ప్రజాకాంక్షలను ప్రతిఫలిస్తూ... | Sakshi Guest Column On Telangana Formation Days And KCR | Sakshi
Sakshi News home page

ప్రజాకాంక్షలను ప్రతిఫలిస్తూ...

Published Fri, Jun 2 2023 3:55 AM | Last Updated on Fri, Jun 2 2023 8:39 AM

Sakshi Guest Column On Telangana Formation Days And KCR

ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి, మలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ జనరంజక పాలన అందిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో సంక్షేమా నికీ, అభివృద్ధికీ సమాన ప్రాధాన్యమిచ్చి, పదో వసంతంలోకి అడుగిడుతూ దేశవ్యాప్తంగా తన పాలనా మోడల్‌పై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, పేదలకు ఉద్దేశించిన అనేక పథకాలు ఆత్మగౌరవంతో ఆయా వర్గాలు నిలబడేలా చేస్తున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి తెలంగాణను పచ్చబార్చాయి.

ఇది సంక్షేమ దశాబ్ది!
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత గడిచిన పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుని దేశంలోనే అగ్రగామిగా తులతూగుతోంది. అందుకు గాను అహర్నిశలు కృషి చేస్తున్న నాటి ఉద్యమ సారథి, నేటి తెలంగాణ స్వరాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు నిజంగా గొప్పవారు. పదేండ్ల నుండి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు కీలక పథకాల గురించి... ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఉంది.

రాష్ట్రంలోని సుమారు 1.60 లక్షల దళిత కుటుంబాలకు లక్షలాది రూపాయలను అందించే ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ ప్రభుత్వం యావత్‌ దేశాన్ని నివ్వెర పరిచింది. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. 17,700 కోట్లు ప్రతిపాదించ డమైనది. ‘అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌’ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.

నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి భవన నిర్మాణం కోసం 20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మద్యం షాపుల లెసైన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ‘షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక ప్రగతి నిధి’ కింద రూ. 15,233 కోట్లు ప్రతిపా దించడమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్‌బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది. 

గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా పింఛన్‌లు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా’ పింఛన్‌ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగుల పింఛన్‌ను 3,016 రూపాయలకు పెంచింది. ప్రజల కష్టాలెరిగిన ప్రభుత్వం గనుక మేని ఫెస్టోలో పేర్కొనక పోయినా, ఎవరూ డిమాండ్‌ చేయకపోయినా బీడీ కార్మి కులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాల సిస్‌ పేషంట్లకు సైతం 2,016 రూపాయలపింఛన్‌ నెలనెలా అందజేస్తున్నది. 

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్‌లూమ్‌ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతున్నది.

ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని అంది స్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 20,501 మంది చేనేత కార్మికులకు 33.17 కోట్లు సబ్సిడీ లభించింది. చేనేత కార్మికులకు ఆసరా పింఛన్‌ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమానూ అందిస్తున్నది.

గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11 వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రంలోని గొల్ల కురుమల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. 

తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. చెట్ల రఖం బకాయిలు రద్దు చేయడమే కాక, తాటి, ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్‌డ్రింక్‌గా మార్చి అందించే ప్రాజె క్టును చేపట్టింది. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది.

తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా 2021– 22లో 51 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిషత్‌ ద్వారా పేద బ్రాహ్మణు లకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని సమకూర్చింది. బీసీ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వారికి అండగా నిలిచింది.

తెలంగాణ ఏర్పాటైన  2014 జూన్‌ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. క్రిస్మస్‌ సందర్భంగా దాదాపు 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కొత్త చీరలను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముదిరాజ్‌ సోదరులకు అవ కాశం కల్పించింది. ఈ ప్రభుత్వ సహాయంవల్ల కులవృత్తుల వాళ్లు ఎంతగానో లాభపడ్డారు.

ఇలా సంక్షేమ రంగంలో గడచిన తొమ్మి దేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేని పనితీరును ప్రదర్శిస్తూ యావత్‌ భారతా వని దృష్టిని ఆకర్షించడం హర్షణీయం. 
వద్దిరాజు రవిచంద్ర 
వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు, తెలంగాణ 

అభివృద్ధి సంబురాలు!
అభివృద్ధి అంటే నిర్దే శించుకున్న లక్ష్యాల ప్రకారం మనుగడ సాగించగలగడం. అభి వృద్ధిని పెరుగుతున్న ప్రజల జీవన ప్రమా ణాలను బట్టి కొలు స్తారు. ప్రధాన వనరు లను ఉపయోగించు కొని ఉత్పత్తులను ఏ మేరకు గణనీయంగా పెంచుకున్నామన్న దానినే ఆచరణాత్మక ప్రగ తిగా చూస్తారు.  అభివృద్ధి అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమున్నతంగా ఎదగటం. మనం జీవిస్తున్న కాలంలో మానవ వనరు లను ఏ రకంగా ఉపయోగించుకోగలుగు తున్నాం, ఉన్న వనరులను సంపద సృష్టి కేంద్రాలుగా ఏ మేరకు మార్చుకోగలిగాం అనే వాటి మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి అభివృద్ధికి సంబంధించిన అంశాన్నీ తెలంగాణ రాష్ట్ర్రంలో స్పష్టంగా చూడవచ్చు.  

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఒక శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి కేవలం ఓ దశా
బ్దంలో జరగడం విస్మయం కలిగించే అంశం. ఇవ్వాళ దేశమంతా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో అడుగులు వేసుకుంటూ తెలంగాణ  పథకాల నమూనాను కేంద్ర ప్రభుత్వమే అమలు జరిపే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎది గింది. మన దగ్గర ప్రారంభమైన ‘రైతు బంధు’ పథకం దేశంలోని మొత్తం రైతాంగాన్ని పరవ శింపజేసింది. ఇతర రాష్ట్రాల రైతులు తమ రాష్ట్రాల్లో కూడా ‘రైతు బంధు’ పథకాన్ని పెట్ట మని డిమాండ్‌ చేస్తున్నారు. దళిత సమాజానికి అండగా ‘దళిత బంధు’ పెట్టడం మొత్తం భారతదేశంలోనే  పెను విప్లవంగా నిలిచింది. ఊరుకూ, వాడకూ మధ్య ఉన్న బెర్రల్ని చెరిపేసి వాడ దగ్గరికే ఊరు పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. అందరూ సల్లంగుండాలి,

అందరూ సుఖపడాలి. అందుకు ‘అందరూ కలిసి కష్టపడాలి, సంపద పెంచాలి, సంపద పంచాలి’ అన్న దార్శనిక ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటోంది.  చీకటి కాలాన్ని పారదోలి విద్యుత్‌ వెలు గుల వెన్నెలను పంచే తెలంగాణగా విలసిల్లు తోంది. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారం అయ్యింది. రాష్ట్రంలో 1,072 గురుకుల విద్యా లయాల్ని కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో నిర్మించారు. ఇవన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ బిడ్డలు చదువుకునే సర్కారు కార్పొరేట్‌ స్కూళ్ళుగా విలసిల్లుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం జల ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లను అబ్బు రపరుస్తోంది. వైద్యరంగానికి సంబంధించి పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు విస్తృత మయ్యాయి. వైద్యాన్ని పేదవాళ్లు కొనుక్కో వలసిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళింది ప్రభుత్వం. తాజ్‌ మహల్‌ లాంటి సచివాలయం నిర్మించుకొని దానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడు గుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సమ
రంలో అసువులు బాసిన యోధుల్ని గుర్తు చేసు కుంటూ అమరజ్యోతిని నిర్మించుకున్నాం.

నెర్రెలు బాసిన నేలపైన పసిడి పంటలు తులతూగే విధంగా చేసుకోగలిగాం. నల్లగొండకు పట్టిన ఫ్లోరోసిస్‌ పీడను ‘మిషన్‌ భగీరథ’ లాంటి ప్రాజెక్టు ద్వారా వదిలించుకోగలిగాం. ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా చెరువులు నిండు కుండలయ్యాయి. ఉపాధి అవకాశాలు పెంచ గలిగాం. హైదరాబాదులోని పటాన్‌ చెరువుకే పరిమితమైన పరిశ్రమలు, ఫార్మాసిటీలు ఇప్పుడు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలతో పాటుగా  తెలంగాణ అంతటా విస్తరిస్తు న్నాయి. ‘ఈ–పాసుల’ ద్వారా సులభంగా ఇచ్చే అనుమతులతో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. ఐటీ రంగం తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 

ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయేటందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని రంగాలూ అభివృద్ధి చెందా లంటే మానవ వనరుల అభివృద్ధి అత్యంత ముఖ్యం. నైపుణ్యాలు పెంపొందాలంటే ఆరో గ్యవంతమైన సమాజం అవసరం. ఇప్పుడు ప్రతి జిల్లాలో కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించే స్థితికి రాష్ట్రం ఎదిగింది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల వరకు టాబ్లెట్‌ ఇచ్చే స్థితి నుంచి డయాలసిస్‌ సైతం చేసే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ‘కల్యాణ లక్ష్మి’, ‘కేసీఆర్‌ కిట్‌’, ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’, బీసీ ఆత్మగౌరవ భవనాలు, ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కేసీఆర్‌ మార్కు తెలంగాణ మోడల్‌కు నిదర్శనాలు.అభివృద్ధి అంటే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో చేసే వాగ్దానం కాదు. కేసీఆర్‌ దార్శ నిక ఆలోచనలతో అభివృద్ధిని తెలంగాణ నేలపై ప్రవహింపజేసి చూపారు. జరిగిన అభి వృద్ధి ఊహకు అందనిది.  తక్కువ కాలంలో సాధించిన ఈ ప్రగతి భవిష్యత్తును మరింత పటిష్ఠంగా నిర్మించుకుంటూ పోవడానికి భరోసా ఇస్తోంది. అందుకే  తెలంగాణ ‘దశాబ్ది సంబురాలు’ ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటోంది. ఊరూరా, వాడవాడలా ప్రభుత్వం సాధించిన ప్రగతిని చాటి చెçప్పుకుంటూ, సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఈ సంబురాలను వాడుకుంటోంది.
వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడెమీ ఛైర్మన్‌
(నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం;  దశాబ్ది ఉత్సవాల ప్రారంభం)
జూలూరి గౌరీశంకర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement