సంక్షోభంలో ‘సంక్షేమం’ | Tribal welfare schools that do not have basic needs atleast | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ‘సంక్షేమం’

Published Mon, Oct 30 2017 3:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Tribal welfare schools that do not have basic needs atleast - Sakshi

కృష్ణా జిల్లా కొండపల్లిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఇరుకు గదిలో నేలపైనే కూర్చొని విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు.. వేరే వసతి గదిలేకపోవడంతో రాత్రి ఇక్కడే వీరు నిద్రపోవాల్సి వస్తోంది.

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంక్షేమ చదువులు సంక్షోభంలో పడ్డాయి. విద్యార్థులు కనీస వసతులకు నోచుకోక తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. పలుచోట్ల వ్యాధుల బారిన పడి విద్యార్థులు మరణించినా స్పందించే వారే కరువయ్యారు. పలు చోట్ల తరగతి గదులు సరిపోక అక్కడే చదువు.. అక్కడే పడక తప్పడం లేదు. రద్దయిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో అదనంగా చేర్చిన ప్రభుత్వం.. వారి ఆలనా పాలనా గాలికొదిలేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సర్దుబాటు తప్పదని అధికారులు సెలవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. సర్దుబాటు పేరుతో ఎన్నాళ్లిలా అవస్థలు పడాలని విద్యార్థులు వాపోతున్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల రద్దు తగదని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా విద్యార్థులను ఇక్కట్లపాలు చేస్తోంది. మరో వైపు బీసీ ఉపప్రణాళికను రూ.పదివేల కోట్లతో అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్న దాఖలాల్లేవు. 37 శాఖల నుంచి బీసీలకు రావాల్సిన వాటా నిధులను బీసీలు నివశించే ప్రాంతాల్లో ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఉప ప్రణాళిక ద్వారా ఒక్క పనీ చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభాలో సగభాగం ఉన్న తమ పట్ల ఇంతగా నిర్లక్ష్యం చేయడం తగదని బీసీ వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన సంక్షేమ గురుకులాల్లో దయనీయ పరిస్థితి
?రాష్ట్రంలోని గిరిజన వసతి గృహాలను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టి ఏడాదైనా మౌలిక వసతుల కల్పన ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విద్యార్థులు కూర్చోడానికి బల్లల్లేవు. గురుకుల మెనూ అమలు ఊసే లేదు. గ్రంథాలయం కాగితాలకే పరిమితమైంది. ఆటస్థలం అంతంత మాత్రమే. కొన్ని చోట్ల వసతి గదులే తరగతి గదులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియను గతేడాది సెప్టెంబరు 1న ప్రారంభించింది. కిందటేడాది వరకు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించగా.. ఈ ఏడాది పాఠశాల స్థాయి 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున 10వ తరగతి వరకు పెంచుతారు. ఇక వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగుతుల వారికి అక్కడే వసతి కల్పించి.. ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కానీ సౌకర్యాల కల్పనలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

వాస్తవానికి వసతి గృహాల్ని 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకన్నా ఎక్కువ మంది చేరిన చోట మాత్రం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. సర్దుబాటు చేసుకోమని అధికారులు చెబుతుండగా, ఇలా ఎన్నాళ్లు అవస్థలు పడాలని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలో 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేట బాలుర పాఠశాలలోని 140 మంది విద్యార్థులు 4 గదుల్లో ఉంటున్నారు. ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉంది. దీంతో పగలు తరగతులు నిర్వహిస్తూ.. రాత్రిళ్లు అక్కడే వసతి కల్పిస్తున్నారు. ?గుంటూరు జిల్లాలోని రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలో ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ వసతి గృహాలు కూడా. కాగా, ఈ రెండు జిల్లాల్లోని 22 పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీల్లేవు. తరగతులు జరిగే సమయంలో నేలపైనే కూర్చుంటున్నారు. ?ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రధానోపాధ్యాయుడిని ప్రిన్సిపాల్‌ అనే హోదాతో నియమించారు. దీనివల్ల అదనపు సౌకర్యాలు కల్పించాల్సి వస్తోంది. దీంతో కొన్నిచోట్ల ప్రిన్సిపాల్, వసతి గృహాల వార్డెన్ల మధ్య సమన్వయం కొరవడి ఆధిపత్య పోరు నడుస్తోంది.  

బడ్జెట్‌లో కోత.. విద్యార్థులకు వాత
ఎస్టీ గురుకుల పాఠశాలల్లోని 3 నుంచి 6 తరగతుల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారాలతోపాటు, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్ని రూ.750తో పెట్టాలని ఆదేశించింది. ఈ బడ్జెట్‌ ఏమాత్రం సరిపోవడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. ఇతర గురుకులాల్లో మధ్యాహ్న భోజనానికి కాకుండానే ఇంతే మొత్తం ఇస్తుండటం గమనార్హం. ఈ విషయం రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు దృష్టికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నిటికీ నిధుల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు.     
  
తరగతి గదిలోనే హాస్టల్‌
తరగతులు నిర్వహిస్తున్న గదినే రాత్రిళ్లు హాస్టల్‌గా ఉపయోగించుకోవాల్సి వస్తోంది. సామాన్లు పెట్టుకొనే ట్రంక్‌ పెట్టెలు, ఇతర వస్తువులను ఓ వైపు పెట్లుకుంటున్నాము. దీంతో ఇరుకుగా ఉండటంతో చదువుపై ఆసక్తి కలగటం లేదు. గదుల్లో బెంచీలు లేకపోవడం వల్ల కింద కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది.
– బట్రాజు శైలజ, 6వ తరగతి, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కొండపల్లి, కృష్ణా జిల్లా

చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం
తరగతి గది ఇరుకుగా ఉంది. పక్కనే పెట్టెలు పెట్టుకుంటున్నాము. స్నానం చేసినప్పుడు తడిసిన టవల్స్, బట్టలు పెట్టెలపైనే ఆరేసుకుంటున్నాము. అక్కడే టీచర్లు చదువు చెబుతున్నారు. ఈ గదిలోనే కొన్ని బెంచీలు కూడా ఉన్నందున వరండాలో పండుకుంటున్నాము. పెట్టెల్లో వస్తువులు పోతున్నాయి. వాచ్‌మెన్‌కు విషయం చెబితే మీరేకదా ఉండేది అంటున్నారు. స్థలం సరిపోక కొందరు బెంచీపైనే నిద్రపోతున్నారు. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాము.
– భుక్యా శ్రీలక్ష్మీ, 5వ తరగతి, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కొండపల్లి
 
 ‘ఆదివాసీ ఆరోగ్యం’పై అశ్రద్ధ
విష జ్వరాలతో ఒకవైపు గిరిజనులు అల్లాడుతుంటే.. గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఇంజనీరింగ్‌ పనులపై సమీక్షల పేరుతో కాలం గడిపేస్తోంది. ఆదివాసీల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ కనబరచటం లేదు. ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించిన ‘ఆదివాసీ ఆరోగ్యం’ కార్యక్రమం అమలుకాక పోయినా పట్టించుకునే నాథుడు లేడు. ఈ కార్యక్రమాన్ని 549 గిరిజన విద్యా సంస్థల్లో అమలు చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించినా, ఒక్క విద్యా సంస్థలో కూడా అమలు కావడం లేదు. విద్యాలయాల్లో హెల్త్‌ వాలంటీర్లను నియమించి ప్రతి రోజూ పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించి నివేదికలు తయారు చేయాల్సి ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు న్యూట్రిషన్‌ బిస్కెట్లు, మాల్ట్‌ అందేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడా ఇవి అమలు కావడం లేదు.

ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో తమకన్నా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతే ఎక్కువగా ఉంటుందన్నారు. తామ బాధ్యత పర్యవేక్షణ మాత్రమేనని చెప్పారు. వాస్తవానికి ఐటీడీఏ అధికారులు కొందరు వైద్యులను నియమించుకుని వైద్య సాయం అందించాలి. అదీ అమలు కావడం లేదు. డబ్బులు వస్తాయనుకునే ఇంజనీరింగ్‌ పనులపైనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దృష్టి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ గందం చంద్రుడు ఇటీవల నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కేవలం ఇంజనీరిగ్‌ పనులపైన మాత్రమే సమీక్షించి, విద్యార్థుల అనారోగ్యం విషయాన్ని పట్టించుకోక పోవడం గమనార్హం. 

ఐటీడీఏల వారీగా మలేరియా, డయేరియా కేసుల వివరాలు 
ఐటీడీఏ పేరు    మలేరియా కేసులు    డయేరియా కేసులు
సీతంపేట         388                               5,379
పార్వతీపురం     1,413                           4,949
పాడేరు             3,287                           2,251
రంపచోడవరం    2,628                             914
చింతూరు            385                             343
కేఆర్‌ పురం          407                             697
శ్రీశైలం                407                              697

విద్యార్థుల ఆరోగ్యం దైవా‘దీనం’
రాష్ట్రంలో 188 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల్లో 83,131 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రిన్సిపాళ్లు శ్రద్ధ పెట్టడం లేదు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అడిగేవరకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదనే విమర్శలు  ఉన్నాయి. గతంలో పిల్లల బాగోగులు చూసే బాధ్యతను కొందరు టీచర్లకు అప్పగించే వారు. ఇపుడా పరిస్థితి లేదు. సుమారు 600 మంది విద్యార్థులకు ఒక్క స్టాఫ్‌ నర్స్‌ ప్రాథమిక చికిత్స చేయాల్సి వస్తోంది. విద్యార్థి క్లాసుకు రాకుండా రూములో అనార్యోగంతో పడుకున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థులను వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి సకాలంలో రక్త పరీక్షలు కూడా చేయించలేక పోతున్నారు.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని గురుకులాల్లో అనారోగ్యం బారినపడి ఇటీవల నలుగురు విద్యార్థులు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా కోనం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న నూకరత్నం, విజయనగరం జిల్లా పార్వతీపురం గురుకులానికి చెందిన 5వ తరగతి విద్యార్థి పట్లసింగ్‌ గణేష్, నెలిమర్ల గురుకులానికి చెందిన 6వ తరగతి విద్యార్థిని ఎ.నీలిమ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పవలసలోని విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న లక్కోజి గుణశేఖర్‌ మృతుల్లో ఉన్నారు. ఆయా గురుకులాల్లో పలువురు విద్యార్థులు ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకున్న వారే లేరు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దుప్పవలస గురుకుల స్కూలులో 540 మంది విద్యార్థులకు సరిపడా మాత్రమే వసతి సౌకర్యాలు ఉండగా, ఏకంగా 930 మంది విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు మెడికల్‌ ఇన్సూ్యరెన్స్‌ చేయించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement