సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికావస్తుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు) ఏర్పాటు చేసింది. గతేడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ బోర్డు ఇప్పటివరకు 3,679 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆర్నెల్లలో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో గతేడాది జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ వేగం పెంచడంతో నియామకాల అంశం కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ పూర్తి కానున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యా ఏడాదికల్లా అన్ని కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో కొత్త విద్యా ఏడాదిలో కొత్త గురువులు పాఠాలను బోధించనున్నారు.
పీజీటీ నియామకాలు పూర్తి...
నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీలో ఇప్పటికే పీజీటీకి సంబంధించిన నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితాను సంబంధిత సొసైటీలకు బోర్డు పంపించింది. తుది జాబితా ఆధారంగా సొసైటీలు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి నియామక పత్రాలను అందిస్తోంది. టీజీటీ కేటగిరీకి సంబంధించి 1:2 జాబితాను పరిశీలిస్తోంది. టెట్ మార్కుల పరిశీలన కోసం టెట్ డైరెక్టర్‌కు నివేదిక పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలు వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియ కొలిక్కి రానుంది. మొత్తంగా నెలాఖరులోగా పూర్తి కానుంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌కు సంబంధించి కూడా 1:2 జాబితా రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరితంగా ఈ జాబితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
పూర్తిస్థాయిలో నియామకాలు జరిగేలా...
గురుకుల బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకే అభ్యర్థికి రెండేసి పోస్టులు వస్తే... అతని ప్రాధాన్యత ఆధారంగా అవసరం లేని పోస్టుకు అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుకుల బోర్డు తొలుత పెద్ద పోస్టులను భర్తీ చేస్తోంది. పీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అంగీకార పత్రాలను ఇస్తున్నారు. దాదాపు 125 మంది అంగీకార పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గురుకుల బోర్డు వెబ్‌సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అభ్యంతరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచి తక్షణమే రంగంలోకి దిగుతున్న అధికారులు వీలైనంత తక్కువ సమయంలో అభ్యర్థులకు నివృత్తి చేస్తున్నారు. నెలాఖరులోగా టీజీటీ, వెనువెంటనే జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీ పూర్తి చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment