‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. 2010 నుంచీ ఇప్పటివరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయని ‘ఎ డికేడ్ ఆఫ్ డార్క్‌నెస్’ డేటాబేస్ చెబుతోంది.
ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. కొన్ని రాష్ట్రాల పాలకులు కూడా అదే ‘అలవాటు’లో ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపింది. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణే పాలకుల ప్రాధాన్యమా?
‘‘దేశంలో వలస పాలన అంతరించిన తరువాత కూడా, వలస పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశంలో పౌరులపైన, పౌర హక్కులపైన విధించిన ‘దేశద్రోహ’ చట్టంలోని ‘124–ఎ’ నిబంధన అమలు జరుగు తూండటం దారుణం. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది.
ఈ తప్పుడు నిబంధన సృష్టించిన సమస్యను ఏ భాషా మార్పు వల్లా, నిబంధనల సరళింపు వల్లా పరిష్కరించలేము. ఎందుకంటే ‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. కనుకనే స్వతంత్ర భారత సుప్రీంకోర్టు ‘124–ఎ’ దేశద్రోహ నేరా రోపణ నిబంధన స్వతంత్ర భారతంలో చెల్లదని కేదార్‌నాథ్ వర్సెస్ బిహార్ (1962) కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది.
ఈ అత్యు న్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పాలకులు అమలు జరిపి ఉంటే – ప్రభుత్వాన్ని విమర్శించిన నేరానికి లేదా అలాంటి విమర్శను ప్రసారం చేసే వీడియోలు విన్న నేరానికి లేదా అలాంటి పాటలు విన్న నేరానికి దేశ పౌరులపైన దేశద్రోహ కేసులను పాలకులు మోపి ఉండేవారు కాదు. ఇప్పటిదాకా రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద 2010 నుంచీ ఇప్పటి వరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.’’
– లభ్యతి రంగరాజన్
(ఇప్పటివరకూ దేశంలో నమోదైన ‘దేశద్రోహ’ కేసులను పరిశీలించి, వాటిని ‘ఓ దశాబ్దపు చిమ్మ చీకటి’ (ఎ డికేడ్ ఆఫ్ డార్క్‌నెస్) పేరిట ఏర్పాటుచేసిన డేటాబేస్ సాధికారికంగా నమోదు చేసింది. దీనికి లభ్యతి రంగరాజన్ ఎడిటర్‌గా ఉన్నారు.)
దేశ పాలకులూ, వారి ఇష్టానుసారం మెలగుతున్న పాలనా యంత్రాంగమూ పుర్రెకు పుట్టిన బుద్ధి ప్రకారం పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టవచ్చా? అనుకూలమైన వలస చట్టాల చాటున అనేక రకాల నిర్బంధాలకు గురి చేయవచ్చునని ‘పెగసస్’ విదేశీ స్పైవేర్ కొనుగోలు చేసినప్పుడే ఇది నిరూపితమైంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. అలాంటి చట్టా లపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు కూడా అదే ‘అల వాటు’లో ఉన్నారు.
ఉండబట్టే తాజా పరిణామాలలో భాగంగా దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ విద్యావేత్త, సంస్కర్త, పౌరహక్కుల ఉద్యమ నాయకులలో ఒకరు అయిన ప్రొఫె సర్ హరగోపాల్ సహా దాదాపు 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపి పాలకులు తమ ‘చెవి దురద’ తీర్చుకున్నారు. ఆ ‘దురద’ను అంత త్వరగానూ తొలగ గొట్టుకోవడానికి తంటాలు పడ్డారు. ఏ ‘నేరం’పైన ఈ కుట్ర కేసు బనాయించవలసి వచ్చిందో స్పష్టత లేదు.
కాగా, ఫక్తు తెలంగాణ వాసి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనకు దూరంగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, తాను పుట్టి పెరిగిన ఫ్యూడల్ సంప్రదాయాల్ని కాలదన్నిన వారు బి.నరసింగరావు. తెలంగాణలో తన ప్రజలు అనుభవించిన భూస్వామ్య దాష్టీకాలను కళ్లారా చూసి మనసు చెలించి, ‘దాసి’ చలన చిత్రం ద్వారా ధనిక వర్గ దుర్మార్గాన్ని ఎండగట్టి దేశంలోనే గాక అంతర్జాతీయంగానూ ఆయన ఖ్యాతి గడించారు.
అలాంటి నేలతల్లి బిడ్డకు కూడా పాలకులు ‘ఇంటర్వ్యూ’ ఇవ్వడానికే జంకారు, కాదు భయపడ్డారు, లేదా బిడియపడ్డారు! ఎందుకు? నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే తెలంగాణకు నిజమైన రక్షణ ఉందని ఆయన ప్రకటించినందుకు! పేరుకు తగ్గట్టే ఆయనది తెలంగాణలోని ‘ప్రజ్ఞాపురం’. వాస్తవం ప్రకటించినందుకు తనకు ఇంటర్వ్యూను నిరాకరించిన నేటి తెలంగాణ పాలకులను ప్రశ్నిస్తూ నరసింగరావు ఎక్కడ పుట్టిన ‘కమలం’ ఇది అని ప్రశ్నించడం కొంత బాధాకరమైనదైనా అది తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది మాత్రమేనని భావించాలి.
భారత లౌకిక రాజ్యాంగం నిర్దేశించి నెలకొల్పిన సుసంప్ర దాయాలు ఎన్నో ఉన్నా వాటిని తృణీకరించి ప్రజా వ్యతిరేక పాలనను డొల్లించుకుపోతున్న పాలకులకు ‘ముగుదాడు’ వేయగల ప్రజా స్వామిక న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఉన్నందున, పాలకులు, పాలనా వ్యవస్థ కొంతమేర అదుపులో ఉన్నట్టు కన్పిస్తోంది. కానీ లోపాయికారీ పద్ధతుల్లో దేశంలోని ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాల్ని దెబ్బతీయడానికి మరోవైపు నుంచి మతవాద, మితవాద శక్తులు చీలుబాటలవైపే ప్రయాణిస్తూ వ్యవస్థను అస్థిరం చేస్తున్నాయని మరచిపోరాదు.
అంత కన్నా ఎన్నటికీ మరవరాని అంశం – రాజ్యాంగంలో పొందుపరచు కున్న ప్రజాహిత సూత్రాలను అమలు చేయించుకోగల హక్కును దేశ పౌరులకు లేకుండా చేశారు. కారణం స్పష్టమే. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణకే పాలకుల ప్రాధాన్యం.
నేడు రాజ్యాంగమూ, దాని ప్రయోజనాలనూ కేవలం కొద్దిమంది కార్పొరేట్ అధిపతులు, వారికి కొమ్ముకాస్తూన్న పాలక వర్గమే అనుభవిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. తొల్లింటి అరకొర ప్రజానుకూల ప్రణాళికా వ్యవస్థ కూడా ఈ రోజున కూలిపోయింది. అందుకే కూలిపోయే వ్యవస్థను కాపాడ్డానికే దాని రక్షకులైన పాలక వర్గాలు ‘కంకణం’ కట్టుకుంటారు. మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల క్రితమే రానున్న పరిణామాల్ని గురించి ముందస్తు హెచ్చరిక చేశారు:
‘‘విభజన రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు చెరసాలలు, ఉరి కొయ్యలు’’ అని చెబుతూనే – ‘‘అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టనివాళ్లు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్లు మీలోకి పోతారు’’ అనీ ప్రకటించారు!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment