ఇవి ఉద్యమాలను చూసిన కళ్లు. ఉద్యమం కడదాకా నిలిచి ఉద్యమం భుజం భుజం కలిపి విజయం అంచుల దాక చేరి, ఉద్యమ సాఫల్యతను చూసి విజయోత్సవాలను వీక్షించిన కళ్లు. ఒక సుదీర్ఘ ఉద్యమం చివరన నిలిచి గెలుపును కౌగిలించుకున్న మహా సందర్భాలను కనుగుడ్లలో దాచుకున్న కళ్లు. మట్టి మనుషుల మహాసంగ్రామపు సకల జనాగ్రహాన్ని కళ్లారా చూసిన కళ్లు. బక్క మనుషులంతా కలిసి ఆధిపత్యపు గోడల్ని కూల్చివేస్తున్న దృశ్యాలను కాంచిన కళ్ళు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’’ అన్న కవిత్వపాదమై గర్జించిన కంఠాల కళ్లు. నీళ్లు లేని ఊళ్లో తుమ్మముళ్ళ సాచ్చికంగా నెర్రెలు బాసిన నేలల గళగర్జనల కళ్లు. నీళ్లు లేని వూర్లుంటాయని, వూరంతా ఖాళీ అయ్యాక గాజుకళ్ల ముసలవ్వలు మాత్రమే మిగిలివున్న కుక్కి మంచాల దృశ్యాలు. వలసల కడగండ్లను మాత్రమే చూసి దుఃఖించిన ‘‘పంచమవేదాల’’ కళ్లు. మహాజన జాతరల కళ్లను చూసి దేశమే మద్దతు తెలిపి, గద్దెలు కదిలి, ఆధిపత్యాలు కూలి అవతరించిన 2014 జూన్ 2ను కళ్లారా చూసిన తెలంగాణ తల్లి కళ్లు. పరవశించిన బిడ్డల విజయోత్సవాల ఉత్సవాల అస్తిత్వ గెలుపుల విజయాలు చూసిన కళ్లన్నీ ధన్యమైనవి. కలలన్నీ కళ్ళు చేసుకుని స్వరాష్ట్ర అవతరణను కౌగిలించుకున్నాయ్. గాయాల తెలంగాణ విజయగేయాల, విజయోత్సవాలు విరబూసిన గెలుపు కావ్యమైంది. కలలుగన్న కాలం కలలన్నీ కళ్ళలో నింపుకున్న తెలంగాణ దీర్ఘ కావ్య కార్యాచరణ అయింది. కన్నీళ్లు కాళేశ్వర మహాకావ్యాలయ్యాయి. పూడిపోయిన చెరువులు జలకళతో నిండి పోయాయి. తెగించి తెచ్చుకున్న తెలంగాణ బక్క మనషుల బడుగు జీవుల వెతలకతల తెలంగాణ తన పునర్నిర్మాణానికి పునర్నిర్మితికి తిరిగి కేసీఆర్‌నే ఎన్నుకుంది, ఎంచుకుంది. పాలనా పగ్గాలనందించి ఉద్యమ సాహసి స్వాప్నికునికే భవిష్యత్ నిర్మాణం పనిని సగర్వంగా అప్పగించింది. ఒకసారి గడిచిన కాలాన్ని లెక్కలతో కొలిస్తే ఏడేళ్లు గడిచాయి. ఒక సుదీర్ఘకాలం కలలు కళ్లముందే నిర్మిత ఛందస్సుగా ఆచరణాత్మక అలంకారాలతో ఒక్కొక్కటి సాధించుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ కరువులు కరిగిపోయి సస్యశ్యామల క్షేత్ర కావ్యాలవుతున్నాయి. ఏడుతరాల కష్టాలను తొలగించుకుంటూ పోతున్న ఏడేళ్ల బిడ్డ తెలంగాణ. ఎన్నెన్నో తీర్లుగా చిక్కుబడిపోయిన దార్లను సరిచేసుకుంటూ రహదారులను నిర్మించుకోవాలి.
ఇది చీకటినేలవుతుందని కిరణ వెలుగులు తెలియని మనిషి ఉమ్మడి అసెంబ్లీ సాక్షిగా చెబితే మనం ఏడెనిమిది నెలల్లోనే తెలంగాణ బిడ్డ ఎంత శక్తివంతమైన ప్రకాశమో చెబుతూ, దేశానికే విద్యుత్ వెలుగుల వెన్నెలను ప్రసరింపచేసుకున్నాం. తెలంగాణ చీకట్లు లేని పండు వెన్నెల జాబిలి. పల్లె వెలుగులకు కాంతి దీపాలయ్యాయి. చేతి వృత్తుల చేతుల దాకా విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఒకనాటి కరువు నేల నేడు పచ్చటి పంటల పసిడి నేలగా విలసిల్లుతోంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాల్లోని పేద పిల్లల చదువుకు వేయి గురుకులాలు వెలిసి లక్షల మంది పేదల పిల్లలు చదువుకుంటున్నారు. సంచారజాతుల పిల్లలు రేపటి శాస్త్ర సాంకేతిక రంగాలకు గాడిలో పెట్టే శాస్త్రవేత్తలుగా వెలుగొందితీరుతారు. వైద్యం పేదల గడపదాకా పోవడానికి మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు, వైద్య సేవకులు కదిలిపోతున్నారు. కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కదిలిపోతుంది. బిరబిరా ప్రవహించే గోదావరి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మను కలిసింది. ప్రభుత్వ బడులన్నీ రేపటి కాలానికి అన్నివర్గాల బిడ్డల జ్ఞాన కేంద్రాలుగా ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను అందించి తీరుతాయన్న విశ్వాసాన్నిస్తున్నాయి. గత ఏడేళ్ల కాలం అభివృద్ధిపరంగా మామూలుది కాదు. ఇక్కడి రైతుబంధు పథకాన్ని కేంద్రం అవలంబిస్తోంది. తెలంగాణ ఉద్యమాలు ఇపుడు ఈ నేలంతా పరుచుకున్న సంక్షేమ పథకాలుగా, నిర్మిత రంగాల, మౌలిక వసతులు సమకూర్చుకొని నిలుస్తున్న శక్తులుగా, బహుజన వర్గాల సౌఖ్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తుంది.
రాష్ట్రం వచ్చి ఏడేండ్లు గడుస్తున్నప్పటికీ ప్రతి ప్రగతి మలుపులో ఉద్యమ ఉత్తేజం కనిపిస్తుంది. ఇదే స్ఫూర్తితో సర్వరంగాలను శక్తివంతం చేసుకుని పునర్నిర్మించుకోవాలి. ఇది పునర్నిర్మాణ కాలం. పునర్నిర్మాణ చారిత్రక సందర్భం. గ్రామీణ తెలంగాణను సస్యశ్యామలం చేసేదిశగా పల్లెల్లో విస్తృత ప్రగతి పనులు జరుగుతున్నాయి. ఐటీ రంగంలో దేశంలోనే అతి కీలక కేంద్రంగా హైదరాబాద్ మహానగరం ఇప్పటికే నిలిచింది. ఐటీ రంగం కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల వరకు నిర్మించబడుతుంది. గ్రామ పంచాయతీల ఆడిట్ అంతా ఐటీ రంగంలోనే జరగడం దేశానికి నమూనాగా నిలిచింది. ఇప్పుడు హీరోలంతా తెలంగాణ భాషనే మాట్లాడుతున్నారు. సినిమా కథలన్నీ పద్మశాలీల మరమగ్గాల చింతకింది మల్లేశాలవుతున్నాయి. తెలంగాణమనే దివిటీ సాహిత్య సాంస్కృతిక సినిమా కళా రంగాలలో విలసిల్లుతుంది. ఇది ఏడేండ్ల తెలంగాణలో భాషా శాస్త్రాల దగ్గర్నుంచి ప్రగతి రథ చక్రాల వరకు అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఉద్యమ ఉద్వేగపూరిత క్షణాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటన్నింటినీ ఈ ఏడేళ్ల అభివద్ధి, పునర్నిర్మాణ పురోగమనంతో చూస్తే అవన్నీ ఉద్యమ ప్రతిఫలాలుగానే నిలుస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 85 శాతంగా ఉన్న రాష్ట్రంలో సంపదలు పెంచాలి. ఏడేండ్ల తన ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం పాలిత రాష్ట్రంగా అనేక మెట్లను నిర్మించుకుంది. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి నమూనా. వలస కార్మికులను రాష్ట్ర నిర్మాణ భాగస్వాములుగా సంలీన పరుచుకున్న మానవత్వపు పరిమళాల నజరానా. ఈ దశ దిశ నిరంతరం కొనసాగాలి.
వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు
కలలు కన్న కండ్లు సాకారంలో ఏడేండ్లు
Published Wed, Jun 2 2021 3:53 AM | Last Updated on Wed, Jun 2 2021 3:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment