సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడతల వారీగా తరగతులను డిజిటలీకరిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం(2022–23) పూర్తయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనే జరుగుతుందన్నారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 281 గురుకుల పాఠశాలల్లో 1,696 తరగతులు డిజిటలైజ్ అవుతాయన్నారు.
శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్(మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) బోర్డు సమావేశం మంత్రి గంగుల అధ్యక్షతన జరిగింది. 2022–23లో సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం చేయాలన్న నిర్ణయంపై బోర్డు తీర్మానించింది. అలాగే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు వేడినీటి వసతి కల్పన కోసం టీఎస్ రెడ్కో ద్వారా సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
పాఠశాలల నిర్వహణ పక్కగా జరిగేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి వాఖ్యానించారు. అకడమిక్ సెల్‌ను తీర్చిదిద్దాలని, అంతర్గత ఆడిట్ బృందాలను మరింత బలపర్చాలన్నారు. ఇదిలా ఉండగా, ‘గురుకులం.. దూరాభారం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై మంత్రి స్పందించారు. గురుకులాల నిర్వహణకు తీసుకునే అద్దె భవనాలతో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment