సన్నగిల్లిన నమ్మకంతో చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన బడులన్నీ ఇప్పుడు సకల సౌకర్యాలను.. శాశ్వత నిర్మాణాలను సమకూర్చుకుంటున్నాయి. అంతేగాక ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అందుబాటులోకి వచ్చింది.
ఫీజులు భారమైనా.. బడులు దూరమైనా.. వేలకు వేలు కట్టి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తహతహలాడుతున్నారు. ఫలితంగా సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లను భారీగా డిమాండ్ పెరిగింది. ఏ పాఠశాలలో చూసినా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/నెల్లూరు (టౌన్ ః విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభించారు. అయితే, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలోని ఏ పాఠశాలకు వెళ్లినా అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొంది.
14 డివిజన్ పరిధిలోని గోవిందరాజుల ధర్మ ఈనాం ట్రస్ట్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలోనూ అడ్మిషన్లు దొరకడం లేదు. రెండు రోజుల నుంచి 6వ తరగతి పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా వస్తున్నారు. ఇక్కడ 1వ నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 6 నుంచి 10 వతరగతి వరకు సుమారు 1,285 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇక్కడే 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి అడ్మిషన్ ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఇక్కడ 6వ తరగతి చేరడానికి వచ్చే వారిని చేర్చుకోవడం లేదు. ఇప్పటికే ఇక్కడ 6వ తరగతిలో 100కు పైగా అడ్మిషన్లు వచ్చాయి. మరింత మంది విద్యార్థులను చేర్చేకుంటే తరగతి గదులు సరిపోవనే ఉద్దేశంతో పిల్లలను చేర్పించుకోవడానికి ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు.
నెల్లూరులో ఇదీ పరిస్థితి
నెల్లూరు భక్తవత్సల నగర్‌లోని కేఎన్నార్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. దీంతో అడ్మిషన్లు ఇవ్వలేమంటూ ఉపాధ్యాయులు చేతులెత్తేశారు. పాఠశాల గేటుకు ‘నో వెకెన్సీ’ బోర్డు తగిలించారు. సీఎం వైఎస్ జగన్ తొలి విడత నాడు–నేడులో భాగంగా రూ.64 లక్షలతో ఈ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు.
రెండోవిడత నాడు–నేడులో రూ.2.22 కోట్లతో 20 అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ఇవి పూర్తయితే మరో రెండు వేల మందికి పైగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని హెచ్‌ఎం విజయప్రకాష్ చెప్పారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1,786 మంది విద్యార్థులున్నారు. నెల్లూరు నగరంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
అడ్మిషన్ దొరకడం లేదు
గోవిందరాజు పాఠశాలలో అడ్మిషన్ దొరకడం లేదు. వారం తర్వాత చెబుతామంటున్నారు. మా పాప హాసిని సాయి ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదివింది.సీఎం వైఎస్ జగన్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదించాలని నిర్ణయం తీసుకున్నాం. సీటు దొరుకుతుందో లేదో అర్ధం కావడం లేదు. – మాధవరావు, విద్యార్థి తండ్రి, యనమలకుదురు, విజయవాడ
చాలామంది వస్తున్నారు..
ఈ పాఠశాలలో 1,285 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అదనంగా మరో 100 అడ్మిషన్లు వచ్చాయి. పక్కనే ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో 700 మంది ఉన్నారు. ఇక్కడ గత ఏడాది 5వ తరగతి చదివిన వారు సుమారు 80 మందికి పైగా ఉన్నారు. వీరందరికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలని వస్తున్నారు. – ఎం.శ్రీనివాసరావు, హెచ్‌ఎం, విజయవాడ
ప్రైవేట్ స్కూల్ వదిలి ఇక్కడ చేరా
ఇక్కడ పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. అందుకే.. ప్రైవేట్ స్కూల్ వదిలేసి ఇక్కడ చేరా. ఏదన్నా అర్థం కాని విషయం ఉంటే సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్‌లో ఆ సబ్జక్టు ఉపాధ్యాయుడిని అడిగితే పూర్తిగా వివరిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తా. – సీహెచ్ ఆదిత్యశ్రీ, పదో తరగతి, నవాబుపేట
వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని అడ్మిషన్లు
ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉండటం వల్లే అత్యధిక మార్కులు సాధించగలుగుతున్నాం. ఇక్కడ చదువుకునే వారు ఎక్కువగా పేద విద్యార్థులు. వారికి నాణ్యమైన విద్య అందించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. వచ్చే విద్యా సంవత్సరానికి 20 గదులు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు వీలుంటుంది. – విజయప్రకాష్, హెచ్‌ఎం, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment