గుడ్లవల్లేరు ఘటనలో కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఆధారాలు ఇవ్వాలంటూ డొంకతిరుగుడు మాటలు
నిజాయతీగా దర్యాప్తు చేస్తే ఆధారాలు కోకొల్లలు
దర్యాప్తు సజావుగా సాగకుండా ప్రభుత్వ ప్రయత్నం
ఆధారాలు లేవని బుకాయిస్తున్న చంద్రబాబు, లోకేశ్
దర్యాప్తు జరుగుతోందంటూనే.. రాజకీయ రంగు పులుముతున్న సీఎం చంద్రబాబు
ప్రభుత్వ పెద్దలే అలా చెబితే పోలీసులు చేతులెత్తేయక ఏం చేస్తారంటున్న తల్లిదండ్రులు
ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో టీడీపీ రౌడీల పహారా
విద్యార్థి సంఘాల నోళ్లు నొక్కేందుకు గూండాగిరి
బలవంతంగా విద్యార్థినుల్ని ఇళ్లకు తరలించిన యాజమాన్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో వెలుగు చూసిన హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కా స్కెచ్‌తో పక్కదారి పట్టిస్తోంది. ఏదోరకంగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు అక్కడ ఏమీ జరగలేదంటూ మసిపూస్తోంది. బాధితులెవరూ నోరు విప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కళాశాలకు ఉన్నట్టుండి సెలవులు ప్రకటించడమే కాకుండా.. ఎవరూ, ఎక్కడా నోరెత్తకూడదని విద్యార్థినులకు హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా మాట్లాడితే మున్ముందు చర్యలు తప్పవని యాజమాన్యం ద్వారా హెచ్చరికలు జారీ చేయించింది.
యాజమాన్యం ముసుగులో టీడీపీ నేతల దౌర్జన్యం
ఈ వ్యవవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు సైతం ఈ ఘటనపై స్పందించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరకుండా చూసే బాధ్యతను టీడీపీ నేతలకు బాధ్యత అప్పగించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆందోళనకారులు, మీడియా ప్రతినిధులను తరిమికొట్టారు. కళాశాల లోపలికి ఎవరూ వెళ్లకుండా గేట్లు మూసివేశారు. వారికి తోడుగా పోలీసులు సైతం వంత పాడుతున్నారు. నిజంగా అక్కడేమీ జరగకపోతే ఇంత హంగామా ఎందుకని ప్రజా, విద్యా, మహిళ సంఘాలు నిలదీస్తున్నాయి.
ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి ఈ కేసును తానే పర్యవేక్షిస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందంటున్న సీఎం చంద్రబాబు.. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ సైతం అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బుకాయిస్తుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ప్రభుత్వ పెద్దలే అలా చెబితే.. పోలీసులు చేతులేత్తేయక ఏం చేయగలరని నిలదీస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే స్వేచ్ఛగా దర్యాప్తు చేయడానికి పోలీసులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఆధారాలు వాటంతట అవే వస్తాయని విద్యార్థులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన అంశాలను ఎందుకు దాస్తున్నారని, ఎవరి కోసం ఇలా చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఏమీ లేకపోతే షవర్, సీసీ కెమెరాలు ఎందుకు తీసుకుపోయారని ప్రశ్నిస్తున్నారు.
నాలుగు రోజులు గడుస్తున్నా..
విద్యార్థినుల ఆందోళనను అణగతొక్కేందుకు ఇప్పటివరకు పోలీసుల సహకారంతో శతవిధాలా ప్రయత్నించిన యాజమాన్యం విద్యార్థులు బెదరకపోవడంతో టీడీపీ నేతల సాయంతో ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించింది. బలవంతంగా విద్యార్థినులను బస్సుల్లో వారి ఇళ్లకు పంపేస్తున్నారు. విద్యార్థినుల తరలింపును అడ్డుకున్న వారిపై దాడులు చేయిస్తున్నారు. కాలేజీ ప్రధాన గేటు వద్ద పోలీసులతో పాటు టీడీపీ రౌడీలు రాత్రి, పగలు పహారా కాస్తున్నారు. పిల్లల విషయంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటున్నారు.
టీడీపీ చోటామోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు కాలేజీలోకి స్వేచ్ఛగా అనమతిస్తూ.. విద్యార్థుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఇతర రాజకీయ పార్టీల నాయకులను లోనికి వెళ్లనివ్వడం లేదు. విద్యార్థినులు ఆందోళన చేస్తునప్పుడు ఒక టీడీపీ నాయకుడు హాస్టల్‌లోకే వెళ్లి విద్యార్థినులు మాట వినకపోతే కళాశాల నుంచి సర్టిఫికెట్లు రానివ్వకుండా చేస్తామని బెదిరించాడంటే నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు ఎటువంటి కుయుక్తులు పన్నుతున్నారో అర్థమవుతోంది.
నేరం ఒప్పుకున్నా.. వీళ్లెందుకు సమ్మతించడం లేదు?
‘కళాశాలలో హిడెన్ కెమెరాలతో బూత్‌రూమ్‌ల్లో 300కు పైగా వీడియోలు ఉన్నాయి. నేనే తీశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు దుర్భాషలాడుతూ అన్న మాటలు విద్యార్థినులంతా విన్నారు. కానీ.. కళాశాల యాజమాన్యం తప్పు జరగలేదని బుకాయించేందుకు ఎంతకైనా తెగిస్తోంది. పచ్చమూకల సాయంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టింది. కెమెరాలు పెట్టిన విద్యార్థిని స్వయంగా నేరం ఒప్పుకున్నా యాజమాన్యం, ప్రభుత్వం అందుకు సమ్మతించడం లేదు.
ఒక్క వీడియో అయినా బయట పడిందా అంటూ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విలేకరుల సమావేశంలో ‘మూడు వేల వీడియోలు ఉన్నాయంటున్నారు. ఆ వీడియోలు ఏవి? బయట పెట్టలేదేంటి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థినులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే ఎదురు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎవరూ లేకుండా విచారణ
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ కళాశాలలోనే విడివిడిగా మూడు రోజులుగా విచారిస్తున్నా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా పోలీసులు బయటపెట్టలేదు. కళాశాల యాజమాన్యంతో కలిసి విచారణ చేస్తే నిజాలు ఎలా బయట పడతాయని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. కళాశాల టీడీపీ నాయకుల బంధువులది కావడం.. విద్యార్థినుల మాన, ప్రాణాల కన్నా కాలేజీ పరువు ప్రతిష్టలకే యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వడం.. అందుకు అధికార టీడీపీ సహకరించడమే ఇప్పటివరకు నిజాలు నిగ్గు తేలకపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. ఇలా విచారణ చేస్తే కాలయాపన తప్ప తమకు న్యాయం జరిగేది ఏమి లేదనేది విద్యార్థులు పేర్కొంటున్నారు.
యథా చంద్రబాబు.. తథా అధికారులు
యథా చంద్రబాబు.. తథా అధికారులు అన్న తీరుతోనే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు సైతం వ్యవహరిస్తున్నారు. ఒకవైపు హిడెన్ కెమెరాలు ఉన్నాయంటున్న షవర్‌లను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నట్టు చెబుతున్న ఎస్పీ.. ఇదేం పెద్ద కేసు కాదని మభ్యపెట్టే ప్రయత్నం చేయడంపై విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని దర్యాప్తు పేరుతో కొన్ని రోజులు నాన్చి.. అంతా సద్దుమణిగిన తర్వాత అక్కడేమీ జరగలేదని తీరుబడిగా చెప్పి యాజమాన్యానికి మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారని విద్యార్థి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment