దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యార్థుల్లో ప్రమాణాల లేమి
కేంద్ర విద్యాశాఖ ‘న్యాస్’సర్వేలో వెల్లడి
ఐదో తరగతికి వచ్చినా సరిగా చదవలేని, రాయలేని దుస్థితి
గణితంలో మరీ వెనుకబడిపోతున్న విద్యార్థులు
రెండేళ్ల కిందటి లక్ష్యాల సాధన దిశగా కనిపించని మార్పు
టీచర్ల కొరతే సమస్యకు కారణమంటున్న అధికారవర్గాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాథమిక వి ద్యలో విద్యార్థుల ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. తెలగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ లోపం కనిపిస్తోందని.. దీన్ని అధిగమించేందుకు కసరత్తు అవసరమని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
2026 నాటికి దశల వారీగా ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాలు.. ఆ దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ రెండేళ్లకోసారి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్)ను నిర్వహించి.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా ర్థుల ప్రమాణాలను పరిశీలిస్తుంది. అలా తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన అంశాలను వెల్లడించింది.
కనీస స్థాయి కూడా ఉండక..
ప్రతి విద్యార్థికి ఐదో తరగతికి చేరేసరికి చదవడం, రాయడంతోపాటు సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన అవసరం. ఇది తేల్చేందుకు కేంద్ర విద్యాశాఖ సర్వేలో 28 అంశాలపై స్వల్పస్థాయి ప్రశ్నలు ఇచ్చింది. విద్యార్థుల్లో 56– 68 శాతం మంది 50శాతం ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. గణితంలో అయితే 70 శాతం మంది విద్యార్థులు 30శాతం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు.
8వ తరగతి విద్యార్థులు కూడా గణితంలో 37శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రాంతీయ భాషల్లో రాయడం, చదవడంలోనూ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ కేటగిరీలో కనీసం సగం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగినవారు 53 శాతం మంది మాత్రమే. చాలా రాష్ట్రాల్లో 13.85 శాతం మంది 8వ తరగతి వచ్చే సరికే బడి మానేస్తున్నారని.. దీన్ని కనీసం 6 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం టార్గెట్ పెట్టింది.
నెరవేరని లక్ష్యం!
రెండేళ్ల క్రితం సర్వే చేసిన సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కనీసం 50శాతం, ఆపైన ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించింది. ఆ సమయంలో తర్వాతి ఐదేళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి.
కానీ ఇప్పటివరకు పెద్దగా మార్పు మొదలైనట్టు కనిపించలేదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు కొత్త లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో ప్రమాణాలు పెరగకపోవడానికి పాఠశాలల్లో టీచర్ల కొరతే కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా కరోనా తర్వాత నాణ్యమైన టీచర్లు దొరికే పరిస్థితి లేక సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment