అడ్మిషన్స్‌ క్లోజ్డ్‌ | Students And Parents Are passionate Towards Public Schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల గోడలపై కనిపిస్తున్న బోర్డులు

Published Sat, Jun 29 2019 1:33 PM | Last Updated on Sat, Jun 29 2019 1:34 PM

Students And Parents Are passionate Towards Public Schools - Sakshi

 పీవీఆర్‌ బాలికల హైస్కూల్‌ 

సాక్షి, ఒంగోలు టౌన్‌: నూతన ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ రంగ విద్యకు గత వైభం రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలే దీనిని బలపరుస్తున్నాయి.  ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. గత ఏడాది ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం, ఈ ఏడాది ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరగడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. దానికితోడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు పెద్ద పీట వేయడం కూడా పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేయడంతోపాటు పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీ పడుతున్నారు.

కనుమరుగు నుంచి కళకళ
గతంలో ప్రభుత్వ పాఠశాలలు అవసాన దశలో ఉండేవి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగా ఉండేది. దాంతో ఉపాధ్యాయులు కూడా ఉన్న కొద్ది మందికి నామమాత్రంగా పాఠాలు బోధించేవారు. ఏటికేడు విద్యార్థుల సంఖ్య దిగజారిపోతుండటంతో చివరకు అక్కడ పాఠశాలలు కనుమరుగయ్యాయి. పాఠశాలల రేషనలైజేషన్‌ పేరుతో గత ప్రభుత్వం వాటి సంఖ్యను రాష్ట్రవ్యాప్తంగా కుదించేసింది. 2014–2015 విద్యా సంవత్సరంలో 393 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 72 ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా డీ గ్రేడ్‌ అయ్యాయి. 20 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే ఆ పాఠశాలలు కనుమరుగు అయ్యేవి. అలాంటి స్థితి నుంచి నేడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

 విద్యారంగానికే ప్రాధాన్యత
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సమయంలో ఎక్కువగా విద్యాశాఖ గురించే ఉండటం విశేషం. ప్రభుత్వ విద్యకు అగ్రస్థానం ఇస్తున్నారు. దానికితోడు అమ్మ ఒడి పథకం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతోంది. పేదరికంలో ఉన్నప్పటికీ తమ పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా 15వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించి పేదింటి బిడ్డల చదువుకు భరోసా ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగడం, ఇంకోవైపు ప్రభుత్వం నుంచి గట్టి భరోసా రావడంతో తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

నగరంలో పెరుగుతున్న బోర్డుల సంఖ్య
ఒంగోలు నగరంలోని ప్రభుత్వ, మునిసిపల్‌ పాఠశాలల్లో అడ్మిషన్‌ క్లోజ్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో అడ్మిషన్‌ క్లోజ్‌డ్‌ అని బోర్డు పెట్టారు. ఆ పాఠశాల ప్రాంగణంలోని మోడల్‌ స్కూల్‌లో కూడా పరిమితికి మించి విద్యార్థినులు చేరడంతో అడ్మిషన్‌ క్లోజ్‌డ్‌ అని బోర్డు పెట్టారు. తాజాగా స్థానిక కోర్టు సెంటర్‌లోని పీవీఆర్‌ బాలికోన్నత పాఠశాలలో కూడా అడ్మిషన్‌ క్లోజ్‌డ్‌ అనే బోర్డు పెట్టారు. ఆ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 419 మంది విద్యార్థినులు చేరారు. ఈ విద్యా సంవత్సరంలో 480 మంది  చేరాలంటూ నగర పాలక సంస్థ కమిషనర్‌ కంఠమనేని శకుంతల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. దాంతో ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులు కూడా గట్టిగా కృషి చేయడంతో 560 మంది చేరారు. దీంతో అడ్మిషన్‌ క్లోజ్‌డ్‌ అని పాఠశాల గోడలపై నోటీసు రూపంలో అంటించారు. నగరంలోని మునిసిపల్‌ పాఠశాలలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో  అనేక చోట్ల అడ్మిషన్‌ క్లోజ్‌డ్‌ అనే బోర్డులు వెలవనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement