సాక్షి, హైదరాబాద్ : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంక్షేమ గురుకుల పాఠశాలల ఖ్యాతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి చాటింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క విద్యార్థికి నిర్బంధ ఉచిత విద్యను అందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి యేటా వందల సంఖ్యలో గురుకులాలను తెరుస్తూ వచ్చింది. రాష్ట్రంలో 650కి పైగా గురుకుల పాఠశాలలు, మరో 250 రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీ లు ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తీరుపై అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మేరకు సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా రాష్ట్ర గురుకుల సొసైటీలకు పంపింది.
గురుకుల విద్యా వ్యవస్థపై..
సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల అమలుపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం అధ్యయనం చేయనుంది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గురుకులాల తీరును పరిశీలించనుంది. దీనిలో భాగంగా కొన్ని గురుకుల పాఠశాలలను ఎంపిక చేసుకుని అక్కడ క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి పరిస్థితులను స్వయంగా వీక్షించనుంది. దేశీయ విద్యా వ్యవస్థలో పేద పిల్లలకు ఎలాంటి విద్యనందిస్తున్నారు? ఈ విద్యా కార్యక్రమాల అమలుకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఈ శతాబ్దానికి కావాల్సిన నైపుణ్యాలు, భవిష్యత్‌తరాలకు ఎలా ఉపయోగపడతాయి? వాటిని ఎలా మార్పులతో అందిస్తున్నారు? తదితర అంశాలను లోతుగా పరిశీలించనుంది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో అత్యంత పోషక విలువలున్న ఆహారాన్ని ప్రభు త్వం విద్యార్థులకు అందిస్తోంది. అదేవిధంగా వసతి కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోం ది. ఈ క్రమంలో హార్వర్డ్ వర్సిటీ విద్యావ్యవస్థతో పాటు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలతో పాటు విద్యేతర కార్యక్రమాలను కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ పరిశీలన బృందం రాష్ట్రానికి రానుంది. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెర్నాం డో రీమర్స్ గురుకుల సొసైటీకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment