టే అన్నదాతలు దేశ వ్యాప్తంగా సంవత్సరం పాటు ప్రజా ఉద్యమాలు చేసే దశకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వ్యవసాయ రంగంపై రుద్దే ప్రయత్నం చేస్తే... తమ ఉద్యమాలతో రైతులు తిప్పికొట్టారు. విధిలేని పరిస్థితులలో కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అత్యవ సరంగా దేశానికి ఒక ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పవలసి ఉంది. ఆ ప్రత్యామ్నాయ భావజాల వేదికకు నేతగా దేశ ప్రజల ముందుకు కేసీఆర్ వస్తున్నారు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను, బహుజన వర్గాలను అణగదొక్కుతున్న తీరును నిరసిస్తూ ఒక మహోద్యమానికి నిర్మాతగా కేసీఆర్ దేశ రాజకీయ వేదికపైకి వస్తున్నారు. దేశాన్ని కమ్మేస్తున్న మత తత్వాన్ని తిప్పి కొట్టడానికి ఆయన జాతీయ రాజకీయ యవనికపైకి వస్తున్నారు. రాజ్యాం గంలోని మౌలిక సూత్రాలకు వస్తున్న ముప్పును తప్పించడానికి బయలుదేరుతున్నారు. దేశంలోని ప్రతి నీటి చుక్కను ప్రజలు వినియోగించుకొనేందుకు, నీళ్లందని దిక్కులకు నీరు అందించేందుకు ఒక జలనాయకుడిగా ముందుకు వస్తున్నారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు అందిస్తూ రైతాంగాన్ని ఆదుకోనున్నారు. నిరుద్యోగ సమ స్యను లేకుండా చేసేందుకు దేశంలో ఉత్పత్తులను ఎలా పెంచాలో లెక్కలు కట్టి చెబుతున్నారు. జనం కోసమే జాతీయ పార్టీ దేశానికి గుండె కాయ వంటిది గ్రామీణ భారతం. ఆ గ్రామీణ భారతాన్ని రక్షించుకోవడానికి గాంధీజీ ఆలోచనలతో ఎలా ముందుకు సాగాలో కేసీఆర్ వివరిస్తున్నారు. పొరుగు దేశం అయిన చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎలా నిలువగలిగిందో ఆ మార్గంలో మన దేశాన్ని ప్రపంచ శక్తిగా ఎలా నిలపాలో, మానవ వనరుల వినయోగం ఎలా జరగాలో చెబుతూ దేశమంతా చుట్టి వస్తానంటున్నారు. అందు కోసమే జాతీయ పార్టీని నెలకొల్పుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు గానే దేశాన్ని కూడా తీర్చిదిద్దడం కోసం ముందుకు సాగుతూ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక వేదికను గాంధీ మార్గంలో నిర్మిస్తా మంటున్నారు. జనం అజెండానే దేశం అజెండాగా మార్చి, మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతానంటున్న కేసీఆర్... ఇందుకు ప్రజల అండదండలను కోరుకుంటున్నారు. జూలూరి గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి -
తెలంగాణ సాహితీ సంపద పరిరక్షణకు పెద్దపీట: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సాహితీ సంపద పరిరక్షణకు పెద్దపీట వేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణకు చెందిన ప్రాచీన కళలు, సాహిత్యం, చరిత్రలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చరిత్ర, సాహిత్యం, కళలు, భాష, యాసలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలలు కన్న కండ్లు సాకారంలో ఏడేండ్లు
ఇవి ఉద్యమాలను చూసిన కళ్లు. ఉద్యమం కడదాకా నిలిచి ఉద్యమం భుజం భుజం కలిపి విజయం అంచుల దాక చేరి, ఉద్యమ సాఫల్యతను చూసి విజయోత్సవాలను వీక్షించిన కళ్లు. ఒక సుదీర్ఘ ఉద్యమం చివరన నిలిచి గెలుపును కౌగిలించుకున్న మహా సందర్భాలను కనుగుడ్లలో దాచుకున్న కళ్లు. మట్టి మనుషుల మహాసంగ్రామపు సకల జనాగ్రహాన్ని కళ్లారా చూసిన కళ్లు. బక్క మనుషులంతా కలిసి ఆధిపత్యపు గోడల్ని కూల్చివేస్తున్న దృశ్యాలను కాంచిన కళ్ళు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’’ అన్న కవిత్వపాదమై గర్జించిన కంఠాల కళ్లు. నీళ్లు లేని ఊళ్లో తుమ్మముళ్ళ సాచ్చికంగా నెర్రెలు బాసిన నేలల గళగర్జనల కళ్లు. నీళ్లు లేని వూర్లుంటాయని, వూరంతా ఖాళీ అయ్యాక గాజుకళ్ల ముసలవ్వలు మాత్రమే మిగిలివున్న కుక్కి మంచాల దృశ్యాలు. వలసల కడగండ్లను మాత్రమే చూసి దుఃఖించిన ‘‘పంచమవేదాల’’ కళ్లు. మహాజన జాతరల కళ్లను చూసి దేశమే మద్దతు తెలిపి, గద్దెలు కదిలి, ఆధిపత్యాలు కూలి అవతరించిన 2014 జూన్ 2ను కళ్లారా చూసిన తెలంగాణ తల్లి కళ్లు. పరవశించిన బిడ్డల విజయోత్సవాల ఉత్సవాల అస్తిత్వ గెలుపుల విజయాలు చూసిన కళ్లన్నీ ధన్యమైనవి. కలలన్నీ కళ్ళు చేసుకుని స్వరాష్ట్ర అవతరణను కౌగిలించుకున్నాయ్. గాయాల తెలంగాణ విజయగేయాల, విజయోత్సవాలు విరబూసిన గెలుపు కావ్యమైంది. కలలుగన్న కాలం కలలన్నీ కళ్ళలో నింపుకున్న తెలంగాణ దీర్ఘ కావ్య కార్యాచరణ అయింది. కన్నీళ్లు కాళేశ్వర మహాకావ్యాలయ్యాయి. పూడిపోయిన చెరువులు జలకళతో నిండి పోయాయి. తెగించి తెచ్చుకున్న తెలంగాణ బక్క మనషుల బడుగు జీవుల వెతలకతల తెలంగాణ తన పునర్నిర్మాణానికి పునర్నిర్మితికి తిరిగి కేసీఆర్‌నే ఎన్నుకుంది, ఎంచుకుంది. పాలనా పగ్గాలనందించి ఉద్యమ సాహసి స్వాప్నికునికే భవిష్యత్ నిర్మాణం పనిని సగర్వంగా అప్పగించింది. ఒకసారి గడిచిన కాలాన్ని లెక్కలతో కొలిస్తే ఏడేళ్లు గడిచాయి. ఒక సుదీర్ఘకాలం కలలు కళ్లముందే నిర్మిత ఛందస్సుగా ఆచరణాత్మక అలంకారాలతో ఒక్కొక్కటి సాధించుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ కరువులు కరిగిపోయి సస్యశ్యామల క్షేత్ర కావ్యాలవుతున్నాయి. ఏడుతరాల కష్టాలను తొలగించుకుంటూ పోతున్న ఏడేళ్ల బిడ్డ తెలంగాణ. ఎన్నెన్నో తీర్లుగా చిక్కుబడిపోయిన దార్లను సరిచేసుకుంటూ రహదారులను నిర్మించుకోవాలి. ఇది చీకటినేలవుతుందని కిరణ వెలుగులు తెలియని మనిషి ఉమ్మడి అసెంబ్లీ సాక్షిగా చెబితే మనం ఏడెనిమిది నెలల్లోనే తెలంగాణ బిడ్డ ఎంత శక్తివంతమైన ప్రకాశమో చెబుతూ, దేశానికే విద్యుత్ వెలుగుల వెన్నెలను ప్రసరింపచేసుకున్నాం. తెలంగాణ చీకట్లు లేని పండు వెన్నెల జాబిలి. పల్లె వెలుగులకు కాంతి దీపాలయ్యాయి. చేతి వృత్తుల చేతుల దాకా విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఒకనాటి కరువు నేల నేడు పచ్చటి పంటల పసిడి నేలగా విలసిల్లుతోంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాల్లోని పేద పిల్లల చదువుకు వేయి గురుకులాలు వెలిసి లక్షల మంది పేదల పిల్లలు చదువుకుంటున్నారు. సంచారజాతుల పిల్లలు రేపటి శాస్త్ర సాంకేతిక రంగాలకు గాడిలో పెట్టే శాస్త్రవేత్తలుగా వెలుగొందితీరుతారు. వైద్యం పేదల గడపదాకా పోవడానికి మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు, వైద్య సేవకులు కదిలిపోతున్నారు. కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కదిలిపోతుంది. బిరబిరా ప్రవహించే గోదావరి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మను కలిసింది. ప్రభుత్వ బడులన్నీ రేపటి కాలానికి అన్నివర్గాల బిడ్డల జ్ఞాన కేంద్రాలుగా ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను అందించి తీరుతాయన్న విశ్వాసాన్నిస్తున్నాయి. గత ఏడేళ్ల కాలం అభివృద్ధిపరంగా మామూలుది కాదు. ఇక్కడి రైతుబంధు పథకాన్ని కేంద్రం అవలంబిస్తోంది. తెలంగాణ ఉద్యమాలు ఇపుడు ఈ నేలంతా పరుచుకున్న సంక్షేమ పథకాలుగా, నిర్మిత రంగాల, మౌలిక వసతులు సమకూర్చుకొని నిలుస్తున్న శక్తులుగా, బహుజన వర్గాల సౌఖ్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తుంది. రాష్ట్రం వచ్చి ఏడేండ్లు గడుస్తున్నప్పటికీ ప్రతి ప్రగతి మలుపులో ఉద్యమ ఉత్తేజం కనిపిస్తుంది. ఇదే స్ఫూర్తితో సర్వరంగాలను శక్తివంతం చేసుకుని పునర్నిర్మించుకోవాలి. ఇది పునర్నిర్మాణ కాలం. పునర్నిర్మాణ చారిత్రక సందర్భం. గ్రామీణ తెలంగాణను సస్యశ్యామలం చేసేదిశగా పల్లెల్లో విస్తృత ప్రగతి పనులు జరుగుతున్నాయి. ఐటీ రంగంలో దేశంలోనే అతి కీలక కేంద్రంగా హైదరాబాద్ మహానగరం ఇప్పటికే నిలిచింది. ఐటీ రంగం కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల వరకు నిర్మించబడుతుంది. గ్రామ పంచాయతీల ఆడిట్ అంతా ఐటీ రంగంలోనే జరగడం దేశానికి నమూనాగా నిలిచింది. ఇప్పుడు హీరోలంతా తెలంగాణ భాషనే మాట్లాడుతున్నారు. సినిమా కథలన్నీ పద్మశాలీల మరమగ్గాల చింతకింది మల్లేశాలవుతున్నాయి. తెలంగాణమనే దివిటీ సాహిత్య సాంస్కృతిక సినిమా కళా రంగాలలో విలసిల్లుతుంది. ఇది ఏడేండ్ల తెలంగాణలో భాషా శాస్త్రాల దగ్గర్నుంచి ప్రగతి రథ చక్రాల వరకు అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఉద్యమ ఉద్వేగపూరిత క్షణాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటన్నింటినీ ఈ ఏడేళ్ల అభివద్ధి, పునర్నిర్మాణ పురోగమనంతో చూస్తే అవన్నీ ఉద్యమ ప్రతిఫలాలుగానే నిలుస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 85 శాతంగా ఉన్న రాష్ట్రంలో సంపదలు పెంచాలి. ఏడేండ్ల తన ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం పాలిత రాష్ట్రంగా అనేక మెట్లను నిర్మించుకుంది. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి నమూనా. వలస కార్మికులను రాష్ట్ర నిర్మాణ భాగస్వాములుగా సంలీన పరుచుకున్న మానవత్వపు పరిమళాల నజరానా. ఈ దశ దిశ నిరంతరం కొనసాగాలి. వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
భళా బహుజన స్టడీ సర్కిళ్లు
దళిత, బహుజన, గిరి జన, ఆదీవాసీ, మైనార్టీ వర్గాల్లోని యువత ఉపాధి పొందేందుకు, పోటీపరీ క్షల్లో పాల్గొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తోంది. వీటి ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణనిస్తారు. పేదవర్గాల యువతకు ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పోటీపరీక్షల కోసం ప్రయివేటు కోచింగ్ సెంటర్లలో చదువుకోవటం ఖరీదైన వ్యవ హారంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన స్డడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ నివ్వటమే గాకుండా, స్టడీ మెటీరియల్, భోజన వసతిని కూడా ఏర్పాటుచేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా విలేజ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ దగ్గర్నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే అన్నిరకాల పోటీపరీక్షలకు, దేశపాలనా రంగాన్ని నిర్వహించే సివిల్స్ పరీక్షల వరకు శిక్షణ ఇస్తారు. మూడు నుంచి ఆరేడు నెలల వరకు కోచిం గ్నిచ్చి పంపేయటమే గాకుండా ఆయా వెనుకబ డిన సామాజిక వర్గాలు, అట్టడుగు బహుజన దళిత గిరి జన ఆదీవాసీ మైనార్టీవర్గాలు, పేదలకు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు చేయాలో నన్న చింతనను కూడా ఈ స్టడీ సర్కిల్స్ నేర్పుతు న్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత వేలాదిమంది తెలంగాణ యువత ఇందులో శిక్షణ పొందారు. ఉద్యోగాలను చేజిక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు హైద రాబాద్‌లో తప్ప ఇతరచోట్ల స్టడీసర్కిళ్లు ఉండేవికావు. ఇపుడు ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్టీలకు 1, ఎస్సీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు ఉండేవి. వీటి నిర్వహణకు 22 కోట్లు ఖర్చుచేశారు. పాతవాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బీసీలకు 10, మైనార్టీలకు 1 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. స్టడీసర్కిల్స్ విస్తృతి ఇంకా పెరగాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలోపెట్టుకుని యువతను సన్నద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల శాఖల్లోని నియామకాలను చేపట్టినప్పటికీ ప్రైవేట్ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగావకా శాలు ఉన్నాయన్నది నిజం. ప్రైవేట్‌రంగంలో ఉద్యో గాలు పొందటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. హైద రాబాద్లోని అమీర్‌పేటలో పలు ఉద్యోగాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ప్రయివేట్ రంగంలో అనేకం వెలిశాయి. పేదరికంలో ఉన్న యువత ఇందులో శిక్షణ పొందటానికి ఆర్థిక భారం ఉంటుంది. గ్రామీణ, పట్టణాలనుంచి వచ్చే పేదయువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు పొందటానికి కూడా శిక్షణనిచ్చే కేంద్రాలుగా ప్రభుత్వ స్టడీసర్కిళ్లు తయారుకావాలి. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది. భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేం దుకు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు. తెలంగా ణను సంప దపెంచే కేంద్రంగా మార్చాలన్న కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తి రంగాల వైపునకు యువసైన్యం నడిచేందుకు కావాల్సిన శిక్షణ, ఆలోచనలను పెంపొందించే దిశగా స్టడీ సర్కిళ్లు తయారుకావాలి. భవిష్యత్తులో 33 జిల్లాల్లో 33 స్టడీసర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టు కుని స్థానికంగా అందుబాటులోవున్న లెక్చరర్లు, టీచర్లు, కొత్తగా రిక్రూట్ అయిన పలుశాఖల అధికారులను ఉప యోగించుకుని స్వచ్ఛందంగా స్టడీ సర్కిల్స్‌ను నిర్వహించే బాధ్యతను సంబంధిత శాఖల ఉన్న తాధికారులు తమ భుజస్కందాలపై వేసుకోవలసి ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రతిజిల్లాలో శాశ్వత భవ నాలు వచ్చేంత వరకు ఖాళీగావున్న ప్రభుత్వ కార్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రాంతీయ విశ్వవిద్యాలయాల భవనాల్లో వారికి ఆటంకం కలు గకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకుని స్టడీ సర్కిల్స్‌ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టవలసి ఉంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ 100 ఎక రాల విస్తీర్ణంలో ఉంది. ఆ పచ్చటి ప్రకృతి వొడిలో యువతకు ఉద్యోగ శిక్షణనిచ్చే అతిపెద్ద కేంద్రా లను నెలకొల్పవచ్చును. కేసీఆర్ లక్ష్యమార్గంలో సాధించే ప్రతి విజయం ఈ నేలమీద 85 శాతంగా వున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆదివాసీ వర్గాలకు మేలు చేస్తుంది. ఈ యువత స్థిరంగా నిలబడ గలిగితే తెలంగాణ సమాజమే స్థిరంగా నిలబడగ లుగుతుంది. వ్యాసకర్త కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ -
బీసీలే ఉత్పత్తిశక్తి కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక్కొక్కరంగంలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయి. సాగునీరు, తాగునీరు విషయంలో ఊరి చెరువులు నింపడం నుంచి, కాళేశ్వరం నుంచి రెండు మహానదుల అనుసంధానం వరకు తెలంగాణ సమాజం బలోపేతం కావటానికి తొలిఘట్టం ముగిసింది. ఇప్పుడు గ్రామీణ తెలంగాణ స్వయం సమృద్ధికి కేసీఆర్ మలిఘట్టం మొదలుపెట్టబోతున్నారు. చితికిపోయిన చేతివృత్తుల జీవితాల్లో తిరిగి వైభవం సంతరించుకునేందుకు, వాళ్లు తయారుచేసిన వస్తువులకు సమాజంలో డిమాండ్ ఉండేవిధంగా చూసి వాళ్లను ముందుకు నడిపించాలన్న మహత్తర సంకల్పంతోనే కేసీఆర్ పథక రచన చేస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీల జీవితాల్లో మార్పుతెచ్చేందుకు ఇప్పటికే కొంత కృషి జరిగింది. మత్స్యకారుల్లో, యాదవుల జీవితాల్లో కొంత మేరకు మార్పువచ్చింది. చేపలపెంపకం గత రెండేళ్లుగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గొర్రెల పెంపకం లాభసాటిగా మారింది. కోళ్ల పెంపకంపై ఇపుడు ప్రత్యేక శ్రద్ధపెడుతున్నారు. బీసీల జీవితాల్లో మార్పురావాలంటే చేతి వృత్తుల్లో సంపూర్ణంగా ఆధునీకరణ జరగాలి. ఈ అత్యాధునిక సమాజపు మార్కెట్ పోకడలకు అనుకూలంగా విభిన్నకోణాల్లో చేతివృత్తుల పనులు సాంకేతికతో బయటకు రావాలి. ఇందుకు చాలా కసరత్తు చేయవలసిఉంది. బీసీవర్గాలకు సంబంధించిన 280 గురుకులాలు ఇప్పటికే లక్ష కుటుంబాలకు ఆసరాగా మారాయి. లక్షమంది బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. బీసీల జీవితాల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తూ చేతివృత్తులనే నమ్ముకున్న చేతులకు బలాన్ని అందించటం కోసమే గ్రామీణ తెలంగాణలోను బలోపేతం చేసే పని కేసీఆర్ చేపట్టబోతున్నారు. బీసీ కులాల చేతివృత్తులన్నీ సంపదలనందించే వృత్తులుగా తీర్చిదిద్దేపని యుద్ధప్రాతిపదికగా ముందుకు సాగవలసిఉంది. బీసీల ఆర్థికమూలాలు బలోపేతం చేసేందుకు దార్శనికతతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాకముందు ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు చేనేత కార్మికుల పాలిట సంపదల క్షేత్రంగా మారింది. సమాజంలో కీలకభాగమైన బీసీల జీవితాల్లో మార్పురావాలంటే ఈ చేతివృత్తులద్వారా గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. మన ఉత్పత్తులను మనమే వాడటం, వాటిలో నాణ్యతను పెంచి నైపుణ్యతను సంతరించుకుంటే అవి మేడిన్ తెలం గాణ ఉత్పత్తులుగా మారగలుగుతాయి. బీసీల కులవృత్తులు ఆధునీకరించటం ద్వారానే ఆ వర్గీయులు ఆర్థికంగా స్థిరపడి శిరసెత్తుకుని నిలుస్తారు. ఈ వర్గాలలో తరతరాలుగా స్కిల్‌సెట్ ఉంది. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వస్తువులను తయారుచేసే సాంకేతికతను ఈ కులవృత్తులకు జోడించాలి. వీళ్లదగ్గర నుంచి తయారుచేసే వస్తువులు అంతర్జాతీయ ప్రమాణాలను పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మేడిన్ తెలంగాణ బ్రాండెడ్ వస్తువులుగా మార్కెట్లో నిలువగలుగుతాయి. తెలంగాణలోని గ్రామీణ, పట్టణాలలో ఈ వృత్తినైపుణ్యాలను ఆధునీకరించి చేతివృత్తులకు అండగా నిలవాలన్న కేసీఆర్ సంకల్పంతో మలి అభివృద్ధి ఘట్టం మొదలుకానుంది. సంచారజాతులుగా మిగిలిన వాళ్లకు జీవనభృతి, స్థిరజీవితం నెలకొల్పి వారి నైపుణ్యాలకు ఆధునికతను అద్దాలి. గ్రామీణ పేదరికం లేకుండా చూడాలి. మనకున్న చేతివృత్తులు వాళ్లజీవితాలను మార్చి సమస్త సంపదల కేంద్రాలుగా మారాలి. ఈ విషయంలో వృత్తికళల నైపుణ్య తెలంగాణను దేశానికి నమూనాగా అందించాలన్న కేసీఆర్ తలంపు ఎంత తొందరగా పూర్తయితే సమాజంలో సగభాగం బీసీల జీవితాలు అంత త్వరగా స్థిరపడతాయి. సహస్రవృత్తుల సమస్తకళల ఆధునిక వైభవంగా తెలంగాణ విలసిల్లాలి. నైపుణ్యవంతమైన బీసీ చేతివృత్తులను ఉత్పత్తికేంద్రాలుగా మార్చే కొత్తశకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతూ తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టంచేయనున్నారు. వ్యాసకర్త జూలూరు గౌరీశంకర్ కవి, విమర్శకులు మొబైల్ : 94401 69896 -
కరోనా యుద్ధకాలంలో బడి నిర్వహణ
ఆకలిని తీర్చే అన్నంముద్ద ఎంత ముఖ్యమైనదో, సమా జాన్ని నడిపించే జ్ఞానం అంతే ముఖ్యమైనది. అందుకే బడి చాలా ముఖ్యమైనది. అందరికీ చదువుకొనే అర్హత లేదన్న దగ్గర్నుంచి మన విద్యా భ్యాసం మొదలైంది. ఈ బడి అందరిదీ కావటానికీ, ఆడ పిల్లలు బడిలోకి అడుగు పెట్టడానికీ ఎన్నెన్నో పోరా టాలు, ఎంతెంతో మానసిక అలజడులు, సంఘర్ష ణలూ జరిగాయి. బడిని మనం సంరక్షించుకున్న ప్పుడే, ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుం టుందన్న’ కొఠారి చెప్పిన మాట సంపూర్ణ ఆచరణ రూపం దాల్చుతుంది. ఈ కరోనా కాలంలో బాలలను రక్షించుకుంటూ ముందుకుసాగే కరిక్యులంను తయారుచేసుకోవాలి. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో పాటుగా కరోనా స్టాండర్డ్స్‌తో తరగతి గది రూపకల్పన జరగాలి. ఇంటి కంటే ఎక్కు వగా బడిలో ఉండే పిల్లలపై తల్లిదండ్రులకంటే అత్యంత శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత బడి నిర్వా హకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. కష్టకాలంలో ఆర్థిక వనరులు, వసతు లను ఏ మేరకు వినియోగించుకుని బడిని ఎట్లా నడి పించుకోవాలో ఏ స్కూలుకు ఆ స్కూలు స్థానిక ప్రణా ళికలను తయారుచేసుకోవాలి. మాస్కులు తయారు చేసుకోవటానికి ప్రభుత్వం చేనేత బట్టను అంద జేస్తుంది. పిల్లలకు కుట్టుమిషన్‌పై కొంత అవగాహన కల్పించి ఒకటి రెండు మిషన్లను ఇస్తే పిల్లలు క్రాఫ్ట్ పని కింద తమకు కావాల్సిన మాస్కులు తామే తయారు చేసుకోగలుగుతారు. ఎ క్కడికక్కడ గ్రామ సచివాలయాల్లోనే శానిటైజర్స్‌ను తయారుచేసుకునే స్థితిరావాలి. మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందిం చడంలో భౌతికదూరం ఎలా పాటించాలో పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను తయారు చేస్తుంది. ఆట స్థలాల్లోకి వెళ్లటం, బస్సుల్లో ఎక్కేటప్పుడు, కూర్చునే టప్పుడు, స్కూలు ప్రాంగణంలో ఉండే విధానం, ఎదుటివారిని పలకరించుకునేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఎలా మెలగాలి, వూర్లో నడుచు కుంటూ పోయేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి వాళ్లు మంచినీళ్లు వెంటతెచ్చుకోవటం, తిన్న కంచాలను శుభ్రపరుచుకోవటం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ చేతులు కడుక్కోవటం, చేతి రుమాళ్ల వాడకం, పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవటం లాంటి జాగ్రత్తలన్నీ విద్యార్థులకు ప్రత్యేకించి చెప్పాలి. మార్నింగ్ అసెంబ్లీ ఉంటుందా, ఉండదా? క్లాస్‌లో, స్కూల్లో పిల్లలు ఉండే విధానం, అంత ర్జాతీయంగా యునెస్కో సూచించిన సూచనలు దేశంలోని ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సంస్థలు తెలియజేస్తాయి. ఒకటి నుంచి 10 తరగతుల వరకు పిల్లలకు ఉపాధ్యాయులు నేరుగానే బోధన చేయాలి. అది తప్పదని విద్యారంగ నిష్ణాతులు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలి. పిల్లల సంఖ్యను తగ్గించటానికి పనిదినాల్లో మార్పులు చేయడం, రోజు విడిచి రోజు స్కూలు నడపాలా, వద్దా? షిఫ్ట్ సిస్టమ్ ఉండాలా, వద్దా? తరగతిగది రూపురేఖలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శక సూత్రాలు ప్రకటిస్తాయి. ఇక హాస్టల్స్ నిర్వహణ అతిముఖ్య మైంది. రాష్ట్రంలో 1,000కి పైగా వున్న గురుకులాల్లో విద్యాబోధనకు ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసు కోవాలి. కరోనా నేపథ్యంలో వాటి విస్తీర్ణత పెంచ వలసి ఉంటుందా ఆలోచించాలి. హాస్టల్ గదులలో విద్యార్థుల సంఖ్యను శాస్త్రీయంగా నిర్ణయించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకులాలను నెలకొల్పింది. ఈ గురుకులాల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణలో 5 లక్షల పేద, బీద కుటుంబాల పిల్లలకు ఈ గురుకులాలు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. సంచారజాతుల పిల్లలు ఈ గురుకులాల్లో చేరి నాణ్యమైన విద్యను పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆది వాసీ వర్గాలకు చెందిన ఈ గురుకులాలు అత్యాధునిక కార్పొరేట్ స్థాయి సంస్థలను మించిన స్కూళ్లగా నిలిచాయి. పదవతరగతి విద్యార్థుల అత్యధిక ర్యాంకులు, అత్యధికశాతం ఫలితాలు ఈ సంస్థలనుంచే వస్తున్నాయి. కరోనా కాలం సవాళ్లను ఈ గురుకులాలు తీసుకుని దిగ్విజయంగా విద్యాబండిని ముందుకు నడిపించే శక్తి వీటికి ఉంది. కరోనా కాలంలో బడినిర్వహణ అన్నది పెద్ద సవాల్. ఈ సవాల్‌ను స్వీకరిస్తూ రేపటి తరాన్ని తయారుచేయవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాల పైన, బోధించే గురువులపైన, తల్లిదండ్రులపైన, పౌరసమాజాలపైన ఉంది. అవును, అప్పుడే తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపకల్పన జరుగుతుంది. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త కవి, విమర్శకులు మొబైల్ : 94401 69896 -
కరస్పర్శ కరువైన వేళ...!
ఇది యుద్ధమే. ఆయుధాలులేని యుద్ధం. భయాన్ని భయపెట్టి, ధైర్యాన్ని గురి పెట్టాలి. కాలం ఎన్నికల్లోలాలను కనలేదు చెప్పు. ఎన్నెన్ని గత్తర్లకు కత్తెరెయ్య లేదు చెప్పు... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న సమయంలో వాటిని తొలగించి ధైర్యం చెప్పి నిలపవలసిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇతరులు ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవలసిన మానవతా బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. వ్యక్తులు కాకుండా మొత్తం సమాజమే ప్రమాదంలో పడ్డప్పుడు ప్రతి ఒక్కరూ ఆపదలను జయించటానికి సిద్ధం కావాలి. అందుకోసం ప్రజలను సన్నద్ధం చేసేపనిని చేస్తూ ప్రజలను ఆపదల నుంచి దరిచేర్చేందుకు కేసీఆర్ పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కరోనా దూసుకొస్తున్న ఈ ప్రమాద ఘంటికల్లో మానవత్వానికి ప్రమాదం వచ్చింది. ఈ సందర్భంలో సీఎం చేస్తున్న పని గొప్పది. ఇలాంటి సంకటస్థితిలో మనిషిని మనిషి ద్వేషించే స్థితినుంచి మానవీయ దృక్పథాన్ని ప్రతిష్టించవలసిన సందర్భం ముఖ్యమైనది. శుభ్రతా పరిశుభ్రతలను ఖడ్గాయుధాలను చేసుకుని, ఈ తాజా గత్తరకు ఘోరీ కట్టాలి. శ్వాసకు ధైర్యకవచాలను ధరింపచేయాలి. కనిపించని శత్రువుపై చేస్తున్న సామూహిక యుద్ధం సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ స్వీయ ఆరోగ్య పరిరక్షణా చర్యలు అవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కునేందుకు కఠినచర్యలు తీసుకుంటూనే ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాశ్రయాలనుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల దగ్గరే పరీక్షలు నిర్వహించి ఈ నేలమీదకు కరోనాను విస్తరించకుండా చేసేందుకు మొత్తం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. శ్వాసనాళాల దగ్గరే, పరిశుభ్ర నాలాల దగ్గరే దాన్ని మట్టుబెట్టాలి. దాన్ని పసికడితే చాలు, ఈ ప్రపంచం పొలిమేరలు దాటించవచ్చు. అప్రమత్తతే ఆయుధం. కడిగేయటమే పరిష్కారం. కరచాలనమే ఖడ్గ చాలనం. ప్రణామమే ఖడ్గ ప్రవాహం. పల్లె పట్టణ ప్రగతులే విషప్రాణిని చుట్టుముట్టే పద్మవ్యూహాలు. మన ఉష్ణమండల కాసారాలతో, నిప్పుకణికల ఎండలతో, శత్రువును నిలువరిద్దాం పద. ఇది ఆయుధాలులేని మహాయుద్ధం. మనిషి ఉనికినే అంతం చేసి ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్ మహామ్మారిని ఈ ప్రపంచ పొలిమేరల దాకా తన్నితన్ని తరిమేయటానికి మనందరం కలిసి రెండు చేతులూ శుభ్రంగా కడుక్కుందాం. మన దృష్టిని మరల్చుకోకుండా లక్ష్యాన్ని ముక్కుతో నలుపుకోకుండా ధైర్యాన్ని గురిపెట్టిన బాణం చేసి వదలాలి. మన చేతుల్ని కడుక్కుని యుద్ధంపై పరిశుద్ధ యుద్ధం చేయాలి. పల్లె, పట్టణ ప్రగతుల శుభ్రతతోనే రూపంలేని విపత్తును తరిమితరిమి కొట్టాలి. తిరగబడ్డ నేలలకు పాఠాలక్కర్లేదు. శుభ్రం చేసిన చేతులే, పరిశుభ్ర పరిసరాలే శత్రుసంహారాలు. శత్రువు చావుబతుకులు మన చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. చేతులు కడిగి చప్పట్లు కొట్టి ఈ 3వ ప్రపంచయుద్ధాన్ని ప్రపంచం ఆమడల దాకా తరిమికొడదాం. పదండి ముందుకు. విరుగుడు లేనిది ఈ ప్రపంచంలో లేదు. మనందరి కట్టుదిట్టమైన కార్యాచరణే మహమ్మారి వైరస్‌కు విరుగుడు. శత్రు చొరబాటును మనకు మనమే గస్తీలు కట్టి కట్టడి చేద్దాం. మనకు మనమే విరుగుడు. దుఃఖ నదులకు ఆనకట్ట అప్రమత్త రెప్పలతోనే కట్టాలి. ఇది ఓ కవి పద్యంతో చేసే వైద్యం. కానరాని శత్రువుపై యుద్ధాన్ని ఆరోగ్య ప్రపంచంతోనే ఢీ కొట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జాడ ఇప్పటికి అంతగా లేకపోయినప్పటికినీ అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా ప్రదర్శిస్తున్న కర్కశత్వానికి ప్రజలు, పాలకులు జాగరూకతతో ఉండటమే సరైన సమాధానం. బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని, సామాజిక దూరాన్ని పాటిం చాలని ప్రచారప్రసార మాధ్యమాలు, విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవులను ఆసరా చేసుకుని బయటతిరిగితే కరోనాను కట్టడి చేయటానికి ఆటంకాలు ఏర్పడతాయి. సెలవులు ఇచ్చింది బైట తిరగటానికి, అనవసర ప్రయాణాలు చేయటానికి కాదు. వ్యాధి నివారణకంటే వ్యాధి నిరోధక చర్యలు ముఖ్యం. మాట్లాడని మాస్కే మందుపాతర. శుద్ధమైన చేయే తిరుగులేని అస్త్రం. శత్రువా నిన్నెట్లా నివారిం చాలో తెలుసు. చేతులు కడిగి నీకు నీళ్లొదులుతాం. పద్యం కూడా వైద్యమే. ఇది మూడవ ప్రపంచయుద్ధం. చేయీ చేయీ కడిగి దీన్ని ఓడిద్దాం. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్ ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు -
సమాజ వ్యక్తిత్వ వికాసం మొగిలయ్య
ఈ దేశంలో సామాన్యుల గరుకు జీవితాలన్నీ మహోన్నత వ్యక్తిత్వాలే. అలాంటి ఎందరెందరో సామాన్యులలో నిలిచిన ఒక సామాజిక పాఠం ఘంటా మొగిలయ్యది. 80 ఏళ్లకుపైగా జీవించి, జనవరి 10న కన్నుమూసిన ఘంటా మొగిలయ్య తన చుట్టుపక్కల సమాజాన్ని తన రెండు చేతులా ఒడిసిపట్టి కాలచక్రం వెంట కదిలాడు. మొగిలయ్యకు 9 ఏళ్లు వచ్చేసరికి తను పుట్టి పెరిగిన కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట వూరును వదిలివెళ్లాడు. తర్వాత దాస్వాడకు ఇల్లరికం వచ్చాడు. మానేరు ఒడ్డున 50 ఏళ్లున్నాడు. మానేరు డ్యామ్ నిర్మిస్తుంటే తన ఊరంతా ముంపునకు గురైతే మళ్లీ తన కుటుంబాన్ని, తన ఊరివారిని వెంటేసుకుని మూడో ప్రవాసానికి వెళ్లాడు. ఇదంతా పంబాల కులంలో పుట్టిన ఒక సాధారణ మనిషి జీవనయానం. తన మనవళ్లు, మనుమరాళ్ల వరకు పదుల సంఖ్యలో అందర్నీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఘంటా మొగిలయ్య ఊరు రక్షకునిగా ఎదిగి తన బిడ్డల్ని రాష్ట్రానికి మానవ వనరుగా అందించారు. మొగిలయ్యలో అట్టడుగున పడి కన్పించని చైతన్యం ఉంది. తన కుటుంబాన్ని, తన వూరును కంటిపాపలా కాపాడుకునేందుకు కావాల్సినంత ధిక్కారం మొగిలయ్యకు గుండె నిండా ఉంది. మనుషులంటే బోలెడు ప్రేమ. పంబాలకులం పతన్ దారీగా ఉన్న మొగిలయ్య గ్రామ సప్తదేవతల పూజారిగా జీవి తాన్ని ప్రారంభించి తను ఎదుగుతూ చివరకు జ్ఞాన జ్యోతిని చేతబట్టి నడిచిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ధూళికట్టకు, ధూళికట్ట నుంచి తిరిగి మల్లాపూర్‌కు వచ్చి ఒక బౌద్ధభిక్షువుగా సంచరించి మానేరు నది ఒడ్డున పుట్టి తిరిగి మానేరు నది ఒడ్డుకే చేరాడు. రేపటి పాఠం అడుగుల్లో అడుగులు వేయిస్తూ చిటికెన వేలుతో ఈ ప్రపంచంలోకి నడిపించిన బాపు ఇంటి సింహద్వారం సంకురాతిరి ముగ్గులాగా అమ్మ నుదుటి బొట్టులా మెరిసిన బాపు పాదముద్రలను వదిలి వెళ్ళిపోయిండు బాపూలేని ఇంటికి వెళ్ళిన చక్రపాణీ.. తలుపు తెరిచి చూడు బిడ్డల కోసం అనుభూతుల ముల్లెను మొగిలయ్య దాచి వుంచిండు చూడు ఇదే రేపటి పాఠం.. అదే ప్రపంచం (నేటి మధ్యాహ్నం కరీంనగర్ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఘంటా మొగిలయ్య సంస్మరణ సభ) – జూలూరు గౌరీ శంకర్ కవి, ప్రముఖ సామాజిక వ్యాసకర్త -
జీవధార కాళేశ్వరం... ఆధునిక భాగీరథి
దక్కన్ నేల ఏ క్షణంలోనూ కలలో కూడా కనని కమ్మటి కల కాళేశ్వరం. తెలంగాణ నేలకు ఏనాడూ లేని జలకళ కాళేశ్వరం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఊపిరిని ఫణంగా పెట్టి నిరంతర శ్రమతో కాళేశ్వర నిర్మాణంగా మారారు. కాళేశ్వరం బీడుభూములకు ఊపిరిపోస్తూ రైతుకు కొత్త జీవి తాన్ని వాగ్దానం చేయనుంది. కాళేశ్వరం తెలంగాణ సస్యశ్యామల గీతానికి పల్లవిగా మారుతుంది. ప్రజల గుండెల్లోని స్వప్నాల్ని కాళేశ్వర జలగీతంగా అనువదించిన ఉద్యమనేత మన ముఖ్యమంత్రి. భూమి దేహంలో సిరలు, ధమనుల్లాంటి సొరంగాలు నిర్మించి ప్రజల ఆకుపచ్చ ఆశయాల్ని నెరవేరుస్తున్నవేళ తెలంగాణ విద్వత్తంతా కాళేశ్వరం విద్యుత్తా అని లోకం నివ్వెరబోతున్న వేళ ... తెలంగాణీయుల ఆనందం ఎత్తిపోతల జలపాతంగా మారింది. తెలంగాణ నేలపై గంగమ్మ ప్రవహించాలని కాలమే కళ్లల్లో వొత్తులేసుకుని ఎదురుచూసింది. చూసీచూసీ కళ్లుకాయలు గాసాయేకానీ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల మనసు మాత్రం కరగలేదు. తెలంగాణ కన్నీళ్లతోనే, ఇంకిన కనుకొనలనుంచే రాష్ట్రసాధన ఉద్యమ పొలికేక వేసి నీళ్లకోసం జనతరంగాలు కదిలాయి. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమకారుడైన కేసీఆర్‌నే పాలకుడు కావటంతో కోటిఎకరాలకు నీళ్లందించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొని మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేశారు. జలస్వప్నాలను నిజంచేస్తూ కరువుగరుకు నేలపైకి గంగమ్మను తనరెండు చేతులతో తోడి నీటిని కిందినుంచి పైకి తెచ్చి ప్రవహింప చేసిన భగీరథుని పని కేసీఆర్ పూర్తిచేశారు. ఇది అద్వితీయం. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లపాలన దేశానికే రోల్‌మోడల్‌గా తయారైంది. ప్రపంచం తెలంగాణవైపు చూసేందుకు కారణభూతమయ్యాయి. నీళ్లపై తనకున్న అపారమైన పరిజ్ఞానంతో అసెంబ్లీలోనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి శాసనసభలో నీళ్ల టీచర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కేసీఆర్ మేధోతపస్సుతో చేసిన కృషి ఫలించి కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే పూర్తిచేయటం దేశంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదొక రికార్డుగా మిగిలిపోతుంది. ఇది మామూలు యత్నంకాదు. చాలా కష్టమైన పనిని కేసీఆర్ చేపట్టారు. కాళేశ్వరం మొదలైన దగ్గర్నుంచి ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడినా కేసీఆర్ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. కోటిఎకరాలకు నీళ్లందించాలన్న తలం పుతోనే పట్టుదలనే ప్రాణం చేసుకుని ముందుకుసాగారు. ఇది మామూలు సంకల్పమా? ఈ పని ఇంత త్వరగా ఎవరు మాత్రం పూర్తిచేయగలరు? కేసీఆర్ వజ్ర సంకల్పానికి ఆచరణాత్మకంగా పనికూడా వేగంగా జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతెంత చెమట చిందిందో? ఈ వజ్ర సంకల్పసాకారానికి నిరంతరం పడ్డ శ్రమ, పలురంగాలకు చెందినవాళ్లు చేసిన కృషి అపూర్వమైనది. ఇంజనీర్లు, కార్మికులు చిందించిన చెమట వెలకట్టలేనిది. అడుగడుగునా అడ్డుతగులుతున్న అడ్డంకుల్ని ఎదుర్కొంటూ, ప్రాజెక్టు అనుమతులను పొందుతూ, పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలను కొనసాగిస్తూ ముందుకు సాగ టం అన్నది తీగమీద నడకలాంటిది. దాన్ని కేసీఆర్ ఒడుపుగా సాధించారు. కేంద్రం నుంచి అనుమతులను పొందగలిగారు. అనతి కాలంలోనే హైడ్రాలజీ అనుమతులు, పర్యావరణ, అటవీశాఖల అనుమతులను సాధించారు. తెలంగాణ జీవధార, ప్రజలకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికోసం కేసీఆర్ పడ్డ తపన, శ్రమ, కఠోర తపస్సు తక్కువదేంకాదు. కేసీఆర్ కాకుండా మరెవ్వరూ ఈ పనిని ఇంత పకడ్బందీగా ఇంత తక్కువకాలంలో పూర్తి చేయలేరు. తెలంగాణ ఎందుకోసం అంటే ఇదిగో ఈ కాళేశ్వరం వరదాయినిని సాకారం చేసుకోవటం కోసమని తెలంగాణ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది. 2016 ఆగస్ట్‌లో అగ్రిమెంట్ చేసుకుని 2016 మే 2న మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఇంత తక్కువకాలంలో ఇంతపెద్ద ప్రాజెక్టు పూర్తిచేయటం దేశ చరిత్రలోనే జరగలేదు. ఇది ఒక నూతన అధ్యాయం. రెండేళ్ల పదినెలల కాలంలోనే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మించడం మొత్తం పాలనారంగ చరిత్రలోనే ఒక అద్భుతం. నోళ్ళెండిన బీళ్ళ నెర్రెలలోకి పారడమే నదికి సార్థకత. వరద సాఫల్యత నేల పొదుగు నిమిరి పంట తల్లి పారవశ్యానికి స్తన్యం పట్టడమే. అల కదిలి రైతు ఒడినింపి లోకానికి జీవధార కావడమే జల కల. నీటికి నడకలు నేర్పి దారి మళ్ళించి భూ మార్గం పట్టించడమే రాజు సమర్థత. జలనిర్వహణ తెలిసిన పాలకుడే జనం గుండె గలగల వినగలిగిన నాయకుడు. నీటిని మునివేళ్ళ మీద ఆడించగల యుక్తి, జనానికి ఏంకావాలో తెలుసుకోగల శక్తి వున్న ఏకైక ధీరుడు కేసీఆర్. అవును... ఇప్పుడు అపర భగీరథుడు కేసీఆర్. ఆధునిక భాగీరథి కాళేశ్వరం. (నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా) వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్సభ్యులు సెల్ : 94401 69896 -
లక్షమంది బీసీలకు గురుకులాల విద్య
బహుజన సామాజిక వర్గాలలో మార్పుకు, అన్ని రంగాలలో వారు దూసుకుపోతూ శిరసెత్తుకుని నిలవటానికి విద్యే ప్రధాన సాధనమని చెప్పిన బహుజన పితామహులు మహాత్మాజోతిభాపూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ల ఆలోచనా ధారల్లో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. అందరూ మాటలు చెప్పేవారే కానీ ఆచరణ చేసి చూపే వారేరన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ అవతరణ తర్వాత బహుజన వర్గాలకోసం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు దినదినాభివృద్ధి చెందుతూ పురోభవిస్తున్నాయి. గురుకుల పాఠశాలలు పటిష్టవంతంగా నిలవటానికి కేసీఆర్ బలమైన పునాదులు వేస్తున్నారు. ఇది సబ్బండవర్ణాలు ఆహ్వానించదగ్గది మాత్రమే కాకుండా బహుజన వర్గాల చైతన్యానికి ఎంతో దోహదపడతాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు మూడు గురుకుల పాఠశాలలు, మూడు ప్రాంతాలలో మూడు జూనియర్, డిగ్రీ గురుకుల పాఠశాలలు నెలకొల్పటం, ఆ తర్వాత మానవవనరుల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలనే నవోదయ విద్యాసంస్థలుగా దేశవ్యాపితంగా ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాపితంగా 29 రాష్ట్రాలలో జిల్లాకు ఒకటి చొప్పున 600 నవోదయ విద్యాసంస్థలున్నాయి. 1986లో జాతీయ విద్యావిధానంలో భాగంగా 12వ తరగతి వరకు విద్యను బోధిస్తూ నవోదయ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం 906 గురుకుల పాఠశాలలు, 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. ఈ ఏడాది అంటే 2019 విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 56 ఏళ్లపాలనలో బీసీ రెసిడెన్షియల్ గురుకులాల సంఖ్యే 280 దాకా వచ్చాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గం పరిధిలోకి గురుకుల పాఠశాలలు వచ్చేశాయి. ఇది గుణాత్మక మార్పుగా చెప్పాలి. ఇది విప్లవాత్మక పరిణామం. అందరూ చెప్పేవారే కానీ ఈ వర్గాలలో విద్యాభివృద్ధికి కృషిచేసిన వారేరన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానంగా మిగులుతారు. సరిగ్గా బహుజన సమాజం కోరుకునేది అన్ని రంగాలలో తమ భాగస్వామ్యం. అందుకు తొలి మెట్లు విద్య. ఆ రంగంలో స్థిరపడితే అన్ని రంగాలలోకి బహుజనవర్గం దూసుకుపోతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు 90శాతం దాకా ఉన్నారు. ఈ వర్గాల అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధి అన్న దార్శనికత కేసీఆర్‌కుంది. అందుకే ఈ వర్గాల సంక్షేమం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఉంది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏడాది లక్షన్నరకుపైగా ఖర్చుచేస్తూ పౌష్ఠికాహారం, దుస్తులు, మంచి చదువు, ఆరోగ్యకరమైన వాతావరణంలో గురుకుల పాఠశాలలున్నాయి. సమాజంలో సగభాగమైన బీసీల కోసం అదనంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పటంతో ఆయావర్గాలు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ గురుకుల పాఠశాలలు రాబోయే 10 ఏళ్ల తర్వాత మరిన్ని మంచి ఫలితాలనిస్తాయి. ఇక్కడనుంచి తయారయ్యే విద్యార్థులు సమాజంలో జరిగే మార్పులకు కేంద్రబిందువుగా నిలుస్తారు. ఈ గురుకుల పాఠశాలలను బహుజనవర్గాలే కంటికి రెప్పలా కాపాడుకోవలసిన అవసరం ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలూ అందించనంత ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. బహుజన బిడ్డలకు సంతృప్తికరమైన పౌష్ఠికాహారంతోపాటు వారికి మంచి వైద్యసదుపాయాలు అంది స్తున్నారు. క్రీడల్లో, సాంస్కృతిక రంగాల్లో ఈ పిల్లలు శక్తివంతులుగా ఎదుగుతున్నారు. మొత్తంగా పదవతరగతి, ఇంటర్‌ఫలితాల్లో బహుజన విద్యాసంస్థలే అత్యధికశాతం ఫలితాలు సాధించటమేగాక ర్యాంకులన్నీ వీళ్లే స్వంతం చేసుకుంటున్నారు. ఆంగ్ల బోధనలో విద్యార్థులు సాధనచేస్తున్నారు. ఒక బీసీ గురుకులాల్లోనే లక్షమంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది బీసీ విద్యార్థులకు ఈ గురుకులాల ద్వారా విద్యనందించటం విశేషం. తెలంగాణ సమాజ మంతా శక్తివంతం కావటానికి ఈ స్కూళ్లు దోహదకారులవుతాయి. భవిష్యత్ కాలంలో రాబోయే విప్లవాత్మక మార్పులకు గురుకులాలనుంచి వచ్చిన వారే శ్రీకారం చుడతారు. బహుజన వర్గాల పిల్లల చైతన్యం గురుకులాల నిండా నిండి ఉన్నంతకాలం ఆ వర్గాల మనస్సులో తెలంగాణ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అదే జ్ఞాన తెలంగాణకు బాటలు వేస్తుంది. -జూలూరు గౌరీశంకర్ (వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్సభ్యులు ‘ 94401 69896) -
తెలంగాణ మాణిక్యం మారంరాజు
అధ్యాపకుడుగా, ప్రొఫెసర్‌గా, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. సామాజిక అంశాలపై అనేక రచనలు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ఆయన మాటల్లో, ఆయన నడతలో, ఆయన ఆచరణలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. తెలంగాణ, ఉర్దూ, పారశీ పదబంధాలు మారంరాజు సత్యనారాయణరావుకు కొట్టిన పిండి. తెలంగాణ గ్రామాయణం ఎలా ఉండేదో అలవోకగా చెప్పుకుంటూ పోయేవారు. హైదరాబాదు రాజ్యపాలనా వ్యవస్థపైన మారంరాజుకు సమగ్రమైన అవగాహన ఉండటంతో ఆయన తెలంగాణ గ్రామీణ వ్యవస్థను రచించేందుకు పూనుకున్నారు. ఆనాటి విధానాన్ని ప్రజలకు, రాజ్యానికి మధ్య ఉండే సంబంధాల్ని మారంరాజు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘తరమెల్లిపోతున్నది ఆ త్యాగాల స్వరమాగిపోతున్నది’’ అన్న గోరటివెంకన్న పాట సాక్షిగా తెలంగాణ సమాజ మూలాలు తెలిసిన మారంరాజు సత్యనారాయణరావు శనివారం కన్నుమూశారు. 70 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లా ఉంది? ఆనాటి తెలంగాణ జీవనవిధానం, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉండేవి? తెలంగాణ సమాజం నిర్మాణం ఎట్లా ఉంది? నిజాం ఏలుబడిలో తెలంగాణ ఎట్లా ఉంది? ఆనాటి పటేల్, పట్వారీ వ్యవస్థలు, గ్రామం, గ్రామ నిర్మాణం, పాలనా వ్యవస్థ, రెవెన్యూ చట్టాలు ఇవన్నీ చూసిన కళ్లు ఈనాటి తెలంగాణ సమాజంలో కొందరివే. అలాంటి రెండు కళ్లు మారంరాజు సత్యనారాయణరావువి. ఆయన జయశంకర్ తరం మనిషి. ఆయన గట్టి తెలంగాణవాది. ఇప్పుడు రవీంధ్రభారతి ఉన్న ప్రదేశంలో ఒక హాస్టల్ ఉండేదన్న విషయం అందరికీ తెలియదు. 60 ఏళ్ల క్రితం సిటీ కాలేజీ ఎలా ఉండేదో ఈనాటి తరానికి తెలియదు. ఇప్పుడున్న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఒకప్పుడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటి కార్యాలయమని ఎంతమందికి తెలుసు. ఆ కార్యాలయం నుంచే మారంరాజు సత్యనారాయణరావు తొలి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటాచక్రపాణి ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగం పొందినప్పుడు ఈ సత్యనారాయణరావే సంతకం చేశారు. ఆయన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్‌గా, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రా్టర్గా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఆయన సామాజిక అంశాలపై అనేక రచనలు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ఆయన మాటల్లో, ఆయన నడతలో, ఆయన ఆచరణలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. తెలంగాణ, ఉర్దూ, పారశీ పదబంధాలు మారంరాజుకు కొట్టిన పిండి. ఆయనతో మాట్లాడుతుంటే తెలంగాణ గ్రామాయణం ఎలా ఉండేదో అలవోకగా చెప్పుకుంటూ పోయేవారు. సత్యనారాయణరావు ఖమ్మం ప్రభుత్వ కళాశాలలో రాజకీయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. భారత రాజకీయ శాస్త్ర సంఘానికి 1982, 83లో జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి రాష్ట్రరాజకీయాలు, మంత్రివర్గాల తీరుతెన్నులపై ఆయన పరిశోధన చేసి ఉస్మా నియా విశ్వవిద్యాలయంనుంచి పిహెచ్డీ పొందారు. దాని తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాలు’ గ్రంథాన్ని ప్రచురించారు. ఆయన రాజనీతిశాస్త్ర అధ్యాపకుడుగా పాఠ్యగ్రంథాలు రాశారు. ‘రాజకీయ, సామాజికశాస్త్రం’, ‘ఎన్నికలు’, ‘రాజకీయాలు’, ‘ఇది తెలంగాణ’తోపాటు జాతీయ, అంతర్జాతీయ సంబంధాలపై డిగ్రీ, పీజీ విద్యార్థులకు అనేక పాఠ్యాంశాలను రాశారు. ఆయన రాజమండ్రిలో కొంతకాలం అధ్యాపకుడుగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో తోటి అధ్యాపకులు, విద్యార్థులకు తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ కళలను సవివరంగా చెప్పే వారు. తెలంగాణకున్న ప్రత్యేకత ఏమిటని వాళ్లడిగిన ప్రశ్నలన్నింటినీ 50 ఏళ్ల క్రితమే నివృత్తి చేశానని ఆయన చెబుతుండేవారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాల తీరుతెన్నులపై ఆయన పరిశోధనలు చేస్తున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రులతో ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసి, వారి పరిపాలనా పద్ధతులను, వారి పాలనా శైలులను సవివరంగా అందించారు. విశాలాంధ్ర బాధలు అన్న అంశంపై 1970–2000 దశకాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అప్పటి నాయకత్వం తీరుతెన్నులు, ఆంధ్రా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య వైరుధ్యాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, రాష్ట్రరాజకీయాలపై దాని ప్రభావం తదితర అంశాలపై ఆయన కూలంకషంగా రాశారు. ఆనాటి రాజకీయపార్టీల తీరుతెన్నులు, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ఆయన సావధానంగా రాశారు. వరంగల్‌లో మొదలైన ముల్కీ ఉద్యమం, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కొందరు పరోక్షంగా సహకరించడం, పోలీసు కాల్పుల తర్వాత సిటీ కాలేజీ ఉదంతం, ముల్కీ పూర్వాపరాలు, దాని పుట్టుక, వ్యాప్తి, స్వభావం లాంటి అంశాలపై మారం రాజుకు గట్టిపట్టుంది. 1952–1969 మధ్యకాలంలో జరిగిన రాజకీయపరిణామాలు, హైదరాబాదు రాష్ట్ర అవతరణ, ముల్కీ ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పం దం తదితర అంశాలపై మారంరాజు ఆసక్తికరమైన వాస్తవ అంశాలను చర్చించారు. ఘంటా చక్రపాణి మారంరాజు శిష్యుడుగా ఆయన రచనలను వెలుగులోకి తేవాలని తపించాడు. అందుకు నన్ను పురికొల్పాడు. దాంతో మారంరాజు వెంటపడి రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది. మారంరాజు ఈ తరానికి అందించాల్సిన కొన్ని ముఖ్యపుస్తకాల గురించి ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆనాటి తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు అసెంబ్లీకి సంబంధించిన ఒక డిక్షనరీని ఎంతో కష్టపడి తయారుచేయించారు. ఆ డిక్షనరీని తెలం గాణ పదబంధాలతో ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందని తపించాడు. అందుకోసం కొంతకృషి కూడా చేశారు. ఆనాటి తెలంగాణ సమాజంలో ఉన్న అనేక పదాలకు అర్థాలను చెప్పేవారు. అగ్బార్ అంటే వార్తా పత్రిక, అప్సర్ అంటే ప్రభుత్వ అధికారి, అసల్దార్ఖాన్ అంటే గ్రామాధికారి తయారుచేసే భూవివరాలలో యాజమాన్యం దాఖల చేసే రికార్డు అని ఇప్పటి వారికి తెలియదు. ఇలాంటి అనేక పదాలను ఈ తరానికి విప్పిచెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన గ్రామా యణం రచనకు పూనుకున్నారు. భూమి ఆధారిత జనావాసాల కొనసాగింపు, భూమికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ, ఆ పదబంధాలు, ఆనాటి భూమికి సంబంధించిన పహాణీలు వీటిపై సమగ్రమైన సమాచారం ఆయనదగ్గరుంది. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఎలాంటి వ్యవసాయ వ్యవస్థ ఉందో సరైన ఆధారాలు ఇప్పటికీ దొరకడం లేదు. సాలార్జంగ్ సంస్కరణలపై సమగ్రమైన పట్టుంది. హైదరాబాదు రాజ్యపాలనా వ్యవస్థపైన మారంరాజుకు సమగ్రమైన అవగాహన ఉండటంతో ఆయన తెలంగాణ గ్రామీణ వ్యవస్థను రచించేందుకు పూనుకున్నారు. గ్రామాల చరిత్ర మూలాలు ఎప్పట్నుంచి మొదలయ్యాయో రాతపూర్వకంగా రికార్డులు లేవు. ఆనాటి విధానాన్ని ప్రజలకు, రాజ్యానికి మధ్య ఉండే సంబంధాల్ని మారంరాజు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామ పాలనావ్యవస్థపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ‘తెలంగాణ గ్రామాయణం’ రచనను పూర్తిచేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి అందజేయాలని ఆయన ఎంతో తపనపడ్డారు. కానీ, ఆ పుస్తకాన్ని కేసీఆర్‌కు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. నువ్వు లేకున్నా ఆ పుస్తకాన్ని భద్రంగా అందజేస్తాం. ఈ తరానికి నీ ఊసులన్నీ చెబుతాం. హైదరాబాదు రాష్ట్రాన్ని చూసినవాడా, తెలంగాణ కావాలని తపించి.. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి పోయినవాడా–నీకు సెలవు. -జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు -
పూసలతల్లికి స్థిరజీవితమొద్దా?
సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. తరతరాలుగా అలంకృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే నూతన రాష్ట్రంలో జరగాల్సింది. గంపలో పెట్టుకున్న వస్తువులు వారి వ్యాపారం. ‘గంప’ తరతరాలుగా వాళ్లకు తిండిబెట్టే జీవనాధారం. ‘గంప’ నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులను అమ్ముకుంటూ వచ్చిన నాలుగురాళ్లతో తరతరాలుగా కుటుంబాలను గడుపుతున్న వాళ్లు పూసల కులస్తులు. ఆడవాళ్ల అలంకార సాధనమైన చేతులకు గాజులు వేస్తూ ఆ తల్లులు ఇప్పటికీ గంపను నెత్తిన మోస్తూ సంచారం చేస్తూ కుటుం బాలను సాకుతున్నారు. మాతృస్వామిక వ్యవస్థను కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తూ ఇప్పటికీ మిగిలి వున్న ఏకైక కులం పూసలకులం. సంచారంచేస్తూ ఊరూరా తిరుగుతున్న ఆ తల్లులు ఇంటిని దిద్దే ఇల్లాళ్లే కాదు, ఇంటిని నడిపించే ఆర్థిక రథసారథులు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఈ పూసల తల్లులు సామూహికంగా వందల సంఖ్యలో గంపలను నెత్తిన పెట్టుకుని ర్యాలీలు చేశారు. తెలంగాణలో ఈ కుల స్తులు 70 వేలకు పైచిలుకు ఉంటారు. ఈ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగానే తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూసల కులస్తుల బాధలు తీర్చేందుకు ఆలోచనలు సారించారు. ఎంబీసీలు, సంచారజాతుల వారితో అనేకసార్లు సమావేశమై పూసల కులస్తులను సొంతకాళ్లపై నిలబెట్టే కసరత్తు మొదలు పెట్టారు. పూసల తల్లులు ఆడవారి అలంకృత సామానులు విక్రయిస్తారు. ఒక రకంగా వందల ఏళ్లుగా సంచారం చేస్తూ ఆడవారికి మరింత అందానిచ్చే నడుస్తున్న బ్యూటీపార్లర్లు పూసలవాళ్లు. గాజుల అమ్మకమే వీరి ప్రధానవృత్తి. గంపలో గాజులతో పాటు తాళాలు, అలంకృత సామాన్లు కూడా విక్రయిస్తారు. సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ పూసల కులస్తుల జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. చేతి నిండా గాజులు వేసి ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచే ఆ పూసల తల్లి మాత్రం సంచారంచేస్తూ చిట్లిన గాజులుగా జీవిస్తున్నారు. తరతరాలుగా అలం కృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే జరగాల్సింది. ఊరూరా తిరిగి గాజులు అమ్మకానికి పెట్టుబడి కోసం వీళ్లు వడ్డీవ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వీళ్ల సంపాదన మొత్తం తిరిగి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కేసీఆర్ ఈ విషయానికి విరుగుళ్లు కనిపెట్టారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం చేసే విధంగా ప«థక రచన చేశారు. ఒక లక్షరూపాయల రుణమిస్తే అందులో 20 శాతం మాత్రమే లబ్ధిదారులు కట్టాలి. మిగతా రుణమంతా ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఒకవేళ ఆ 20శాతం కూడా కట్టలేని స్థితి ఉన్నవాళ్లకు మాత్రం బ్యాంకులు సాయం చేస్తాయి. వాళ్లు వ్యాపారం చేసుకుంటూ ఆ 20 శాతం రుణమాఫీ చేసుకోవాల్సి ఉంటుంది. గంప నెత్తిన పెట్టుకుని పొద్దు పొడవకముందే దళిత, బీసీ వాడలకు పోయి వాళ్లను నిద్రలేపి సబ్బులు, పౌడర్లు, గాజులు, దినుసులు, పొగాకు, తాళాలు, జ్వరం వస్తే ఇచ్చే మందుగోలీలు విక్రయిస్తారు. దళిత, బీసీ వాడలకు ముందే ఎందుకు వెళతారంటే వాళ్లు పొద్దున్నే వ్యవసాయపనులకు, కూలీ పనులకు వెళతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పేదలకు మొదట సబ్బు, పౌడర్లను పరిచయం చేసింది పూసల తల్లులే. వీళ్లు బుట్టలు, గంపలు నెత్తిన పెట్టుకుని రోజులపాటు సంచారం చేస్తూ తిరుగుతారు. అంగళ్లు, జాతరలు జరిగినప్పుడు నెలల తరబడి సంచారం చేయటం వల్లనే వీరి పిల్లలు చదువులో వెనుకబడ్డారు. సిరాజుల్ హుస్సేన్ రాసిన డొమోనియన్లో కులాలు, తెగలు, వాల్యుంలో పూసల కులస్తుల పుట్టు పూర్వోత్తరాలు రాశారు. వీళ్లు ‘‘చెంచు’’ తెగకు చెందినవారు. పూసలవాళ్లు అడవులను వదిలారు. గ్రామాలలోకి వచ్చారు. కానీ ఆదిమ ఆచారాలను మాత్రం విడువలేదు. వీళ్లునివసించే ప్రదేశాలను గూడెం, మిట్ట అంటారు. ఊరిపెద్దను మిట్టగాడు అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసేవారిని ‘‘కొండిగాడు’’ అంటారని సిరాజుల్ హుస్సేన్ రాశారు. వీళ్లకు మరుగుభాష కూడా ఉంది. ఈ మరుగు భాష తెలిసిన వారిని పరదేశి గాండ్లు అంటారు. వీళ్ల కులం వాళ్లు కలుసుకున్నప్పుడు ‘‘అడిమేన్ దాసోహం’’ అని ప్రత్యేక భాషలో నమస్కారం అని చెప్పుకుంటారు. వీళ్లు గ్రామాల్లో తిరిగి స్వేచ్ఛగా వస్తువులను అమ్ముకోవటానికి నిజాం రహదారి పత్రాలు ఇచ్చేవారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడివున్న వీరి కులంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. సివిల్ సర్వీస్, గ్రూప్ వన్ ఉద్యోగులు ఈ కులం నుంచి కనిపించరు. ఈ పూసల వారి జీవన విధానాన్ని తెలి యజేస్తూ గతంలో ‘‘మేము మనుషులమే’’, ‘‘మైనర్‌బాబు’’ వంటి సినిమాలు తీశారు.రాష్ట్ర ప్రభుత్వం పూసల కులస్తులకు చేసే సహాయ పథకానికి ‘పూసలతల్లి’’ పథకంగా పెట్టాలని సీఎం కేసీఆర్‌ని కోరుతూ బీసీ కమిషన్‌కు విన్నవిం చారు. పూసల కులాలకు ఆ కులంలో మహిళలే ప్రధాన జీవన ఆధారం కాబట్టి వారికి అందించే ఆర్థిక సహాయం పథకం పేరు ‘‘పూసలతల్లి’’ అని పెట్టాలని వీరు కోరుకుంటున్నారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
సంచార జాతుల వృద్ధి పథం
అభిప్రాయం రాబోయే పదేళ్లలో సంచార జాతుల పిల్లలందరికీ ఉన్నత విద్యావకాశాలు లభించేలా చేయాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు సంకల్పం. అది నెరవేరితే సంచార జాతుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఏ పాలకులు పట్టించుకోని సంచార జాతుల కులాల వారిని అక్కున చేర్చుకొని వారి జీవన విధానాన్ని తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు బడి గడప తొక్కని సంచార జాతుల పిల్లలను గుర్తించి వారిని చదువుల వైపునకు మళ్లించాలని ఆయన తపన. ఇప్పటివరకు ఏ రకమైన సాయం పొందని బాగా వెనుకబడిన కులాల వారి లెక్కలు తీయాలని, అందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన బీసీ కమిషన్‌ను ఆదేశిం చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 36 సంచార జాతులను గుర్తించి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే వరకు 36 సంచార జాతులకు కనీసం కుల సర్టిఫికెట్లు కూడా లేవు. ఇంకా 20 సంచార జాతుల వారిని బీసీ కేటగిరీలలో కలుపవలసి ఉంది. అయితే ఈ సంచార జాతుల వారికి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లక్షణాలున్నాయా? లేక సంచార జాతుల లక్షణాలున్నాయా? అన్నది అధ్యయనం చేయటం ద్వారా విశ్లేషించుకోవలసి ఉంది. ఈ అధ్యయనం, బీసీ, ఎంబీసీ కులాల వారితో సంచార జాతుల వారిని పోల్చి చూడవలసి ఉంది. విద్యా, ఉద్యోగ విషయాలకు పరిమితమై చూస్తే సంచార జాతులు బాగా వెనుకబడి ఉన్నాయి. ప్రధానంగా కుల వృత్తి ద్వారా కుటుంబాలను తీర్చిదిద్దుకునే ఆసరా ఉన్న కులాలలో తక్కువమంది ఇతర ఉద్యోగాలలోకి వస్తారు. వృత్తి పోతున్నదనుకుంటే చిన్న చిన్న నౌకర్లలోకి వస్తున్నారన్నది ఇప్పటికే అధ్యయనంలో తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచార జాతుల జనాభా సుమారు 73 లక్షల 5 వేల వరకు ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో సగం వరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ఆ లెక్కలు చెబుతున్నాయి. 2013 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో కులసంఘాల ద్వారా, కొన్ని అధ్యయనాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా క్లాస్ థర్డ్, క్లాస్ ఫోర్త్ ఉద్యోగాలలో బీసీలు 91,000 మంది వరకు ఉన్నారు. అదే సంచార జాతుల వారిని చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలలో 23,000 మంది ఉంటే, ఆఫీసర్ల స్థాయి ఉద్యోగాలలో 3,000 దాకా ఉన్నట్లు సమాచారం. క్లాస్ ఫోర్త్, క్లాస్ థర్డ్ లాంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిలో లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. గంగిరెద్దులవారు చిన్న ఉద్యోగాలలో 161 మంది ఉంటే పెద్ద ఉద్యోగాలలో ఇద్దరే ఉన్నారు. అలాగే పెద్దమ్మ, దమ్మరి కులస్తులు చిన్న ఉద్యోగాలలో 174 మంది, పెద్ద ఉద్యోగాల్లో 18 మంది, పెరిక ముగ్గులు చిన్న ఉద్యోగాలలో 100 మంది, పెద్ద ఉద్యోగాలలో నలుగురు, కంజెరభట్టులు 30 మంది చిన్న ఉద్యోగాలలో ఉంటే నలుగురు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మందులవారు 45 మంది చిన్న ఉద్యోగాలలో, ఐదుగురు పెద్ద ఉద్యోగాల్లో ఉండగా, నాగవడ్డీలు 23 మంది చిన్న ఉద్యోగాల్లో, 23 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అడవి నుంచి సీతాఫలాలు తెచ్చి అమ్మి జీవించే పార్థీవాళ్లు 55 మంది చిన్న ఉద్యోగాలలో, 17 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పిచ్చుకగుంట్ల కులస్తులు చిన్న ఉద్యోగాలలో 132 మంది ఉంటే 44 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మొండోళ్లు 355 మంది చిన్న ఉద్యోగాల్లో ఉంటే 30 మంది పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చారు. మొత్తం తెలంగాణలో సంచార జాతుల బడి ఈడు పిల్లలు ఎంతమంది బడికి వస్తున్నారు? ఈ కులాలవారీగా ఈ పిల్లల సంఖ్య ఎంత? ఈ పిల్లలు ఏ క్లాస్ వరకు చదువుతున్నారు? స్కూలు విద్య నుంచి డిగ్రీ వరకు వెళుతున్న వారి సంఖ్య ఎంత? అనేవి అధ్యయనంలో తేలాల్సి ఉంది. మొత్తం బీసీ కులాలలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల లెక్కలు కూడా తేలాల్సి ఉంది. సంచార జాతులకు చెందిన పిల్లలలో ఎంతెంత మంది ఐదవ తరగతి, మిడిల్ స్కూల్, 10వ తరగతి, డిగ్రీ, పీజీ స్థాయి చదువుల వరకు వచ్చారు? తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొత్తం విద్యా సంస్థలలో వీరి సంఖ్య ఎంత ఉన్నది? ఈ అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. ఈ అధ్యయనం వల్ల సంచార జాతుల్లో విద్యావకాశాలు ఎంతమందికి అందాయో తెలుస్తుంది. అధ్యయన నివేదిక రాష్ట్రం విద్యాపరంగా ఏ విధమైన అడుగులు వేయబోతోందో సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఏర్పాటైన 360 గురుకుల పాఠశాలలో బీసీ, దళిత, గిరిజన, మైనార్టీల పిల్లలు పెద్ద ఎత్తున చేరారు. సంచార జాతులకు చెందిన కొందరు విద్యార్థులు తొలిసారిగా గురుకుల పాఠశాలల్లోకి ప్రవేశించారు. సంచార జాతుల పిల్లలు వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది పెద్ద మార్పు. సంచార జాతుల పిల్లలందరూ రాబోయే పదేళ్లలో ఉన్నత విద్యను అవలీలగా చదువుకునే అవకాశాలు లభించాలని సీఎం కేసీఆర్ సంకల్పం. జ్ఞాన తెలంగాణ నిర్మాణంతో సంచార జాతుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. వారి పిల్లల చదువులు గొప్ప మానవ సంపదగా మారి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు దోహదపడతాయి. వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 జూలూరు గౌరీశంకర్ -
ఫూలేకు భారతరత్న ఇవ్వాలి
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే సామాజిక న్యాయం గురించి గళమెత్తినవారు మహాత్మా జ్యోతిభా ఫూలే (1827-1890). అట్టడుగు వర్గాల ఆర్తనాదాలను విని వారి విముక్తి కోసం సామాజిక ఉద్యమాన్ని తీసుకువచ్చిన భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు ఫూలే. బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించాడు. శూద్రులు, మహిళల కోసం పాఠశాలలు తెరిచాడు. అవే దేశంలో అట్టడుగు వర్గాలకు తొలి పాఠశాలలు. ఆయన జీవిత భాగస్వామి సావిత్రి ఫూలే భారతదేశ తొలి మహిళా టీచర్. 63 ఏళ్ల జీవితంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన దారిలోనే అంబేడ్కర్ ఆత్మగౌరవ బీజాలు నాటుతూ భారత రాజ్యాంగాన్ని రచించారు. అలాంటి వ్యక్తికి ‘భారతరత్న’ ఇప్పటికే ఇవ్వవలసింది. ఫూలేకు భారతరత్న ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈ ఏడాది మే 6వ తేదీన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కేంద్ర హోంశాఖ ప్రధాని కార్యాలయానికి పంపించింది. వినోద్ చేసిన కృషితో ఫూలేకు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనకు కదలిక రావడాన్ని తెలుగు సమాజం, దేశంలోని అట్టడుగు దళిత బహుజన వర్గాలు హర్షిస్తున్నాయి. కేంద్రం ముందుకు వచ్చి ఫూలేకు భారతరత్న ఇస్తే దేశ ప్రతిష్టకు వన్నెతెచ్చినట్టవుతుంది. కె. కేశవరావు (రాజ్యసభ సభ్యుడు), అల్లం నారాయణ (ప్రెస్ అకాడమీ చైర్మన్), చుక్కా రామయ్య (ప్రముఖ విద్యావేత్త), ఆర్. కృష్ణయ్య (బి.సి. సంఘాల జాతీయ అధ్యక్షులు, శాసనసభ్యులు), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి సంపాదకులు), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ సంపాదకులు), ఎస్. వీరయ్య (నవ తెలంగాణ సంపాదకులు), కె. శ్రీనివాసరెడ్డి (మన తెలంగాణ సంపాదకులు), వినయ్ కుమార్(ప్రజాశక్తి మాజీ సంపాదకులు), వై.ఎస్.ఆర్. శర్మ, సతీష్‌చందర్ (ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దినపత్రిక సంపాదకులు), జి. శ్రీరామమూర్తి (సీనియర్ జర్నలిస్టు), ఉ.సాంబశివరావు, (బహుజన ఉద్యమాల ఉపాధ్యా యుడు), నారదాసు లక్ష్మణరావు (శాసనమండలి సభ్యులు), మల్లెపల్లి లక్ష్మయ్య (దళిత స్టడీ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు), గోరటి వెంకన్న (ప్రముఖ కవి), జి.లక్ష్మీనర్సయ్య (సాహిత్య విమర్శకులు), ప్రొ.జయధీర్ తిర్మల్‌రావు, నాళేశ్వరం శంకరం (కవి, రచయిత), జూపాక సుభద్ర (కవి, కథా రచయిత్రి), స్కైబాబా (కవి), జూపాక సుభద్ర (రచయిత్రి), డా. ఎస్. రఘు (అసిస్టెంటు ప్రొఫెసర్, ఉస్మానియా). ( వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ )