తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా... | CM KCR decisions in review on Telangana Formation Celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా...

Published Sun, May 14 2023 3:33 AM | Last Updated on Sun, May 14 2023 2:35 PM

CM KCR decisions in review on Telangana Formation Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూ పదో వసంతంలోకి అడుగిడుతున్న వేళ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణపై శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వరకు, రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో తొలిరోజు ఉత్సవాలు ప్రారంభం కానుండగా మంత్రులు వారివారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నారు.  

ఆశ్చర్యపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు 
‘తెలంగాణ సాధించుకొని 2023 జూన్‌ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశానికే రోల్‌ మోడల్‌గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

కేంద్రం, ఇతర రాష్ట్రాలకు కొరవడిన కార్యాచరణ.. 
అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన ఫలితాలను ప్రజలకు అందేలా చూడటంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణపట్ల దూరదృష్టి కొరవడిందని విమర్శించారు. 

9 ఏళ్లు కాదు.. కేవలం ఆరేళ్లే! 
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని చూస్తే వాస్తానికి అందుకు ఇంకా చాలా తక్కువ సమయమే పట్టిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పేరుకు తొమ్మిదేళ్లు అయినా తొలి ఏడాదితోపాటు కరోనా రెండేళ్ల పీడ వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమన్నారు.  

వేడుకల షెడ్యూల్‌ ఇలా... 
► జూన్‌ 2న తొలిరోజు కార్యక్రమాలను సచివాలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్‌వోడీలు ఉద్యోగులు హాజరవుతారు. 

► అమరవీరులను స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఒక రోజును ‘మార్టియర్స్‌ డే’గా జరుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను అలంకరించి గ్రామగ్రామాన నివాళులు అర్పించాలి. జాతీయ జండాను ఎగరేసి వందన సమర్పణ చేయాలి. వారి త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్‌ డేలో పాల్గొనాలి. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొనాలి. 

► వివిధ శాఖలు సాధించిన ప్రగతిని (ఆయా శాఖలకు కేటాయించిన రోజున) రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి. 
► విద్యుత్‌ శాఖకు కేటాయించిన రోజును పవర్‌ డే’గా, తాగునీరు సాగునీటి సరçఫరాకు సంబంధించిన రోజును ‘వాటర్‌ డే’గా నిర్వహించాలి. 

► అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి వెల్పేర్‌ డేను ప్రత్యేకంగా ఒకరోజు నిర్వహించాలి. దళితబంధు అమలు, 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టడం మొదలు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, మహిళలు సహా పేద వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యాచరణ సమాచారాన్ని మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలుండాలి. 

► అగ్రికలర్చర్‌ డే, రూరల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డే, రెవెన్యూ డే, పరిపాలనా సంస్కరణలు, పోలీసు సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపేలా ‘విమెన్స్‌ డే, ఇండస్ట్రీస్‌–ఐటీ డే, ఎడ్యుకేషన్‌ డే, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డే, ఆర్టిజన్స్‌ డే (వృత్తిపనులు), గ్రీన్‌ డే, హ్యాండ్లూమ్‌ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృధ్ధి.. ఇలా ఒక్కో శాఖకు ఒక్కోరోజును కేటాయించి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలు చేపట్టాలి. 

► స్వతంత్ర భారతంలో, తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీని రూపొందించి ప్రదర్శించాలి. 

► స్వయం పాలనలో తెలంగాణలో సాగిన సుపరిపాలన, ప్రగతి గురించి మరో డాక్యుమెంటరీని రూపొందించాలి. 
► 21 రోజుల సంబురాల సందర్భంగా పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. 
► గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి చారిత్రక కట్టడాలను, రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలను విద్యుత్‌ కాంతులతో అలంకరించాలి. 
► హుస్సేన్‌ సాగర్‌ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలి. 
► విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి అవార్డులు అందజేయాలి. 
► రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5–6 వేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూం ధాం, ర్యాలీ నిర్వహించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement