సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చదివేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మరింత అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సాంఘిక సంక్షేమ శాఖ దృష్టి సారించింది. విద్యా బోధనలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఎక్కువ శిక్షణ అవసరమైన బోధన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ టేబుల్‌ను మారుస్తోంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరగతులను వర్గీకరించబోతున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తారు.
విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు.. తగిన మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో మరిన్ని సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి.. వారందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు వీలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అన్ని స్థాయిల్లో విద్యా బోధనను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
మేలైన బోధన అందిస్తున్నాం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలపై పేద వర్గాలకు నమ్మకం కుదిరింది. ఈ సందర్భంలో మా వంతు బాధ్యతగా విద్యార్థులకు మరింత మేలైన విద్యా బోధన అందించేందుకు చర్యలు చేపట్టాం. గురుకుల జూనియర్ కాలేజీల్లో గతంలో ఇంటర్ సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేయాలని ఆదేశించాం. రాష్ట్రంలోని కొన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించి పరిష్కరిస్తున్నాం. ఇకపై గురుకులాలను సందర్శించి వాటికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటా.
– మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment