మెరిట్ విద్యార్థుల చదువు బాధ్యత మాదే
విద్యార్థులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రతిభగల విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం సచివాలయంలో గురుకుల పాఠశాలలు, ఇతర పాఠశాలల్లో చదివి ఇంటర్మీడియట్, ఎంసెట్, జేఈఈలో టాప్ ర్యాంకులు పొందిన 158 విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 158 మంది విద్యార్థుల ఉన్నత చదువులను ప్రభుత్వమే చూస్తుందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చినా, కొద్దిపాటి సదుపాయాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధించారని విద్యార్థులను అభినందించారు. కొన్ని విద్యా సంస్థలు ప్రమాణాలు పాటించడంలేదని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 240 జూనియర్ కళాశాలలను రద్దు చేశామని, మరో 804 కళాశాలలకు నోటీసులిచ్చామన్నారు. ఎంపీసీలో మొదటి ర్యాంకు సాధించిన షేక్ షర్మిల మాట్లాడుతూ తనకు బిట్స్ పిలానీలో చదువుకోవాలని ఉందని, తమది పేద కుటుంబమని సాయం చేయాలని కోరింది. దీంతో ఆమె చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
మీ ఒత్తిళ్లు చూపకండి: సీఎం
ఎంతో టెన్షన్‌తో వచ్చే రోగికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వైద్యులు, నర్సులు.. ఇంటా బయట ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను వారిపై చూపడం ద్వారా మరింత అనారోగ్యానికి గురిచేయడం తగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని వైద్యులందరికీ సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రవర్తనలో సమూల మార్పులు తీసుకువస్తానన్నారు. ‘స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.