సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఇష్టానుసారంగా నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంజూరైన నియోజకవర్గాల పరిధిలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. గురుకుల పాఠశాలలను ఒక చోట మంజూరు చేస్తే మరో ప్రదేశంలో నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు సంబంధించి దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందులో ఒకటి బాలికలది కాగా, మరొకటి బాలుర గురుకులం. వీటిని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలి. ఈ మేరకు గురుకుల పాఠశాలల మంజూరు సమయంలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్దేశిస్తారు. కానీ ప్రస్తుతం మూడువంతుల గురుకుల విద్యా సంస్థలను అనుమతించిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.
అద్దె భవనాలు దొరక్క..
రాష్ట్రంలో దాదాపు వెయ్యి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 820 గురుకుల పాఠశాలలు కాగా, వీటిలో మూడోవంతు పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవికాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విడతలవారీగా మంజూరు చేయగా.. వాటికి భవనాలను నిర్మించే వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని సూచించింది.
దీంతో గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిబంధనలకు అనుగుణంగా భవనాలను వెతికినప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతాల్లో తగిన భవనాలు లభించక.. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారు. భవనాల లభ్యత ఉన్న చోటనే అద్దెకు తీసుకుని అక్కడే గురుకులాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పెద్ద భవనాలున్న చోట రెండు, మూడు, నాలుగు.. గురుకుల పాఠశాలలను ఒకే క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాల మంజూరు చేసిన ప్రాంతం దాటి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.
ఫిర్యాదులతో.. స్పందించిన సర్కారు
అనేక చోట్ల ఆయా నియోజకవర్గాల పరిధి దాటి వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికతకు ప్రాధాన్యతమిస్తూ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా.. అనుమతించిన ప్రాంతంలోనే గురుకుల పాఠశాలలను నిర్వహించాలని స్పష్టం చేసింది.
రెండురోజుల కిందట రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో సమావేశమై లొకేషన్ల అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఎక్కడ మంజూరు చేస్తే అక్కడే గురుకులాన్ని నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలను గుర్తించి వెంటనే అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహాలో ఆదేశాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment