ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష  | CM KCR Press Meet About Taking Precautionary Measures Coronavirus | Sakshi
Sakshi News home page

ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష 

Published Fri, Mar 20 2020 1:42 AM | Last Updated on Fri, Mar 20 2020 2:56 AM

CM KCR Press Meet About Taking Precautionary Measures Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌-19 నియంత్రణలో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చెప్పారు. ఈ వైరస్‌ పుట్టిన చైనా పక్కనే ఉన్న వియత్నాం దేశంలో ఇబ్బందే లేదని పేర్కొన్నారు. వారు మొదటి రోజు నుంచీ కఠిన చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. అలా కఠిన చర్యలు తీసుకున్న చోట ఇబ్బంది లేదన్నారు. కానీ ఇటలీ, ఇరాన్‌లు బాగా దెబ్బతిన్నాయని, వారు నిర్లక్ష్యంగా ఉన్నందుకే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చైనా కూడా మొదట్లో కొంత నిర్లక్ష్యంగా ఉందని, అందుకే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. కాగా, విదేశాల నుంచి మార్చి 1 తర్వాత వచ్చిన ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. (ప్రపంచ దేశాల్లో ప్రజా  దిగ్భందనం)

ఏ దేశం నుంచి వచ్చినా సరే వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలని కోరారు. మన రాష్ట్రంలో ఉన్న వారెవరికీ కోవిడ్‌ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని, ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం, మన పిల్లల క్షేమం దృష్ట్యా స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరొచ్చినా సరే వారికి పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్‌ చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నుంచి 10 మందికి మించి గుమికూడొద్దని, ఆర్భాటాలు లేకుండా శుభకార్యాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రెస్‌మీట్‌లో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఇక్కడి వారెవరికీ సోకలేదు.. 
‘కోవిడ్‌కు సంబంధించి కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో విస్తృతంగా చర్చించాం. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఆదేశాలిచ్చాం. ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14 మాత్రమే. అందులో ఐదుగురు మాత్రమే మన ఎయిర్‌పోర్టులో దిగారు. మిగతా తొమ్మిది మంది రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చారు. ఇతర మార్గాల్లో వస్తున్న వారిని కనిపెట్టడం ఇబ్బందిగా ఉంది. రామగుండానికి అలాగే వచ్చారు. వారందరికీ చికిత్స అందిస్తున్నాం. ఇలా ఇతర మార్గాల్లో వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశముంది.  

తామే విచారణ చేస్తాం.. 
‘శుక్రవారం నుంచి జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్రానికి విదేశాల నుంచి ఎవరొచ్చారో గుర్తిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు వాళ్లంతట వాళ్లే రిపోర్టు చేస్తే మంచిది. వారికి, వారు ఉంటున్న ప్రాంతానికి కూడా మంచిది. నేటి నుంచి పోలీసుల సహకారంతో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందిని వినియోగించి విదేశాల నుంచి ఎవరు వచ్చారో విచారణ చేయిస్తాం. ఈ విషయంలో అన్ని మార్గాలను అన్వేషించాలని ఇంటెలిజెన్స్‌కు కూడా సమాచారమిచ్చాం. జిల్లా కలెక్టర్లు, పోలీసులు కలసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్‌వోలతో కమిటీ ఏర్పాటు చేసి వారిని హోం క్వారంటైన్‌ చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,165 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టాం. అందులో కొందరు ఇంటికి వెళ్తామంటున్నారు. వారిని పంపిస్తాం. కానీ వారి మీద పర్యవేక్షణ ఉంటుంది’అని సీఎం వివరించారు. (ఒలింపిక్స్‌ వాయిదా వేస్తే మంచిది)

ఆంక్షలు 31 వరకు కొనసాగింపు 
‘కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వారం రోజులు మూసేయాలని ప్రకటించిన వాటిపై ఆంక్షలు కొనసాగుతాయి. సినిమా, ఫంక్షన్‌ హాళ్లు, క్లబ్బులు, పార్కులు ఈ నెల 31 వరకు మూసేస్తాం. గతంలో మార్చి 31 వరకు మూసివేత ప్రకటించిన సంస్థలపై ఆంక్షలు అలాగే ఉంటాయి. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించొద్దు. ఇప్పటికే ఈ విషయంలో ఇస్లాం మతపెద్దలు ఇందుకు అంగీకరించారు. బిషప్‌లు, పాస్టర్లు, పూజారులు, గురుద్వారాలకు కూడా చెబుతున్నాం. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, చాలామంది గుమికూడకుండా ఉండటమే మార్గం. అన్ని మతాల వారూ దీన్ని పాటిస్తే మంచిది. ఈ నెల 22న షబ్‌–ఎ–మెరాజ్‌ను కూడా రద్దు చేశాం. వాళ్లు కూడా అంగీకరించారు. 28న ప్రభుత్వ పక్షాన ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించం. టీవీల్లో లైవ్‌ టెలీకాస్ట్‌ ద్వారా వినిపిస్తాం. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు చేశాం. ప్రజారవాణా వాహనాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్యాక్సీల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గ్రామాలు, మండలాల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలి. శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం’అని కేసీఆర్‌ వెల్లడించారు. 

చెక్‌పోస్టుల్లో తనిఖీలు 
కరోనా వైరస్‌ మొదట ఏడు దేశాల నుంచి ఎక్కువగా వస్తోందన్నారు. ఆ తర్వాత 11 దేశాలన్నారు. ఇప్పుడు 167 అంటున్నారు. అందుకే ఏ దేశం నుంచి వచ్చినా సరే వారి మీద నియంత్రణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎవరికైనా వ్యాధి లక్షణాలున్నాయని గుర్తిస్తే ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌కు తెలిపితే తగిన చర్యలు తీసుకుంటారు. మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు రోజూ 84 రైళ్లు వచ్చి వెళ్తాయి. వీటి విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడాం. ప్రధాని మోదీతో ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌ ఉంది. అందులో ప్రధానితో మాట్లాడతాం. రోడ్డు మార్గాల నుంచి వస్తున్న వారిని నియంత్రించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. మనకు మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ, రాష్ట్ర రహదారులున్న చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెక్‌పోస్టుల ద్వారా వచ్చే అన్ని వాహనాలను చెక్‌ చేస్తారు. ఆ వాహనాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటే హోం క్వారంటైన్‌ చేస్తారు. దేశవ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు. మన రాష్ట్రంలో 14 మందికి మాత్రమే వచ్చింది. వాళ్లందరూ బయటి నుంచి వచ్చిన వాళ్లే. మన రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికైతే ప్రభావానికి గురి కాలేదు. కావొద్దని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సీఎం చెప్పారు.

 పరీక్షలు కొనసాగుతాయి 
రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 60 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. 90 శాతం మంది పరీక్షలు జరగాలనే కోరుకుంటున్నారు. పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. 8, 9 రోజులు కష్టపడితే అవి కూడా అయిపోతాయి. ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి. బ్లాక్‌ మార్కెటింగ్స్, కృత్రిమ కొరతలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో మాల్స్, నిత్యావసరాల దుకాణాలు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే, అక్కడ జనసమ్మర్థం తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్‌ అంటున్నారు తప్ప 144 సెక్షన్‌ అని మాట్లాడట్లేదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలే మూసేసినప్పుడు మిగిలిన వాటికి భేషజాలు అవసరం లేదు. మాకు ఏమైతది అనే నిర్లక్ష్యం పనికిరాదు. గతంలో అనుమతిచ్చాం కాబట్టి 31 వరకు పెళ్లిళ్లు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మ్యారేజ్‌ హాల్స్‌ మూసేయాల్సిందే. షాదీఖానాలు కూడా బంద్‌ చేయాలని మత పెద్దలు కోరారు. పెళ్లిళ్లు జరిగినా 200 మందికి మించకుండా రాత్రి 9 గంటల లోపే ముగించుకోవాలి. మన రాష్ట్రాన్ని, మన పిల్లలను కాపాడుకునేందుకు వ్యక్తిగత, గ్రామ పారిశుధ్యం పాటించాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం’అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. (ఇటలీలో ఒక్కరోజే  475 మంది మృతి)

భయోత్పాతం లేదు 
‘రాష్ట్రంలో ప్రస్తుతం బస్సులు, ప్రజా రవాణా బంద్‌ చేసేంత ఘోరమైన పరిస్థితి ఏమీ లేదు. సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా కూరగాయలు, ఇతరత్రా నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడంలో ఇబ్బంది ఉండకూడదు. లక్ష టన్నుల కందులు మార్కెట్‌కు వస్తున్నాయి. ఒకవేళ అంతగా ఆందోళనకర పరిస్థితి తలెత్తితే పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుభ్రత ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలం. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మీడియా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి.  

అంతర్జాతీయ విమానాలు తక్షణమే రద్దు 
‘అంతర్జాతీయ విమానాలను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో డిమాండ్‌ చేస్తాం. ఈ నెల 22 వరకు వేచి చూడకుండా తక్షణమే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలి. వాటి రద్దుతో ఇబ్బందులు పడే వారికి అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ గుర్తించిన వారందరూ కోలుకుంటున్నారు. వారికి వెంటిలేటర్లు పెట్టే అవసరం కూడా రాలేదు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. చికిత్సకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 500 నుంచి 600 మందిని స్క్రీనింగ్‌ చేసే సదుపాయం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సీసీఎంబీలోని వసతులను ఉపయోగించే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరతాం’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement