‘పచ్చ’పాతం రామోజీకి కనబడని విద్యాభివృద్ధి
గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ
ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీలో ర్యాంకులు
రూ.15 కోట్లతో స్టడీసర్కిళ్ల అభివృద్ధి
దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బరితెగించి మాట్లాడిన బాబు
సాక్షి, అమరావతి: ఒకటీ రెండూ కాదు.. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. కుల మత బేధాలు లేకుండా 47 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఒక్కటేంటి చదువుకోవాలనే ఆశ, ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యనందిస్తోంది ఈ సర్కారు.
విదేశాల్లో చదువుకునేందుకు రూ.1.25 కోట్ల ఫీజును చెల్లిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో ‘ఏపీ చదువులు బెస్ట్’ అనిపించుకుంది. కానీ రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోగా.. ‘‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’’ అన్న కుసంస్కారికి సంఘ సంస్కర్త అని డబ్బా కొడుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను అటకెక్కించేశారంటూ గగ్గోలు పెడుతోంది. దళిత, గరిజన బిడ్డలు చదువులకు దూరం చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. అట్టడువర్గాల యువతకు అందించే విదేశీ విద్యా పథకం పైనా ఈనాడు విషం కక్కింది.
గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చేస్తే దానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి అక్రమాలను వెలికి తీసింది. విదేశీ విద్యా పథకంలో మార్పులు చేసి నిజమైన అర్హులకు అందిస్తోంది. ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలకు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.
అడవి బిడ్డలు చదువుకునే గిరిజన విద్యాలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా, వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. అందుకు నిదర్శనమే ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు 2019 నుంచి 23 మధ్య దాదాపు 400 మందికి పైగా ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారు. ఇవేమీ కనిపించని ఈనాడు పత్రిక కుళ్లు రాతలు రాస్తోంది. ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పథకాలు ఇంతకంటే చాలా గొప్పవని చెబుతోంది.
బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఎన్ని రామోజీ?
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు దివంగత వైఎస్సార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికే ‘బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్’గా చంద్రబాబు పేరుమార్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన కూటమిలోని సభ్యులు నడుపుతున్న 383 ప్రైవేటు స్కూళ్లలో కేవలం 33 వేల మందిని చేర్పించి, నిరుపేద విద్యార్థులకు బెస్ట్ ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దోచుకున్నారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం బోధనలోకి మార్చారు. దాంతో 47 లక్షల మంది పిల్లలకు బెస్ట్ విద్య అందుతోంది. ఇక గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రి మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1958 పాఠశాలలను ఆధునికీకరించారు.
వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికిపైగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు.
గిరిజన వర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన
గత ప్రభుత్వంలో ప్రచారానికే పరిమితమైన అడవి బిడ్డల బెస్ట్ విద్యను ఈ ప్రభుత్వం వారి చెంతకు చేర్చింది. ఒకటో తరగతి నుంచి స్కూళ్లలో ఇంగ్లిష్ విద్యను అందించడమే కాకుండా ఉన్నత విద్యను సైతం వారి దరికి చేర్చింది.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రూ.153.85 కోట్లతో నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో సగం సీట్లు (150) గిరిజన విద్యార్థులకే రిజర్వు చేసింది. సాలూరులో రూ.561.88 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తోంది. పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఇవేమీ రామోజీ పచ్చ కళ్లకు కనిపించకపోవడమే విడ్డూరం.
ఎస్సీ విద్యా సంస్థల్లో ఉత్తమ విద్య
గత టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసి అంతిమంగా పేదలపైన, దళితులపైన భారం మోపారు. చదువులు, వైద్యాన్ని కొనే స్తోమత లేక రెండింటికీ దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బకాయి పెట్టి విద్యార్థులను వేదనకు గురి చేసింది. ఇవేమీ ఈనాడు దినపత్రికలో ఏరోజూ కనిపించలేదు. అలాంటి పరిస్థితులను తొలగిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీల కోసం చేపడితే అది తప్పు అన్నట్టు రాస్తోంది.
గతంలో కనీస ప్రమాణాలు లేని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేసి నిధులను దోచుకున్నారు. ఇప్పుడు విద్యార్థులందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ఇంటర్నెట్, విద్యార్థులకు ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్‌తో, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. టోఫెల్ శిక్షణనిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. గత ఏడాది ప్రకటించిన జేఈఈ అడ్వాన్డ్, మెయిన్స్‌ల్లో విద్యార్థులు 99.05 శాతం పర్సంటైల్ సాధించడంతో పాటు 200 మందికి పైగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందారు.
రూ.వేల కోట్ల నిధుల అభివృద్ధి కనిపించలేదా రామోజీ
ఎస్సీ వర్గానికి చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.75 కోట్లు అందించింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.834 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేసింది. 83 వేల మంది ఎస్టీల తల్లులకు రూ.135.66 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది.
జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. 1.11 లక్షల మంది ఎస్టీ తల్లులకు రూ.346 కోట్లు అందాయి. ఈ పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఇవేమీ బెస్ట్ అవెయిలబుల్‌కు సాటిరావంటోంది ఎల్లో మీడియా.
♦ గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించింది.
అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్‌ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని మార్చి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 41 మంది విద్యార్థులు ఎంపికై విదేశాల్లో చదువుకుంటున్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్యకు ఈ స్థాయిలో భరోసా ఇవ్వగలిగిందా?
♦ అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్‌పైనా ఈనాడు పచ్చి అబద్ధాలు అచ్చేసింది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్ మరింత ప్రయోజనకరంగా నిర్వహిస్తోంది. విశాఖలో సివిల్స్ కోచింగ్. విజయవాడలో గ్రూప్స్‌కి శిక్షణనిస్తోంది. తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణనిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉద్యోగ శిక్షణ కోసం ఇప్పటివరకు రు.15 కోట్లు పైగా ఖర్చు చేసింది. అయినా సరే.. బాబు బాగోతమే బాగుందంటోది పచ్చపత్రిక.
Comments
Please login to add a commentAdd a comment