1,606 స్కూళ్లలో టీచర్లు లేరు!
405 బడుల్లో విద్యార్థుల్లేరు
- లెక్కలు తేల్చిన విద్యాశాఖ
- టీచర్లులేని చోట విద్యా వలంటీర్ల నియామకానికి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,606 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ కూడా లేరని విద్యాశాఖ తేల్చింది. అలాగే ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు 405 ఉన్నాయని లెక్కగట్టింది. సోమవారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో టీచర్లులేని 1,606 స్కూళ్లలో వెంటనే విద్యా వలంటీర్లను నియమించాలని డీఈవోలను ఆదేశించింది. అలాగే బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లేని 405 పాఠశాలల్లో కొత్తగా విద్యార్థులెవరైనా చేరారా లేదా అనే లెక్కలు తేల్చేందుకు కసరత్తు చేపట్టింది. దీనిపై మంగళ, బుధవారాల్లో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
హేతుబద్ధీకరణపై కసరత్తు...
ప్రస్తుతం బడిబాట కార్యక్రమం ముగింపునకు చేరుకోవడంతో పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రస్తుత బడిబాట కార్యక్రమంలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని టీచర్లు ఇచ్చిన హామీ మేరకు దాదాపు లక్ష మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా సమగ్ర వివరాలు వచ్చాక హేతుబద్ధీకరణ ఎలా చేయాలన్నది నిర్ణయించాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా 10 మంది విద్యార్థులకంటే తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేయాలా లేక విద్యా వలంటీర్లను ఇచ్చి వాటిని కొనసాగించాలా అన్నది తేల్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల ను మూసేస్తే ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు ఉండటంతో స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని పక్కనబెట్టి విద్యా వలంటర్లీతో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.