పాఠశాలలో అడ్మిషన్లు లేవని ఏర్పాటు చేసిన బోర్డు
తాడేపల్లిరూరల్: మంగళగిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసే కొందరు అనుసరిస్తున్న వింతపోకడలతో ప్రజలు విస్తుపోతున్నారు. ఎవరైనా అడ్మిషన్ కావాలని ప్రైవేటు స్కూల్ నుంచి కానీ, వేరే ప్రభుత్వ పాఠశాల నుంచి కానీ వస్తే అడ్మిషన్లు లేవంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే టీడీపీ ఇన్‌చార్జి లేదా టీడీపీ నేతల సిఫార్సు కావాలంటూ సెలవిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..మంగళగిరి పట్టణానికి చెందిన పరాల హేమలత తన కుమార్తెను ఆరో తరగతిలో చేర్పించేందుకు అడ్మిషన్ కావాలంటూ పట్టణ పరిధి వీవర్స్‌కాలనీలోని దామర్ల రమాకాంతం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గిరిని కలిశారు. అడ్మిషన్లు లేవని ఆయన చెప్పారు.
నాలుగు రోజులుగా పాఠశాల చుట్టూ తిరుగుతున్నామని, అడ్మిషన్ ఇవ్వాలని ఆమె కోరగా ప్రధానోపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలం వాడడంతో ఆమె మనస్తాపం చెందింది. మొదటిరోజు పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును కలువగా అతను కూడా అలాగే ప్రవర్తించాడని హేమలత ఆవేదన వ్యక్తంచేసింది. మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డిని కలిసి జరిగిన విషయం చెప్పగా ఆయన ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధానోపాధ్యాయుడు గిరిని మళ్లీ కలువగా టీడీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి నుంచి కానీ, స్థానిక టీడీపీ నేతల నుంచి కానీ సిఫార్సు లెటరు తీసుకువస్తే సీటు ఇస్తామంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆమెకు ఏమి చేయాలో అర్థంకాక మిన్నకుండిపోయింది.
చర్యలు తీసుకుంటాం
పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునే విషయం తమ దృష్టికి వచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులను పిలిపించి మాట్లాడతా. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే విధంగా చర్య తీసుకుంటాం.
– బిక్కిరెడ్డి శివారెడ్డి,ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment