కలల వరద
ప్రపంచంతో సంభాషించడా నికి అరుణాంక్ లత ఒక స్వప్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. కలలో తొణికిన ప్రేమను అంతే జాగ్రత్తగా లేఖలుగా మలిచి పాఠకుల ముందుకు తెచ్చాడు. ‘యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు తెరలు తెరలుగా చుట్టుము’ట్టే జ్ఞాపకాల పునాదులు ‘ఖ్వాబ్’లో ఉన్నాయి. ‘హృదయం బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా, పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ’ అని కలవరిస్తాడు. ఇందులో గుండె ఉక్కబోతలు, వాన పలకరింపులే కాదు, ఒక విధ్వంసం కోసం మరో విధ్వంసానికి బలవుతున్న నల్లమల వ్యథ, అసు వులు బాస్తున్న అఖ్లాక్‌ల కథ, వాఘా యుద్ధోన్మాద ప్రకటనలపై విసుర్లు కూడా ఉంటాయి. అందుకే ఇది ప్రేమ, విప్లవాల మేలుకలయిక. మరోవైపు తలత్, సైగల్ గొంతుల పలవరింత మైమరపిస్తుంది. మీరూ వినండి. (ఖ్వాబ్ –అరుణాంక్ లత, వెల: రూ. 120)
బస్తర్ తిరుగుబాటు
స్వాతంత్య్ర పోరాటంతో సహా ఆదివాసీలు ఎన్నో అసమాన పోరాటాలు చేసినా అవి ఎందుకో సరైన రీతిలో సమగ్రంగా చరిత్రకు ఎక్కలేదు. అలా విస్మృతికి గురైన మరో పోరాటం భూంకాల్ విప్లవ పోరాటం. ఆ పోరాటం నుంచి ఆవిర్భవించినవాడే గుండాధూర్. రాజకీయ నేతలెవరూ ఇంకా స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తక ముందే ఆదివాసీ సమాజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, తన జీవిత కాలంలోనే పురాణ పురుషుడిగా ఖ్యాతినొందాడు గుండాధూర్. 1910లో 30 గోండు రాజ్యాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంకాల్ తిరుగుబాటు అనివార్యమైంది. గుండాధూర్ చేసిన పోరాటాలు బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలను ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. (భూంకాల్– బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు–హెచ్.ఎల్.శుక్లా, వెల: రూ. 130)
నమ్మకమిచ్చే కథలు
కథలన్నీ సంకలనంగా రాకముందే, రచయితగా పాఠకులను మెప్పించినవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో అక్కిరాజు భట్టిప్రోలు ఒకరు. వస్తువును స్వీకరించడంలో, దాన్ని నడిపించడంలో, పాత్రలకు సహజత్వాన్ని అద్దడంలో.. వెరసి పాఠకుడిని కథలోకి ఆవాహన చేయడంలో ఆయన చేయి తిరిగినవాడని ‘మూడు బీర్ల తర్వాత’ సంపుటం నిరూపిస్తుంది. తాను చూసిన జీవితంలోంచే కథా వస్తువులను స్వీకరించాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలోని మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో, అనుభూతి ప్రకంపనలు కోల్పో కుండా కొన్నిసార్లు కథను తర్కబద్ధంగా నడిపించడంలో, ఎవరినీ తప్పుబట్టకుండా జీవన వైరుధ్యాలను ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. తన జీవన ప్రయాణంలోని అనుభవాలకు ఇచ్చిన ఈ కథలు కొన్నిసార్లు మనకూ తారసపడతాయి. – దేశరాజు (మూడు బీర్ల తర్వాత –అక్కిరాజు భట్టిప్రోలు, వెల: రూ. 170)
నిలువెత్తు హింస
అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి చేపట్టే భూసేకరణలో అంతు లేని హింస చోటుచేసుకుంటోంది. అందుకు దక్షిణ ఛత్తీస్ గఢ్ నిదర్శనం. అక్కడ ఏం జరిగిందనే వివరాలతో అక్కడి లైంగిక హింసపై ‘నిలువెత్తు సాక్ష్యం’ కార్యాచరణ బృందం వెలువరించిన పుస్తకాన్ని మలుపు ప్రచురణలు తెలుగులోకి తీసుకొచ్చింది. గనుల తవ్వకాల కోసం, ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం స్థల సేకరణ, వారి సామగ్రి రక్షణకు సీఆర్‌పీఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరిస్తే, ప్రైవేట్ కంపెనీల అవసరాల కోసం సొంత సైన్యాలు రంగంలోకి దిగాయని సమాచారం. వీరంతా కలిసి రెండున్నర లక్షల మంది ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానించి తరిమేయడానికి లైంగిక హింసను ఆయుధంగా వాడుకున్నారు. (నిలువెత్తు సాక్ష్యం–దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో లైంగిక హింస, వెల: రూ.130)
కవిత్వపు గింజలు
పల్లెను ప్రేమించడానికి అక్కడివారే కానక్కర్లేదు. పంటను కళ్లకద్దుకోవడానికి వ్యవసాయదారుడే అవ్వక్కర్లేదు. పచ్చదనాన్ని కలగనడానికి పర్యావరణవేత్తే కానక్కర్లేదు. ‘అతనికి అందరూ తెలియక పోవచ్చు/కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ/అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే–’ అని రైతు గురించి రాయగలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి కూడా కవిత్వం తెలిసినవారందరికీ తెలుసు. పంటను తగలబెట్టకు తండ్రీ, పంట కాల్వ, ధాన్య మానవునికి, మట్టి బిడ్డా, వరిపొలానికి కృతజ్ఞతల్తో, మళ్లీ నా వ్యవసాయ కళాశాలకు వంటి కవితలతో అన్నంపెట్టే రైతుపట్ల, వ్యవసాయంపట్ల తనకు గల అపార అభిమానాన్ని మరో సారి ఆయన చాటుకున్నారు. ‘వాళ్లు/ నేలతో నీటితో నింగితో నిప్పుతో/కలిసి బతికేవాళ్లు/అందుకే వాళ్లకు ప్రేమా దయా కృతజ్ఞతా/చల్లని చూపూ తెలుసు’అంటూ ప్రజల్ని అభిమానించే కవి కాబట్టే ‘కళ్లకు కాసిన్ని/చూపు ఉత్సవాల్ని ఇవ్వకుండా’ ఇంతగా పరుగెత్తాలా అని నిలదీస్తాడు.(ధాన్యం గింజలు–దర్భశయనం శ్రీనివాసాచార్య, వెల: రూ. రూ.80)
పల్లె చెప్పిన పాఠం
పల్లెటూరినుంచి మద్రాస్ వలసపోయిన విద్యాధిక కుటుంబంలో పుట్టి పెరిగిన పట్నవాసం అమ్మాయి.. పెళ్లయి పల్లె జీవితంలోకి వచ్చి పడితే ఎన్ని వైరుధ్యాలమధ్య నలగవలసి వస్తుందో చెప్పిన అనుభవాల పరంపరే ‘పాలంగి కథలు’. మద్రాసులో గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన రచయిత్రి.. తణుకు పక్కన పాలంగి పల్లెటూరులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆధునికత దరిచేరని సమాజంలో, భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగి పోయిందీ ‘పాలంగి కథలు’లో ఆత్మకథనాత్మక రీతిలో పాఠకుల ముందుపెట్టారు. ఇది ఆమె జీవితం మాత్రమే కాదు. అలనాటి సంప్రదాయ కుటుంబాల స్త్రీల జీవితాల ప్రతిబింబమీ కథలు. ఒక్క మాటలో చెప్పాలంటే ’ఈతరం వారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజ సుందరమైన గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకుపోయే’ అరుదైన రచన. దీన్ని చదివే అనుభవాన్ని కోల్పోవద్దు. – కె. రాజశేఖరరాజు వెల: 100, ప్రతులకు స్టాల్ నంబర్ 275
Comments
Please login to add a commentAdd a comment