ఢిల్లీ గద్దె మీది సర్కారు ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వంగా, కార్మిక –కర్షక – రైతు కూలీల వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిన స్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే, మత ఘర్షణలకు తలుపు తెరిచే, ఆధిపత్య బలంతో రెచ్చగొట్టే చర్యల రహస్య అజెండాతో ముందుకు సాగుతున్నారు.
ఈ తరుణంలో దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం ఉంది. ఆ అవసరాన్ని తీర్చడానికి తెలంగాణ నుంచి కేసీఆర్ తన వంతు ప్రయత్నం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ప్రస్తుత కేంద్రపాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తెస్తున్న ముప్పును దేశానికి వివరించనున్నారు.
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను, బహుజన వర్గాలను అణగదొక్కుతున్న తీరును నిరసిస్తూ ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించడానికి జాతీయ వేదికపైకి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లుగానే దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు గాంధీ మార్గంలో మరో కొత్త మార్పుకు ఆయన శ్రీకారం చుడుతున్నారు.
దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా దేశ మౌలిక విలువలను కాపాడుకోవటం అత్యవసరమైంది. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీతో దేశంలో మౌలిక విలువలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీ దుష్ప్రభావం అన్ని రంగాలనూ కుదిపేసింది.
అంతే కాకుండా దేశ మౌలిక విలువలకు భంగం వాటిల్లడంతో ప్రజాస్వామిక శక్తుల ఏకీకరణ అన్నది ఒక చారిత్రక అవసరంగా ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ కంటే ముందు ‘ఇందిరాయే ఇండియా’ అన్న నినాదంతో ముందుకు సాగిన పాలనలో దేశం ఆర్థికంగా క్షీణదశకు వచ్చేసింది. అప్పటికే మొదలైన కొద్దిపాటి ఆర్థిక సంస్కరణలు కూడా దేశానికి ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి.
ఎమర్జెన్సీ కాలం పోయింది. జయప్రకాష్ నారాయణ్ ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కూడగట్టారు. రామ్‌మనోహర్ లోహియా భావజాలాన్ని నింపుకొని అప్పుడప్పుడే యువతరం నాయకులుగా ఎదిగివస్తున్న తరుణమది. ఆ తరం క్రియాశీలురు బ్రహ్మండమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. ఎమర్జెన్సీలో దేశాన్ని ఎలా జైలుగా మార్చారో వారు ఎలుగెత్తి చాటారు.
జయప్రకాష్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ వేదిక రూపు దాల్చింది. రాజకీయంగా కాంగ్రెస్ కుదేలై పోయింది. అప్పటివరకూ తిరుగులేకుండా పాలించిన కాంగ్రెస్‌కు మొట్టమొదటిసారిగా చావుదెబ్బ తగిలింది. జనతా పార్టీ అధికారంలో వచ్చింది. అది భారత రాజకీయాలలో కొత్త మలుపు. అయితే జనతా ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు, అది చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అలా వచ్చిన కాంగ్రెస్ మళ్లీ చానా ఏళ్లు దేశాన్ని పాలించింది.
నేటికీ కోలుకోని స్థితి
రాజీవ్ గాంధీ పాలనలో చాప కింద నీరు లాగా దేశంలో అనేక సమస్యలు చోటుచేసుకున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. నిరుద్యోగ సమస్య వికృత రూపం దాల్చింది. దేశానికి ఆర్థికంగా వెసలుబాటు లేకుండా పోయింది. 1990 నాటికి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి. అలాగే సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొద లైంది.
దేవెగౌడ, చంద్రశేఖర్, వీపీ సింగ్, పీవీ నరసింహరావు ప్రభుత్వాలు సంకీర్ణ యుగంలో వచ్చినవే. (ఆ మాటకొస్తే ఆ తర్వాత వచ్చిన యూపీఏ, ఇప్పుడున్న ఎన్డీఎ ప్రభుత్వాలూ సంకీర్ణ ప్రభు త్వాలే). వీపీ సింగ్ రాకతో బీసీల కోసం మండల కమిషన్‌ని తీసుకు రావడం దేశ రాజకీయ పరిస్థితులలో మళ్ళీ ఒక కొత్త పరిణామానికి తలుపులు తీసింది. పీవీ నరసింహారావు ప్రధాన స్రవంతి సంస్కర ణలకు ఆద్యులు.
దేశంలో సరళీకృత ఉదార విధానాలకు తలుపులు తెరిచారు. అయితే భారతదేశం సంప్రదాయ మార్కెట్‌లది కావడంతో రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. అప్పుడు ప్రారంభమైన రూపాయి విలువ పతనం మోదీ ప్రభుత్వం వరకు 32 సంవత్స రాలుగా కొనసాగుతూ వచ్చింది.
నిస్తేజంగా దేశ పాలన
మన్మోహన్ సింగ్ పాలన దేశాన్ని మరింత నిస్తేజ స్థితికి తీసుకు పోయింది. అది 2014 దాకా సాగింది. ఈ పరిస్థితుల్లో అవినీతి వ్యతి రేక ఉద్యమాలు కేజ్రీవాల్, అన్నా హజారే రూపాలలో ముందుకు వచ్చాయి. ఇలాంటి సమయంలో గుజరాత్ మోడల్‌ని ముందు పెట్టి బీజేపీ దేశంలో తన బలాన్ని పెంచుకొని కోరలు చాచింది.
2014లో కార్పొరేట్ శక్తుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇవాళ దాకా కొనసాగుతూ వచ్చింది. బీజేపీ దేశంలో మత విభజనకు గీతలు గీసింది. కులాలను రెచ్చగొడుతోంది. కుల, మతాల్ని అడ్డు పెట్టుకొని దేశంలో ఆధిపత్య రాజకీయాలను చలాయించే దశకు వారు వచ్చేశారు. దేశాన్ని బనియాలు (వర్తకులు), ఉన్నత వ్యాపారుల చేతుల్లో పెట్టేశారు. దేశంలో పేదరికం బాగా పెరిగిపోయింది. రాజ్యాంగ మౌలిక లక్షణాలను దెబ్బతీసేదాకా బీజేపీ నిర్ణయాలు వెలువడ్డాయి.
అబద్ధాలతో ఆధిపత్యం
దేశంలోని సర్కారు ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వంగా, కార్మిక, కర్షక, రైతు, కూలీల వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిన స్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న పాలకులు ఫేక్ సోషల్ మీడియాను పట్టుకొని అబద్ధపు ప్రపంచాన్ని దేశం చుట్టూ నిర్మించే పనిలో ఉన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే, మత ఘర్షణలకు తలుపులు తెరిచే విధంగా ఆధిపత్య బలంతో రెచ్చగొట్టే చర్యలను రహస్య అజెండాగా ముందుకు సాగుతోంది.
రైతాంగాన్ని ఉరితీసే విద్యుత్ చట్టాలను తెస్తోంది. అన్నం పెట్టే అన్నదాతలు దేశ వ్యాప్తంగా సంవత్సరం పాటు ప్రజా ఉద్యమాలు చేసే దశకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వ్యవసాయ రంగంపై రుద్దే ప్రయత్నం చేస్తే... తమ ఉద్యమాలతో రైతులు తిప్పికొట్టారు. విధిలేని పరిస్థితులలో కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అత్యవ సరంగా దేశానికి ఒక ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పవలసి ఉంది. ఆ ప్రత్యామ్నాయ భావజాల వేదికకు నేతగా దేశ ప్రజల ముందుకు కేసీఆర్ వస్తున్నారు.
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను, బహుజన వర్గాలను అణగదొక్కుతున్న తీరును నిరసిస్తూ ఒక మహోద్యమానికి నిర్మాతగా కేసీఆర్ దేశ రాజకీయ వేదికపైకి వస్తున్నారు. దేశాన్ని కమ్మేస్తున్న మత తత్వాన్ని తిప్పి కొట్టడానికి ఆయన జాతీయ రాజకీయ యవనికపైకి వస్తున్నారు. రాజ్యాం గంలోని మౌలిక సూత్రాలకు వస్తున్న ముప్పును తప్పించడానికి బయలుదేరుతున్నారు.
దేశంలోని ప్రతి నీటి చుక్కను ప్రజలు వినియోగించుకొనేందుకు, నీళ్లందని దిక్కులకు నీరు అందించేందుకు ఒక జలనాయకుడిగా ముందుకు వస్తున్నారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు అందిస్తూ రైతాంగాన్ని ఆదుకోనున్నారు. నిరుద్యోగ సమ స్యను లేకుండా చేసేందుకు దేశంలో ఉత్పత్తులను ఎలా పెంచాలో లెక్కలు కట్టి చెబుతున్నారు.
జనం కోసమే జాతీయ పార్టీ
దేశానికి గుండె కాయ వంటిది గ్రామీణ భారతం. ఆ గ్రామీణ భారతాన్ని రక్షించుకోవడానికి గాంధీజీ ఆలోచనలతో ఎలా ముందుకు సాగాలో కేసీఆర్ వివరిస్తున్నారు. పొరుగు దేశం అయిన చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎలా నిలువగలిగిందో ఆ మార్గంలో మన దేశాన్ని ప్రపంచ శక్తిగా ఎలా నిలపాలో, మానవ వనరుల వినయోగం ఎలా జరగాలో చెబుతూ దేశమంతా చుట్టి వస్తానంటున్నారు. అందు కోసమే జాతీయ పార్టీని నెలకొల్పుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు గానే దేశాన్ని కూడా తీర్చిదిద్దడం కోసం ముందుకు సాగుతూ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక వేదికను గాంధీ మార్గంలో నిర్మిస్తా మంటున్నారు. జనం అజెండానే దేశం అజెండాగా మార్చి, మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతానంటున్న కేసీఆర్... ఇందుకు ప్రజల అండదండలను కోరుకుంటున్నారు.
జూలూరి గౌరీశంకర్
వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి
Comments
Please login to add a commentAdd a comment