గిరిజనులకూ మూడెకరాలు
- కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న తరహాలో... పేద గిరిజన కుటుంబాలకు కూడా మూడెకరాల భూమిని పంపిణీ చేసే ఆలోచన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ‘గతంలో భూపంపిణీ అశాస్త్రీయంగా జరిగింది. కొద్దిపాటి భూమిని ఎక్కువ మందికి పంచడంతో ఎవ్వరికీ ఉపయోగపడలేదు. ఇప్పటివరకు 20 లక్షల ఎకరాల భూమిని పంచారు. నిరుపయోగంగా ఉన్న ఆ భూమిని వినియోగంలోకి తీసుకురావాలి.
ప్రతి వ్యవసాయ దళిత కుటుంబానికి మూడెకరాలు ఇవ్వాలి. బోరు, కరెంటు మోటర్ అమర్చాలి. ఏడాది పెట్టుబడి కూడా సమకూర్చాలి. గ్రామాల వారీగా దళితులకు ఎంత భూమి ఉంది.. ఇంకా ఎంత భూమి కావాలి.. అనే విషయాలు పరిశీలించాలి. భూపంపిణీకోసం తగిన భూమి కొనుగోలు చేయాలి’ అని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో భూకమతాల ఏకీకరణ చట్టం తెస్తామన్నారు. అనంతరం సీఎం సూచనతో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు గోదాములు, రైతు బజార్లపై అధికారులకు సూచనలు చేశారు. రాష్ర్టంలో రూ.వెయ్యికోట్లతో గోదాముల నిర్మాణం చేపడతామని అన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండలానికో గోదాం, మరో ఆరు జిల్లాల్లో మొత్తం 45 చోట్ల గోదాములను నిర్మిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజారును నిర్మించాలని సూచించారు.