కేసముద్రం: పిల్లలకు పాఠాలు బోధించడానికి తరగతి గదుల కోసం ఓ ఉపాధ్యాయుడు ఊరంతా వెతికాడు. ఎక్కడా గదులు లభించకపోవడంతో చెట్టు కిందే వారికి పాఠాలు చెప్పాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం శివారు బ్రహ్మంగారి తండాలో బుధవారం చోటుచేసుకుంది. 2015లో అధికారులు, తండాపెద్దల చొరవతో తండాలో ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయగా, ఓ ఇంటి యజమాని స్వచ్ఛందంగా 2 గదులు కేటాయించాడు.
అప్పటి నుంచి ఆ పాఠశాలను సింగిల్ టీచర్ వెంకటేశ్వర్లు కొనసాగిస్తున్నారు. మొదట్లో 46 మంది ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 72కు చేరింది. గతంలో ఇంటిని ఇచ్చిన యజమాని తమ కుటుంబ అవసరాల నిమిత్తం గదులు ఇవ్వలేనని చేతులెత్తేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ‘పాఠశాల నిర్వహణకు మీ ఇళ్లు ఇస్తారా’ అంటూ ఊరంతా తిరిగాడు. చివరకు తండాలోని అంగన్‌వాడీ టీచర్ ముందుకొచ్చినా, సరిపడా స్థలం లేక.. ఓ చెట్టు నీడన పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు బోధించాడు.
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ మాత్రం తనకూతురు తాబిస్ రైనాను మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్‌కు ఒక బాబు, పాప ఉన్నారు. పాప తాబిష్ రైనా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగో తరగతి పూర్తి చేసింది. దీంతో ఐదో తరగతి కోసం ఆమె తన కూతురును వికారాబాద్‌లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల–1 లో డే స్కాలర్‌గా చేర్పించారు. బుధవారం ఉదయం తన కూతురు తాబిష్ రైనాను పాఠశాలకు పంపించారు.
మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన బాగుందని, అందుకే తన కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ కూతురును తమ పాఠశాలలో చేర్పించడం ఎంతో ఆనందంగా ఉందని, పిల్లలు సైతం సంతోషం వ్యక్తం చేశారని మైనార్టీ గురుకుల పాఠశాలల కార్యదర్శి షఫీయుల్లా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment