సంచార జాతుల వృద్ధి పథం
అభిప్రాయం
రాబోయే పదేళ్లలో సంచార జాతుల పిల్లలందరికీ ఉన్నత విద్యావకాశాలు లభించేలా చేయాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు సంకల్పం. అది నెరవేరితే సంచార జాతుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది.
ఇప్పటి వరకు ఏ పాలకులు పట్టించుకోని సంచార జాతుల కులాల వారిని అక్కున చేర్చుకొని వారి జీవన విధానాన్ని తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు బడి గడప తొక్కని సంచార జాతుల పిల్లలను గుర్తించి వారిని చదువుల వైపునకు మళ్లించాలని ఆయన తపన. ఇప్పటివరకు ఏ రకమైన సాయం పొందని బాగా వెనుకబడిన కులాల వారి లెక్కలు తీయాలని, అందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన బీసీ కమిషన్‌ను ఆదేశిం చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 36 సంచార జాతులను గుర్తించి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే వరకు 36 సంచార జాతులకు కనీసం కుల సర్టిఫికెట్లు కూడా లేవు. ఇంకా 20 సంచార జాతుల వారిని బీసీ కేటగిరీలలో కలుపవలసి ఉంది. అయితే ఈ సంచార జాతుల వారికి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లక్షణాలున్నాయా? లేక సంచార జాతుల లక్షణాలున్నాయా? అన్నది అధ్యయనం చేయటం ద్వారా విశ్లేషించుకోవలసి ఉంది.
ఈ అధ్యయనం, బీసీ, ఎంబీసీ కులాల వారితో సంచార జాతుల వారిని పోల్చి చూడవలసి ఉంది. విద్యా, ఉద్యోగ విషయాలకు పరిమితమై చూస్తే సంచార జాతులు బాగా వెనుకబడి ఉన్నాయి. ప్రధానంగా కుల వృత్తి ద్వారా కుటుంబాలను తీర్చిదిద్దుకునే ఆసరా ఉన్న కులాలలో తక్కువమంది ఇతర ఉద్యోగాలలోకి వస్తారు. వృత్తి పోతున్నదనుకుంటే చిన్న చిన్న నౌకర్లలోకి వస్తున్నారన్నది ఇప్పటికే అధ్యయనంలో తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచార జాతుల జనాభా సుమారు 73 లక్షల 5 వేల వరకు ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో సగం వరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ఆ లెక్కలు చెబుతున్నాయి. 2013 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో కులసంఘాల ద్వారా, కొన్ని అధ్యయనాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా క్లాస్ థర్డ్, క్లాస్ ఫోర్త్ ఉద్యోగాలలో బీసీలు 91,000 మంది వరకు ఉన్నారు. అదే సంచార జాతుల వారిని చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలలో 23,000 మంది ఉంటే, ఆఫీసర్ల స్థాయి ఉద్యోగాలలో 3,000 దాకా ఉన్నట్లు సమాచారం.
క్లాస్ ఫోర్త్, క్లాస్ థర్డ్ లాంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిలో లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. గంగిరెద్దులవారు చిన్న ఉద్యోగాలలో 161 మంది ఉంటే పెద్ద ఉద్యోగాలలో ఇద్దరే ఉన్నారు. అలాగే పెద్దమ్మ, దమ్మరి కులస్తులు చిన్న ఉద్యోగాలలో 174 మంది, పెద్ద ఉద్యోగాల్లో 18 మంది, పెరిక ముగ్గులు చిన్న ఉద్యోగాలలో 100 మంది, పెద్ద ఉద్యోగాలలో నలుగురు, కంజెరభట్టులు 30 మంది చిన్న ఉద్యోగాలలో ఉంటే నలుగురు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మందులవారు 45 మంది చిన్న ఉద్యోగాలలో, ఐదుగురు పెద్ద ఉద్యోగాల్లో ఉండగా, నాగవడ్డీలు 23 మంది చిన్న ఉద్యోగాల్లో, 23 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అడవి నుంచి సీతాఫలాలు తెచ్చి అమ్మి జీవించే పార్థీవాళ్లు 55 మంది చిన్న ఉద్యోగాలలో, 17 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పిచ్చుకగుంట్ల కులస్తులు చిన్న ఉద్యోగాలలో 132 మంది ఉంటే 44 మంది పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మొండోళ్లు 355 మంది చిన్న ఉద్యోగాల్లో ఉంటే 30 మంది పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చారు.
మొత్తం తెలంగాణలో సంచార జాతుల బడి ఈడు పిల్లలు ఎంతమంది బడికి వస్తున్నారు? ఈ కులాలవారీగా ఈ పిల్లల సంఖ్య ఎంత? ఈ పిల్లలు ఏ క్లాస్ వరకు చదువుతున్నారు? స్కూలు విద్య నుంచి డిగ్రీ వరకు వెళుతున్న వారి సంఖ్య ఎంత? అనేవి అధ్యయనంలో తేలాల్సి ఉంది. మొత్తం బీసీ కులాలలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల లెక్కలు కూడా తేలాల్సి ఉంది. సంచార జాతులకు చెందిన పిల్లలలో ఎంతెంత మంది ఐదవ తరగతి, మిడిల్ స్కూల్, 10వ తరగతి, డిగ్రీ, పీజీ స్థాయి చదువుల వరకు వచ్చారు? తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొత్తం విద్యా సంస్థలలో వీరి సంఖ్య ఎంత ఉన్నది? ఈ అంశాలపై కమిషన్ దృష్టి సారించింది.
ఈ అధ్యయనం వల్ల సంచార జాతుల్లో విద్యావకాశాలు ఎంతమందికి అందాయో తెలుస్తుంది. అధ్యయన నివేదిక రాష్ట్రం విద్యాపరంగా ఏ విధమైన అడుగులు వేయబోతోందో సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఏర్పాటైన 360 గురుకుల పాఠశాలలో బీసీ, దళిత, గిరిజన, మైనార్టీల పిల్లలు పెద్ద ఎత్తున చేరారు. సంచార జాతులకు చెందిన కొందరు విద్యార్థులు తొలిసారిగా గురుకుల పాఠశాలల్లోకి ప్రవేశించారు. సంచార జాతుల పిల్లలు వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది పెద్ద మార్పు.
సంచార జాతుల పిల్లలందరూ రాబోయే పదేళ్లలో ఉన్నత విద్యను అవలీలగా చదువుకునే అవకాశాలు లభించాలని సీఎం కేసీఆర్ సంకల్పం. జ్ఞాన తెలంగాణ నిర్మాణంతో సంచార జాతుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. వారి పిల్లల చదువులు గొప్ప మానవ సంపదగా మారి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు దోహదపడతాయి.
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896
జూలూరు గౌరీశంకర్