బుక్‌ఫెయిర్ విశేషాలు వివరిస్తున్న జూలూరి గౌరీశంకర్
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్‌ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్‌టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు.
పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు ఎన్‌టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు.
మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment