సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులు ప్రవేశం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీంతో ప్రతి జిల్లాలో కొత్తగా 5,6,7 తరగతుల్లో అదనపు ప్రవేశాలకు అవకాశం ఉంటుంది.
లొకేషన్లకు గ్రీన్ సిగ్నల్...
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 33 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన లొకేషన్ల ఫైనలైజేషన్ పూర్తయింది. జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ క్రమంలో వీటి ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.
మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా పాత పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాక కొత్త పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. వచ్చేనెల మొదటి వారంలో అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది.
అతి పెద్ద సొసైటీగా...
రాష్ట్రంలో నాలుగు సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల సొసైటీలుండగా...ప్రస్తుతం అతి పెద్ద సొసైటీగా ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆవిర్భవించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలలతో పోలిస్తే ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో 294 గురుకుల పాఠశాలలున్నాయి. ఆ తర్వాత టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో 267 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది. మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 206 పాఠశాలలు, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 186 పాఠశాలలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment