Residential Schools
-
అంతా బాగుంటే..అక్షరాస్యతలో అడుగునెందుకున్నాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలు గొప్పగా ఉన్నాయని ఓవైపు చెప్పుకొంటున్నప్పటికీ, 28 లక్షల మంది ఉండే ప్రభుత్వబడుల విద్యార్థుల సంఖ్య 22 లక్షలకు పడిపోయిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నట్టు లేదని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అక్షరాస్యత జాబితా లో మన రాష్ట్రం కింది నుంచి నాలుగో స్థానంలో ఉందని గుర్తించాలన్నారు. శుక్రవారం శాసనసభలో విద్య–వైద్యంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. 2218 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బాసర ఐఐఐటీలో పూర్తిస్థాయి నియామకాలు లేక పరిస్థితి దిగజారుతోందన్నారు. ఈటల ప్రసంగానికి మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రెండేళ్ల క్రితం ఈటల రాజేందర్.. తాను చదువుకున్నప్పుడు పురుగుల అ న్నం తిన్నానని, కేసీఆర్ వల్ల ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు నాణ్యమైన సన్న బియ్యం బువ్వ తింటున్నారని అన్నారు. ఇటు నుంచి అటు ఆయన మారగానే ఇక్కడ పరిస్థితులు దిగజారిపోయాయా?’అంటూ ప్రశ్నించారు. -
AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్ చార్జీల పెంపు!
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్ గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్ జవహర్‌రెడ్డి జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి.. 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు -
గురుకులాల విద్యార్థులకు ఎస్ఎంఎస్
సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు తెరుచుకునేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం(21వ తేదీ) నుంచి గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. హైకోర్టు అనుమతి ఇచ్చిన నేథప్యంలో గురుకులాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో కోవిడ్–19 ని బంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధనతో పాటు ఇతర కార్యకలాపాలు యధావిధిగా సాగించాలని సం క్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శులు బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణలో సుదీర్ఘ సూచనలతో రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమాధికారులు, ప్రిన్స్‌పాళ్లకు ఆదే శాలు జారీ చేశారు. గురుకులానికి వచ్చే విద్యార్థికి కోవిడ్–19 నిర్ధారణ తప్పనిసరి కాదని, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి ప్రవేశం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. చర్యలకు ఉపక్రమించిన క్లాస్ టీచర్లు ప్రతి విద్యార్థి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడి హాజరుపై స్పష్టత ఇచ్చారు. బోధనపై దృష్టి సారించాలి ఇప్పటికే ఇతర విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో గురుకుల విద్యార్థులకు బోధన, అభ్యసనంపై మరింత దృష్టి సారించాలని అధికారులు, బోధనా సిబ్బందికి సొసైటీ కార్యదర్శులు సూచనలిచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు సమీపించడంతో, ఇంటర్‌తోపాటు ఇతర తరగతుల విద్యార్థుల బోధనపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లో ఇప్పటికే కోవిడ్–19 నిబంధనలకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, «థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని, పిల్లలకు డైట్ మెనూ సరుకులు సైతం సిద్ధంగా ఉంచినట్లు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి తెలిపారు. జాగ్రత్తలు తప్పనిసరి... గురుకుల విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. విద్యాసంస్థకు వచ్చే పిల్లలకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. అనంతరం మాస్కు, శానిటైజర్ అందించడంతో పాటు కోవిడ్–19 నిబంధనల పాటించడంపై అవగాహన కల్పించాలి. పాఠశాల, కళాశాల ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. విద్యార్థులకు జలుబు, జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వారిని ఐసోలేట్ చేసి కోవిడ్–19 పరీక్ష నిర్వహించి నిర్ధారించుకోవాలి. అనంతరం తగిన చికిత్స అందించాలి. ప్రతి విద్యా సంస్థలో ఐసోలేషన్ గదులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి విద్యాసంస్థలో వైద్య సహాయకులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లిన ప్లేటు, గ్లాసు, పెట్టె తిరిగి వెంట తెచ్చుకోవాలి. బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జూమ్, ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యార్థికి కలిగిన పరిజ్ఞానాన్ని అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. -
సర్కారు బడి భళా..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పుంజుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని తాళలేక విద్యార్థులు క్రమంగా సర్కారు బడిబాట పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన బడిబాట తాలూకు ప్రాథమిక గణాంకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. గత సంవ త్సరం ఇదే సమయానికి 1.86 లక్షల మంది విద్యార్థులే అడ్మిషన్లు తీసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ప్రతి పాఠశాల సమాచార నివేదికలో నిర్ణీత తేదీ నాటికి కొత్త అడ్మిషన్లు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెలాఖరు నాటి వివరాల ఆధారంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల గణాంకాలపై స్పష్టత వస్తుంది. గురుకులాల తర్వాత ప్రభుత్వ బడులే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొంది. వాటి ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలపై కొంత ప్రభావం పడింది. కానీ గురుకులాల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు చూస్తున్నారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలున్నాయి. వాటిలో 10 వేల స్కూళ్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తుండగా మిగతా 30 వేల స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గతేడాది గణాంకాల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో 52 శాతం విద్యార్థులున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేవలం 42 శాతమే ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు నమోదు కావడమే అతిపెద్ద ఉదాహరణ. ఈ నమోదు సంఖ్య ప్రైవేటు పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్యకు సమానం కావడం గమనార్హం. ఈ ఏడాది బడిబాటలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 20,117 మంది విద్యార్థులు నమోదయ్యారు. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 3,836 మంది విద్యార్థులు నమోదయ్యారు. 30 శాతం స్కూళ్లలో 100 శాతం ఫలితాలు రాష్ట్రంలో 4,637 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 1,580 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇవి కాకుండా 185 కేజీబీవీలు, 97 ఆదర్శ పాఠశాలలు, 33 ఎయిడెడ్ పాఠశాలలు, 47 ఆశ్రమ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు కూడా నూరు శాతం ఫలితాలు సాధించాయి. అదే ప్రైవేటు కేటగిరీలో 5,177 స్కూళ్లకుగాను 2,279 స్కూళ్లలో మాత్రమే వంద శాతం ఫలితాలొచ్చాయి. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ భారీగా పెరిగింది. హైస్కూల్ విద్యార్థికి ట్యూషన్ ఫీజు రూపంలో ఏటా రూ. లక్ష చెల్లించాల్సి వస్తోంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు ప్రభుత్వ బడిబాట పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పన సమస్యకు పరిష్కారం చూపితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
గురుకుల సీట్లకు భలే క్రేజ్ !
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలకు క్షేత్రస్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. గురుకులాల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గురుకుల పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 819 గురుకుల పాఠశాలల్లో ఆయా సొసైటీలు ఐదోతరగతి అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. మొత్తం 64,140 సీట్లు ఉన్నాయి. వీటిలో మైనార్టీ గురుకుల పాఠశాలలు మినహా ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి టీజీసెట్ృ2019 అర్హత పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పద్ధతిలోనే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నాలుగు సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా...తొలివిడత కౌన్సెలింగ్‌లో ఏకంగా 83.76% విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. మరో రెండ్రోజుల సమయంలో మరికొందరు ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఈనెల 25 వరకు తొలివిడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి 26న రెండో విడత జాబితాను ఇచ్చేందుకు టీజీసెట్ కన్వీనర్ ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా ఇప్పటికే 39,990 మంది ప్రవేశాలు పొందారు. ఈనెల 25 తర్వాత ఉన్న ఖాళీల ఆధారంగా రెండో విడత జాబితా విడుదల చేస్తారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల ఆధారంగా మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించే అంశంపై టీజీసెట్ నిర్ణయం తీసుకుంటుంది. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 16,400 సీట్లు ఉన్నాయి. ఈ గురుకులాల్లో కూడా అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ...ఇప్పటివరకు ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యను ఇంకా ఆ సొసైటీ విడుదల చేయలేదు. సొసైటీల వారీగా ఉన్న పాఠశాలలు, ఐదో తరగతిలో సీట్ల వివరాలు వచ్చే నెల 15కల్లా పూర్తి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను జూలై 15కల్లా పూర్తి చేయాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఈనెల 26న రెండో విడతలో దాదాపు అన్ని సీట్లు భర్తీ అవుతాయని సొసైటీలు అంచనా వేస్తున్నాయి. రెండోవిడత పరిస్థితిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. అన్ని గురుకులాల్లో ఐదోతరగతికి ఉమ్మడి పరీక్ష నిర్వహించగా... 6,7 తరగతుల్లో ఖాళీల భర్తీకి సొసైటీలు విడివిడిగా పరీక్షలు నిర్వహించాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కావడంతో సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. వీటిల్లోనూ 90% సీట్లు భర్తీ అయినట్లు బీసీ గురుకుల సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో ఖాళీలను కూడా ఇదే తరహాలో భర్తీ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నిర్దేశించిన స్కూల్లో అడ్మిషన్ పొందినప్పటికీ స్కూల్ మార్పు చేసుకునే అంశంపై గురుకుల సొసైటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుదూర ప్రాంతాల్లోని స్కూళ్లలో సీట్లు పొందిన విద్యార్థులు మార్పు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్ మెంబర్స్ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దారుణాలను ఎండగడతారనే దాడి..! దళిత నేత శ్రీశైలంపై స్వేరోస్ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ అండదండలతో స్వేరోలు రెచ్చిపోతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. తమ బాగోతాన్ని బయటపెడతాడనే స్వేరోలు శ్రీశైలంపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంపై దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని కిరణ్ డిమాండ్ చేశారు. స్వేరోస్ (స్టేట్ వెల్ఫేర్ ఎయిరో) అంటే జాతి సంక్షేమం కోసం ఆకాశం (అనంతం) హద్దుగా పనిచేసేవారు అని అర్థం. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2012 అక్టోబర్ 19న ఈ సంస్థను స్థాపించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ -
‘కొత్త’గా గురుకుల బోధన!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికావస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు) ఏర్పాటు చేసింది. గతేడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ బోర్డు ఇప్పటివరకు 3,679 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆర్నెల్లలో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో గతేడాది జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ వేగం పెంచడంతో నియామకాల అంశం కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ పూర్తి కానున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యా ఏడాదికల్లా అన్ని కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో కొత్త విద్యా ఏడాదిలో కొత్త గురువులు పాఠాలను బోధించనున్నారు. పీజీటీ నియామకాలు పూర్తి... నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీలో ఇప్పటికే పీజీటీకి సంబంధించిన నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితాను సంబంధిత సొసైటీలకు బోర్డు పంపించింది. తుది జాబితా ఆధారంగా సొసైటీలు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి నియామక పత్రాలను అందిస్తోంది. టీజీటీ కేటగిరీకి సంబంధించి 1:2 జాబితాను పరిశీలిస్తోంది. టెట్ మార్కుల పరిశీలన కోసం టెట్ డైరెక్టర్‌కు నివేదిక పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలు వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియ కొలిక్కి రానుంది. మొత్తంగా నెలాఖరులోగా పూర్తి కానుంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌కు సంబంధించి కూడా 1:2 జాబితా రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరితంగా ఈ జాబితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో నియామకాలు జరిగేలా... గురుకుల బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకే అభ్యర్థికి రెండేసి పోస్టులు వస్తే... అతని ప్రాధాన్యత ఆధారంగా అవసరం లేని పోస్టుకు అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుకుల బోర్డు తొలుత పెద్ద పోస్టులను భర్తీ చేస్తోంది. పీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అంగీకార పత్రాలను ఇస్తున్నారు. దాదాపు 125 మంది అంగీకార పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గురుకుల బోర్డు వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అభ్యంతరాలను వెబ్సైట్లో పొందుపరిచి తక్షణమే రంగంలోకి దిగుతున్న అధికారులు వీలైనంత తక్కువ సమయంలో అభ్యర్థులకు నివృత్తి చేస్తున్నారు. నెలాఖరులోగా టీజీటీ, వెనువెంటనే జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీ పూర్తి చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
8434 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ స్కూళ్లలో 8434 ఉపాధ్యాయ ఖాళీలలను త్వరలో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం శాసన మండలిలో ప్రకటించారు. మండలిలో రెసిడెన్షియల్ పాఠశాలలపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన గురుకుల పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.2835 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోసం ఏటా రూ.లక్ష ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది వేతనాలను పెంచే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. నూతన రాష్ట్రంలో విద్యాలయాలు.. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కొత్తగా 577 గురుకులాలను ఏర్పాటు చేశామని కడియం తెలిపారు. మొత్తం 877 గురుకులాల్లో 2 లక్షల 70 వేల విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని కడియం తెలిపారు.33 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామనీ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. -
తెలుగుపద్యం చెప్పలేదని.. దారుణం!
సాక్షి, కాకినాడ: తెలుగు పద్యం చెప్పలేదని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఈ అనాగరిక ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం భీమవరం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. తెలుగు పద్యాన్ని అప్పజెప్పనందుకు ఓ ఉపాధ్యాయుడు 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏటీడబ్ల్యూవోను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. -
సంక్షోభంలో ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంక్షేమ చదువులు సంక్షోభంలో పడ్డాయి. విద్యార్థులు కనీస వసతులకు నోచుకోక తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. పలుచోట్ల వ్యాధుల బారిన పడి విద్యార్థులు మరణించినా స్పందించే వారే కరువయ్యారు. పలు చోట్ల తరగతి గదులు సరిపోక అక్కడే చదువు.. అక్కడే పడక తప్పడం లేదు. రద్దయిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో అదనంగా చేర్చిన ప్రభుత్వం.. వారి ఆలనా పాలనా గాలికొదిలేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు తప్పదని అధికారులు సెలవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. సర్దుబాటు పేరుతో ఎన్నాళ్లిలా అవస్థలు పడాలని విద్యార్థులు వాపోతున్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల రద్దు తగదని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా విద్యార్థులను ఇక్కట్లపాలు చేస్తోంది. మరో వైపు బీసీ ఉపప్రణాళికను రూ.పదివేల కోట్లతో అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్న దాఖలాల్లేవు. 37 శాఖల నుంచి బీసీలకు రావాల్సిన వాటా నిధులను బీసీలు నివశించే ప్రాంతాల్లో ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఉప ప్రణాళిక ద్వారా ఒక్క పనీ చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభాలో సగభాగం ఉన్న తమ పట్ల ఇంతగా నిర్లక్ష్యం చేయడం తగదని బీసీ వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో దయనీయ పరిస్థితి ?రాష్ట్రంలోని గిరిజన వసతి గృహాలను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టి ఏడాదైనా మౌలిక వసతుల కల్పన ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విద్యార్థులు కూర్చోడానికి బల్లల్లేవు. గురుకుల మెనూ అమలు ఊసే లేదు. గ్రంథాలయం కాగితాలకే పరిమితమైంది. ఆటస్థలం అంతంత మాత్రమే. కొన్ని చోట్ల వసతి గదులే తరగతి గదులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియను గతేడాది సెప్టెంబరు 1న ప్రారంభించింది. కిందటేడాది వరకు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించగా.. ఈ ఏడాది పాఠశాల స్థాయి 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున 10వ తరగతి వరకు పెంచుతారు. ఇక వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగుతుల వారికి అక్కడే వసతి కల్పించి.. ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కానీ సౌకర్యాల కల్పనలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి వసతి గృహాల్ని 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకన్నా ఎక్కువ మంది చేరిన చోట మాత్రం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. సర్దుబాటు చేసుకోమని అధికారులు చెబుతుండగా, ఇలా ఎన్నాళ్లు అవస్థలు పడాలని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలో 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేట బాలుర పాఠశాలలోని 140 మంది విద్యార్థులు 4 గదుల్లో ఉంటున్నారు. ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉంది. దీంతో పగలు తరగతులు నిర్వహిస్తూ.. రాత్రిళ్లు అక్కడే వసతి కల్పిస్తున్నారు. ?గుంటూరు జిల్లాలోని రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ వసతి గృహాలు కూడా. కాగా, ఈ రెండు జిల్లాల్లోని 22 పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీల్లేవు. తరగతులు జరిగే సమయంలో నేలపైనే కూర్చుంటున్నారు. ?ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రధానోపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ అనే హోదాతో నియమించారు. దీనివల్ల అదనపు సౌకర్యాలు కల్పించాల్సి వస్తోంది. దీంతో కొన్నిచోట్ల ప్రిన్సిపాల్, వసతి గృహాల వార్డెన్ల మధ్య సమన్వయం కొరవడి ఆధిపత్య పోరు నడుస్తోంది. బడ్జెట్లో కోత.. విద్యార్థులకు వాత ఎస్టీ గురుకుల పాఠశాలల్లోని 3 నుంచి 6 తరగతుల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారాలతోపాటు, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్ని రూ.750తో పెట్టాలని ఆదేశించింది. ఈ బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. ఇతర గురుకులాల్లో మధ్యాహ్న భోజనానికి కాకుండానే ఇంతే మొత్తం ఇస్తుండటం గమనార్హం. ఈ విషయం రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు దృష్టికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నిటికీ నిధుల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు. తరగతి గదిలోనే హాస్టల్ తరగతులు నిర్వహిస్తున్న గదినే రాత్రిళ్లు హాస్టల్‌గా ఉపయోగించుకోవాల్సి వస్తోంది. సామాన్లు పెట్టుకొనే ట్రంక్ పెట్టెలు, ఇతర వస్తువులను ఓ వైపు పెట్లుకుంటున్నాము. దీంతో ఇరుకుగా ఉండటంతో చదువుపై ఆసక్తి కలగటం లేదు. గదుల్లో బెంచీలు లేకపోవడం వల్ల కింద కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. – బట్రాజు శైలజ, 6వ తరగతి, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కొండపల్లి, కృష్ణా జిల్లా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం తరగతి గది ఇరుకుగా ఉంది. పక్కనే పెట్టెలు పెట్టుకుంటున్నాము. స్నానం చేసినప్పుడు తడిసిన టవల్స్, బట్టలు పెట్టెలపైనే ఆరేసుకుంటున్నాము. అక్కడే టీచర్లు చదువు చెబుతున్నారు. ఈ గదిలోనే కొన్ని బెంచీలు కూడా ఉన్నందున వరండాలో పండుకుంటున్నాము. పెట్టెల్లో వస్తువులు పోతున్నాయి. వాచ్‌మెన్‌కు విషయం చెబితే మీరేకదా ఉండేది అంటున్నారు. స్థలం సరిపోక కొందరు బెంచీపైనే నిద్రపోతున్నారు. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాము. – భుక్యా శ్రీలక్ష్మీ, 5వ తరగతి, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కొండపల్లి ‘ఆదివాసీ ఆరోగ్యం’పై అశ్రద్ధ విష జ్వరాలతో ఒకవైపు గిరిజనులు అల్లాడుతుంటే.. గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఇంజనీరింగ్ పనులపై సమీక్షల పేరుతో కాలం గడిపేస్తోంది. ఆదివాసీల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ కనబరచటం లేదు. ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించిన ‘ఆదివాసీ ఆరోగ్యం’ కార్యక్రమం అమలుకాక పోయినా పట్టించుకునే నాథుడు లేడు. ఈ కార్యక్రమాన్ని 549 గిరిజన విద్యా సంస్థల్లో అమలు చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించినా, ఒక్క విద్యా సంస్థలో కూడా అమలు కావడం లేదు. విద్యాలయాల్లో హెల్త్ వాలంటీర్లను నియమించి ప్రతి రోజూ పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించి నివేదికలు తయారు చేయాల్సి ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు న్యూట్రిషన్ బిస్కెట్లు, మాల్ట్ అందేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడా ఇవి అమలు కావడం లేదు. ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ స్పందిస్తూ.. ఈ విషయంలో తమకన్నా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతే ఎక్కువగా ఉంటుందన్నారు. తామ బాధ్యత పర్యవేక్షణ మాత్రమేనని చెప్పారు. వాస్తవానికి ఐటీడీఏ అధికారులు కొందరు వైద్యులను నియమించుకుని వైద్య సాయం అందించాలి. అదీ అమలు కావడం లేదు. డబ్బులు వస్తాయనుకునే ఇంజనీరింగ్ పనులపైనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దృష్టి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు ఇటీవల నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కేవలం ఇంజనీరిగ్ పనులపైన మాత్రమే సమీక్షించి, విద్యార్థుల అనారోగ్యం విషయాన్ని పట్టించుకోక పోవడం గమనార్హం. ఐటీడీఏల వారీగా మలేరియా, డయేరియా కేసుల వివరాలు ఐటీడీఏ పేరు మలేరియా కేసులు డయేరియా కేసులు సీతంపేట 388 5,379 పార్వతీపురం 1,413 4,949 పాడేరు 3,287 2,251 రంపచోడవరం 2,628 914 చింతూరు 385 343 కేఆర్ పురం 407 697 శ్రీశైలం 407 697 విద్యార్థుల ఆరోగ్యం దైవా‘దీనం’ రాష్ట్రంలో 188 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల్లో 83,131 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రిన్సిపాళ్లు శ్రద్ధ పెట్టడం లేదు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అడిగేవరకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో పిల్లల బాగోగులు చూసే బాధ్యతను కొందరు టీచర్లకు అప్పగించే వారు. ఇపుడా పరిస్థితి లేదు. సుమారు 600 మంది విద్యార్థులకు ఒక్క స్టాఫ్ నర్స్ ప్రాథమిక చికిత్స చేయాల్సి వస్తోంది. విద్యార్థి క్లాసుకు రాకుండా రూములో అనార్యోగంతో పడుకున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థులను వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి సకాలంలో రక్త పరీక్షలు కూడా చేయించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని గురుకులాల్లో అనారోగ్యం బారినపడి ఇటీవల నలుగురు విద్యార్థులు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా కోనం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నూకరత్నం, విజయనగరం జిల్లా పార్వతీపురం గురుకులానికి చెందిన 5వ తరగతి విద్యార్థి పట్లసింగ్ గణేష్, నెలిమర్ల గురుకులానికి చెందిన 6వ తరగతి విద్యార్థిని ఎ.నీలిమ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పవలసలోని విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న లక్కోజి గుణశేఖర్ మృతుల్లో ఉన్నారు. ఆయా గురుకులాల్లో పలువురు విద్యార్థులు ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకున్న వారే లేరు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దుప్పవలస గురుకుల స్కూలులో 540 మంది విద్యార్థులకు సరిపడా మాత్రమే వసతి సౌకర్యాలు ఉండగా, ఏకంగా 930 మంది విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు మెడికల్ ఇన్సూ్యరెన్స్ చేయించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
400 గురుకులాలకు ‘చిరుతిండ్లు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 400 గురుకుల పాఠశాలలకు ప్రతి నెలా చిరుధాన్యాలతో తయారు చేసిన చిరుతిండ్లను అందజేయాలని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈమేరకు వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వర్సిటీలోని గృహ విజ్ఞాన కళాశాలలోని ఫుడ్స్, న్యూట్రిషన్ విభాగం ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు, సేమియాను విద్యా ర్థులకు అందిస్తామన్నారు. కొన్ని గ్రామా లను దత్తత తీసుకొని చిరుధాన్యాల సాగు పెంపును ప్రోత్సహించాలనే ఆలోచన ఉందన్నారు. గురుకుల పాఠశాలలకు చిరుతిండ్లను సరఫరా చేయడానికి మిల్లెట్బౌల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. -
మెరిట్ విద్యార్థుల చదువు బాధ్యత మాదే
విద్యార్థులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి : ప్రతిభగల విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం సచివాలయంలో గురుకుల పాఠశాలలు, ఇతర పాఠశాలల్లో చదివి ఇంటర్మీడియట్, ఎంసెట్, జేఈఈలో టాప్ ర్యాంకులు పొందిన 158 విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 158 మంది విద్యార్థుల ఉన్నత చదువులను ప్రభుత్వమే చూస్తుందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చినా, కొద్దిపాటి సదుపాయాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధించారని విద్యార్థులను అభినందించారు. కొన్ని విద్యా సంస్థలు ప్రమాణాలు పాటించడంలేదని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 240 జూనియర్ కళాశాలలను రద్దు చేశామని, మరో 804 కళాశాలలకు నోటీసులిచ్చామన్నారు. ఎంపీసీలో మొదటి ర్యాంకు సాధించిన షేక్ షర్మిల మాట్లాడుతూ తనకు బిట్స్ పిలానీలో చదువుకోవాలని ఉందని, తమది పేద కుటుంబమని సాయం చేయాలని కోరింది. దీంతో ఆమె చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. మీ ఒత్తిళ్లు చూపకండి: సీఎం ఎంతో టెన్షన్‌తో వచ్చే రోగికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వైద్యులు, నర్సులు.. ఇంటా బయట ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను వారిపై చూపడం ద్వారా మరింత అనారోగ్యానికి గురిచేయడం తగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని వైద్యులందరికీ సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రవర్తనలో సమూల మార్పులు తీసుకువస్తానన్నారు. ‘స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.