తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక్కొక్కరంగంలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయి. సాగునీరు, తాగునీరు విషయంలో ఊరి చెరువులు నింపడం నుంచి, కాళేశ్వరం నుంచి రెండు మహానదుల అనుసంధానం వరకు తెలంగాణ సమాజం బలోపేతం కావటానికి తొలిఘట్టం ముగిసింది. ఇప్పుడు గ్రామీణ తెలంగాణ స్వయం సమృద్ధికి కేసీఆర్ మలిఘట్టం మొదలుపెట్టబోతున్నారు. చితికిపోయిన చేతివృత్తుల జీవితాల్లో తిరిగి వైభవం సంతరించుకునేందుకు, వాళ్లు తయారుచేసిన వస్తువులకు సమాజంలో డిమాండ్ ఉండేవిధంగా చూసి వాళ్లను ముందుకు నడిపించాలన్న మహత్తర సంకల్పంతోనే కేసీఆర్ పథక రచన చేస్తున్నారు.
సమాజంలో సగభాగమైన బీసీల జీవితాల్లో మార్పుతెచ్చేందుకు ఇప్పటికే కొంత కృషి జరిగింది. మత్స్యకారుల్లో, యాదవుల జీవితాల్లో కొంత మేరకు మార్పువచ్చింది. చేపలపెంపకం గత రెండేళ్లుగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గొర్రెల పెంపకం లాభసాటిగా మారింది. కోళ్ల పెంపకంపై ఇపుడు ప్రత్యేక శ్రద్ధపెడుతున్నారు. బీసీల జీవితాల్లో మార్పురావాలంటే చేతి వృత్తుల్లో సంపూర్ణంగా ఆధునీకరణ జరగాలి. ఈ అత్యాధునిక సమాజపు మార్కెట్ పోకడలకు అనుకూలంగా విభిన్నకోణాల్లో చేతివృత్తుల పనులు సాంకేతికతో బయటకు రావాలి. ఇందుకు చాలా కసరత్తు చేయవలసిఉంది. బీసీవర్గాలకు సంబంధించిన 280 గురుకులాలు ఇప్పటికే లక్ష కుటుంబాలకు ఆసరాగా మారాయి. లక్షమంది బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
బీసీల జీవితాల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తూ చేతివృత్తులనే నమ్ముకున్న చేతులకు బలాన్ని అందించటం కోసమే గ్రామీణ తెలంగాణలోను బలోపేతం చేసే పని కేసీఆర్ చేపట్టబోతున్నారు. బీసీ కులాల చేతివృత్తులన్నీ సంపదలనందించే వృత్తులుగా తీర్చిదిద్దేపని యుద్ధప్రాతిపదికగా ముందుకు సాగవలసిఉంది. బీసీల ఆర్థికమూలాలు బలోపేతం చేసేందుకు దార్శనికతతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాకముందు ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు చేనేత కార్మికుల పాలిట సంపదల క్షేత్రంగా మారింది. సమాజంలో కీలకభాగమైన బీసీల జీవితాల్లో మార్పురావాలంటే ఈ చేతివృత్తులద్వారా గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. మన ఉత్పత్తులను మనమే వాడటం, వాటిలో నాణ్యతను పెంచి నైపుణ్యతను సంతరించుకుంటే అవి మేడిన్ తెలం గాణ ఉత్పత్తులుగా మారగలుగుతాయి.
బీసీల కులవృత్తులు ఆధునీకరించటం ద్వారానే ఆ వర్గీయులు ఆర్థికంగా స్థిరపడి శిరసెత్తుకుని నిలుస్తారు. ఈ వర్గాలలో తరతరాలుగా స్కిల్‌సెట్ ఉంది. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వస్తువులను తయారుచేసే సాంకేతికతను ఈ కులవృత్తులకు జోడించాలి. వీళ్లదగ్గర నుంచి తయారుచేసే వస్తువులు అంతర్జాతీయ ప్రమాణాలను పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మేడిన్ తెలంగాణ బ్రాండెడ్ వస్తువులుగా మార్కెట్‌లో నిలువగలుగుతాయి. తెలంగాణలోని గ్రామీణ, పట్టణాలలో ఈ వృత్తినైపుణ్యాలను ఆధునీకరించి చేతివృత్తులకు అండగా నిలవాలన్న కేసీఆర్ సంకల్పంతో మలి అభివృద్ధి ఘట్టం మొదలుకానుంది. సంచారజాతులుగా మిగిలిన వాళ్లకు జీవనభృతి, స్థిరజీవితం నెలకొల్పి వారి నైపుణ్యాలకు ఆధునికతను అద్దాలి. గ్రామీణ పేదరికం లేకుండా చూడాలి.
మనకున్న చేతివృత్తులు వాళ్లజీవితాలను మార్చి సమస్త సంపదల కేంద్రాలుగా మారాలి. ఈ విషయంలో వృత్తికళల నైపుణ్య తెలంగాణను దేశానికి నమూనాగా అందించాలన్న కేసీఆర్ తలంపు ఎంత తొందరగా పూర్తయితే సమాజంలో సగభాగం బీసీల జీవితాలు అంత త్వరగా స్థిరపడతాయి. సహస్రవృత్తుల సమస్తకళల ఆధునిక వైభవంగా తెలంగాణ విలసిల్లాలి. నైపుణ్యవంతమైన బీసీ చేతివృత్తులను ఉత్పత్తికేంద్రాలుగా మార్చే కొత్తశకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతూ తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టంచేయనున్నారు.
వ్యాసకర్త
జూలూరు గౌరీశంకర్
కవి, విమర్శకులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment