Telangana: కొత్త గురుకులాలు షురూ  | Telangana Govt To Start Newly Sanctioned BC Gurukul Education | Sakshi
Sakshi News home page

Telangana: కొత్త గురుకులాలు షురూ 

Published Fri, Oct 14 2022 2:58 AM | Last Updated on Fri, Oct 14 2022 2:58 AM

Telangana Govt To Start Newly Sanctioned BC Gurukul Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బీసీ గురుకుల విద్యా సంస్థలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరానికి గాను ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాల, ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్‌ ఉన్న మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. యుద్ధప్రాతిపదికన ఈ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో బీసీ గురుకుల సొసైటీ ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసింది.

అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సొసైటీ చర్యలు పూర్తి చేసింది. కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది 5,6,7 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేయగా, విద్యార్థులు సైతం రిపోర్టు చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 

మొత్తం 295 గురుకుల పాఠశాలలు 
 ఇప్పటివరకు రాష్ట్రంలో 262 గురుకుల పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో బీసీ గురుకులాలకు డిమాండ్‌ విపరీతంగా ఉండడం... ప్రతి సంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా నిండుతుండగా... మరింత మంది ఆశావహులు సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో కొత్తగా 33 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 295కు చేరి అత్యధిక విద్యా సంస్థలతో అతి పెద్ద సొసైటీగా నిలిచింది. 

వచ్చే వారం నుంచి డిగ్రీ కాలేజీలు షురూ... 
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 16కు చేరనుంది. కొత్తగా ప్రారంభించనున్న డిగ్రీ కాలేజీలకు భవనాలను గుర్తించిన అధికారులు మిగతా ఏర్పాట్లలో బిజీ అయ్యారు.

ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకాధికారులుగా పదవీ విరమణ పొందిన కాలేజీ ప్రిన్స్‌పాళ్లు, సీనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేసింది. మరోవైపు బోధన సిబ్బందిని గెస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతిలో ఎంపిక చేస్తోంది.అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 15వ తేదీతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది. వచ్చే వారంలో అడ్మిషన్లు పూర్తి చేసిన వెంటనే తరగతులు ప్రారంభిస్తామని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement