ఇది యుద్ధమే. ఆయుధాలులేని యుద్ధం. భయాన్ని భయపెట్టి, ధైర్యాన్ని గురి పెట్టాలి. కాలం ఎన్నికల్లోలాలను కనలేదు చెప్పు. ఎన్నెన్ని గత్తర్లకు కత్తెరెయ్య లేదు చెప్పు... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న సమయంలో వాటిని తొలగించి ధైర్యం చెప్పి నిలపవలసిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇతరులు ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవలసిన మానవతా బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. వ్యక్తులు కాకుండా మొత్తం సమాజమే ప్రమాదంలో పడ్డప్పుడు ప్రతి ఒక్కరూ ఆపదలను జయించటానికి సిద్ధం కావాలి. అందుకోసం ప్రజలను సన్నద్ధం చేసేపనిని చేస్తూ ప్రజలను ఆపదల నుంచి దరిచేర్చేందుకు కేసీఆర్ పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కరోనా దూసుకొస్తున్న ఈ ప్రమాద ఘంటికల్లో మానవత్వానికి ప్రమాదం వచ్చింది. ఈ సందర్భంలో సీఎం చేస్తున్న పని గొప్పది.
ఇలాంటి సంకటస్థితిలో మనిషిని మనిషి ద్వేషించే స్థితినుంచి మానవీయ దృక్పథాన్ని ప్రతిష్టించవలసిన సందర్భం ముఖ్యమైనది. శుభ్రతా పరిశుభ్రతలను ఖడ్గాయుధాలను చేసుకుని, ఈ తాజా గత్తరకు ఘోరీ కట్టాలి. శ్వాసకు ధైర్యకవచాలను ధరింపచేయాలి. కనిపించని శత్రువుపై చేస్తున్న సామూహిక యుద్ధం సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ స్వీయ ఆరోగ్య పరిరక్షణా చర్యలు అవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కునేందుకు కఠినచర్యలు తీసుకుంటూనే ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాశ్రయాలనుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల దగ్గరే పరీక్షలు నిర్వహించి ఈ నేలమీదకు కరోనాను విస్తరించకుండా చేసేందుకు మొత్తం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.
శ్వాసనాళాల దగ్గరే, పరిశుభ్ర నాలాల దగ్గరే దాన్ని మట్టుబెట్టాలి. దాన్ని పసికడితే చాలు, ఈ ప్రపంచం పొలిమేరలు దాటించవచ్చు. అప్రమత్తతే ఆయుధం. కడిగేయటమే పరిష్కారం. కరచాలనమే ఖడ్గ చాలనం. ప్రణామమే ఖడ్గ ప్రవాహం. పల్లె పట్టణ ప్రగతులే విషప్రాణిని చుట్టుముట్టే పద్మవ్యూహాలు. మన ఉష్ణమండల కాసారాలతో, నిప్పుకణికల ఎండలతో, శత్రువును నిలువరిద్దాం పద.
ఇది ఆయుధాలులేని మహాయుద్ధం. మనిషి ఉనికినే అంతం చేసి ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్ మహామ్మారిని ఈ ప్రపంచ పొలిమేరల దాకా తన్నితన్ని తరిమేయటానికి మనందరం కలిసి రెండు చేతులూ శుభ్రంగా కడుక్కుందాం. మన దృష్టిని మరల్చుకోకుండా లక్ష్యాన్ని ముక్కుతో నలుపుకోకుండా ధైర్యాన్ని గురిపెట్టిన బాణం చేసి వదలాలి. మన చేతుల్ని కడుక్కుని యుద్ధంపై పరిశుద్ధ యుద్ధం చేయాలి. పల్లె, పట్టణ ప్రగతుల శుభ్రతతోనే రూపంలేని విపత్తును తరిమితరిమి కొట్టాలి. తిరగబడ్డ నేలలకు పాఠాలక్కర్లేదు. శుభ్రం చేసిన చేతులే, పరిశుభ్ర పరిసరాలే శత్రుసంహారాలు. శత్రువు చావుబతుకులు మన చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. చేతులు కడిగి చప్పట్లు కొట్టి ఈ 3వ ప్రపంచయుద్ధాన్ని ప్రపంచం ఆమడల దాకా తరిమికొడదాం. పదండి ముందుకు. విరుగుడు లేనిది ఈ ప్రపంచంలో లేదు. మనందరి కట్టుదిట్టమైన కార్యాచరణే మహమ్మారి వైరస్‌కు విరుగుడు. శత్రు చొరబాటును మనకు మనమే గస్తీలు కట్టి కట్టడి చేద్దాం. మనకు మనమే విరుగుడు. దుఃఖ నదులకు ఆనకట్ట అప్రమత్త రెప్పలతోనే కట్టాలి. ఇది ఓ కవి పద్యంతో చేసే వైద్యం. కానరాని శత్రువుపై యుద్ధాన్ని ఆరోగ్య ప్రపంచంతోనే ఢీ కొట్టాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జాడ ఇప్పటికి అంతగా లేకపోయినప్పటికినీ అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా ప్రదర్శిస్తున్న కర్కశత్వానికి ప్రజలు, పాలకులు జాగరూకతతో ఉండటమే సరైన సమాధానం. బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని, సామాజిక దూరాన్ని పాటిం చాలని ప్రచారప్రసార మాధ్యమాలు, విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవులను ఆసరా చేసుకుని బయటతిరిగితే కరోనాను కట్టడి చేయటానికి ఆటంకాలు ఏర్పడతాయి. సెలవులు ఇచ్చింది బైట తిరగటానికి, అనవసర ప్రయాణాలు చేయటానికి కాదు. వ్యాధి నివారణకంటే వ్యాధి నిరోధక చర్యలు ముఖ్యం.
మాట్లాడని మాస్కే మందుపాతర. శుద్ధమైన చేయే తిరుగులేని అస్త్రం. శత్రువా నిన్నెట్లా నివారిం చాలో తెలుసు. చేతులు కడిగి నీకు నీళ్లొదులుతాం. పద్యం కూడా వైద్యమే. ఇది మూడవ ప్రపంచయుద్ధం. చేయీ చేయీ కడిగి దీన్ని ఓడిద్దాం.
వ్యాసకర్త :
జూలూరు గౌరీశంకర్
ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment