సర్కారు బడి భళా..! | Government Schools In Telangana With Full Of Admissions | Sakshi
Sakshi News home page

సర్కారు బడి భళా..!

Published Sun, Jun 23 2019 3:15 AM | Last Updated on Sun, Jun 23 2019 11:23 AM

Government Schools In Telangana With Full Of Admissions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పుంజుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని తాళలేక విద్యార్థులు క్రమంగా సర్కారు బడిబాట పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన బడిబాట తాలూకు ప్రాథమిక గణాంకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. గత సంవ త్సరం ఇదే సమయానికి 1.86 లక్షల మంది విద్యార్థులే అడ్మిషన్లు తీసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ప్రతి పాఠశాల సమాచార నివేదికలో నిర్ణీత తేదీ నాటికి కొత్త అడ్మిషన్లు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెలాఖరు నాటి వివరాల ఆధారంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల గణాంకాలపై స్పష్టత వస్తుంది. 

గురుకులాల తర్వాత ప్రభుత్వ బడులే... 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొంది. వాటి ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలపై కొంత ప్రభావం పడింది. కానీ గురుకులాల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు చూస్తున్నారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలున్నాయి. వాటిలో 10 వేల స్కూళ్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తుండగా మిగతా 30 వేల స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గతేడాది గణాంకాల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో 52 శాతం విద్యార్థులున్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేవలం 42 శాతమే ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు నమోదు కావడమే అతిపెద్ద ఉదాహరణ. ఈ నమోదు సంఖ్య ప్రైవేటు పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్యకు సమానం కావడం గమనార్హం. ఈ ఏడాది బడిబాటలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 20,117 మంది విద్యార్థులు నమోదయ్యారు. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 3,836 మంది విద్యార్థులు నమోదయ్యారు. 

30 శాతం స్కూళ్లలో 100 శాతం ఫలితాలు 
రాష్ట్రంలో 4,637 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 1,580 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇవి కాకుండా 185 కేజీబీవీలు, 97 ఆదర్శ పాఠశాలలు, 33 ఎయిడెడ్‌ పాఠశాలలు, 47 ఆశ్రమ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు కూడా నూరు శాతం ఫలితాలు సాధించాయి. అదే ప్రైవేటు కేటగిరీలో 5,177 స్కూళ్లకుగాను 2,279 స్కూళ్లలో మాత్రమే వంద శాతం ఫలితాలొచ్చాయి. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ భారీగా పెరిగింది. హైస్కూల్‌ విద్యార్థికి ట్యూషన్‌ ఫీజు రూపంలో ఏటా రూ. లక్ష చెల్లించాల్సి వస్తోంది.

అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు ప్రభుత్వ బడిబాట పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పన సమస్యకు పరిష్కారం చూపితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement