Department of Social Welfare
-
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులొచ్చాయని, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం రీయింబర్స్మెంట్, క్యూఎస్ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని హర్షవర్ధన్ వివరించారు. -
Harish Rao: గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మణికొండ/సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీక రిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన హైద రాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో మందుబిళ్లలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌తో కలసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరి స్థితిని నెలవారీగా సమీక్షించాలని, స్థానిక పీహెచ్సీ వైద్యులు తప్పనిసరి గురుకులాలను సందర్శించా లని ఆదేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గురుకులాల సంఖ్యను 298 నుంచి 923కు పెంచామని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, గురుకు లాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ డి.రేఖయాదగిరి పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించాలి కార్పొరేట్ ఆస్పత్రులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి లో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై ప్రభు త్వం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలి పారు. ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువగా తీసుకో వా లని కేర్ ఆస్పత్రికి సూచించారు. రోబోటిక్స్ టెక్నా లజీ అందిపుచ్చుకోవడం వల్ల రికవరీ శాతం పెరిగి, రోగి ఆస్పత్రిలో ఉండే సమయం, ఖర్చు తగ్గుతా యన్నారు. కార్యక్రమంలో కేర్ బంజారాహిల్స్ ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ మంజుల అన గాని, ఆస్పత్రి గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్, డాక్టర్ పి. వంశీ కృష్ణ, ఆస్పత్రి సీవోవో డాక్టర్ నీలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పేదిళ్లలో పెళ్లి సందడి..బాలికల విద్యకూ ప్రోత్సాహం!
సాక్షి, అమరావతి: పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే శనివారం విడుదలైన జీవోలో పథకం విధివిధానాలు వెల్లడిస్తూ.. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. ఈ నిబంధనకు 2024 వరకు మినహాయింపు లేదని పేర్కొంది. పేద బాలికల వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా బాలికల విద్యను ప్రోత్సహించడానికే ఈ నిబంధనను విధించింది. బాలికలు కోరుకున్న విద్యా స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించడంలో భాగంగా అర్హతల్లో దొర్లిన తప్పును సరిచేశారు. తద్వారా అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లైందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. పేద వర్గాల చదువుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు–నేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించడం అన్నది తప్పనిసరి చేయడం వల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా రంగం, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు. అన్ని వర్గాల్లోనూ ఆనందం ‘పెళ్లి చేయాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలు పడాలో నాకు తెలుసు. అదే పేదోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఆనందం మాటేలా ఉన్నా అప్పుల తిప్పలు తప్పవు. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. అని పెద్దలు అనేవారు. అలా అప్పులపాలు కాకుండా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా ప్రభుత్వం అమలు చేయనున్న కళ్యాణమస్తు పథకం అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆడ పిల్ల ఉన్న ప్రతి పేదింట్లో పెళ్లి సందడి తేనుండటం పట్ల ఆడపిల్ల తల్లిగా చాలా ఆనందంగా ఉంది’ అని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గృహిణి దేవకి ముద్రబోయిన ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు, వికలాంగుల కుటుంబాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేద ఆడపిల్లల కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు ఈ పథకాలు తోడ్పడనున్నాయి. ఇక అప్పుల ఊబిలో ఇరుక్కోరెవరూ.. అనేక కుల వృత్తులపై ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల్లో పెళ్లి చేయాలంటే పడే కష్టాలు వర్ణనాతీతం. బీసీల్లో చాలా మంది తమ ఆడబిడ్డ కాపురం బాగుండాలని అప్పోసప్పో చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. నగా నట్రా, దుస్తుల కొనుగోలు, ఏర్పాట్లు తదితరాలకు అప్పు చేయక తప్పని పరిస్థితి. పేదలు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాలను ప్రకటించడం గొప్ప విషయం. గతంలో చంద్రబాబు హడావుడిగా రూ.35 వేలు ప్రకటించారు కానీ, అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీని ఆచరణలో చూపిస్తూ రూ.50 వేలు అందించనున్నారు. బీసీ కులాంతర వివాహాలకు చంద్రబాబు ఆరంభ శూరత్వంగా రూ.50 వేలు ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ రూ.75 వేలు అందించనుండటం అభినందనీయం. బీసీలు పెళ్లి పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఈ పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. – వేముల బేబీరాణి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీ బీసీ సంఘం ఎస్సీల ఇంట నిజమైన పెళ్లి సందడి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండే ఎస్సీల ఇంట్లో పెళ్లి చేయడం అంటే చాలా భారం. ఎస్సీల ఇళ్లలో పెళ్లికి చందాలు, అప్పులు చేయక తప్పని దయనీయ స్థితి గతంలో ఎక్కువ. ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. అంబేడ్కర్ మహనీయుడి రాజ్యాంగంతో ఎస్సీలు అనేక రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే వైఎస్సార్ పుణ్యమా అని ఆర్థికంగా ఊతమిచ్చారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఎస్సీల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు ఎస్సీల పెళ్లికి రూ.40 వేలు, కులాంతర వివాహానికి రూ.75 వేలు ప్రకటించి అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలోకి తెచ్చేలా కళ్యాణమస్తు ద్వారా ఎస్సీలకు రూ.లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలు ప్రకటించడం గొప్ప విషయం. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, పీవీరావు మాల మహానాడు గిరిజనులకు గొప్ప వరం అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో జీవించే గిరిజనులు దాదాపు అందరూ నిరుపేదలే. బతుకుదెరువే కష్టమనుకునే తరుణంలో వారింట్లో పెళ్లి తంతు మరీ కష్టం. చాలా మంది గిరిజనులు పెళ్లి ఖర్చులకు కూడా లేక అవస్థలు పడేవారు. అటువంటి వారికి కళ్యాణమస్తు పేరుతో సీఎం వైఎస్ జగన్ గొప్పవరం ఇచ్చారు. గత ప్రభుత్వం గిరిజనుల పెళ్లికి రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు ప్రకటించి మమ అన్పించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ ఎస్టీల పెళ్లికి రూ.1 లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 అందించనుండటం అభినందనీయం. – వడిత్యా శంకర్ నాయక్, గిరిజన నాయకుడు గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితం గత ప్రభుత్వం ఆర్భాటం జాస్తి.. ఆచరణ నాస్తి అనే రీతిలో వ్యవహరించింది. ఎన్నికల ముందు హడావుడిగా పథకాలను ప్రకటించిన చంద్రబాబు వాటిని అమలులోకి తేకుండా కాగితాలకే పరిమితం చేశారు. కానీ, మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా అత్యంత పవిత్రంగా భావించిన సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాన్ని ప్రకటించడం గొప్ప విషయం. మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దడంలో సీఎం వైఎస్ జగన్ చేతల్లో మరోసారి చూపించారు. మైనార్టీలకు చంద్రబాబు రూ.50 వేలు ప్రకటించి ఇవ్వకపోగా, సీఎం వైఎస్ జగన్ ఏకంగా రూ.లక్షకు పెంచి అందించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం. – షేక్ మునీర్ అహ్మద్, కన్వీనర్, ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లికి భరోసా నిర్మాణ రంగంలో సర్వశక్తులు ధారపోస్తూ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భవన నిర్మాణ కార్మికులు తమ ఇంట్లో పెళ్లికి అప్పులపాలు కాకుండా భరోసా ఇచ్చారు. కళ్యాణమస్తు పథకం ద్వారా రూ.40 వేలు అందించేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటించి దరఖాస్తు చేసుకొమ్మని చెప్పిందే కానీ ఆర్థిక సాయం అందించలేదు. భవన నిర్మాణ కార్మికులకే కాకుండా దివ్యాంగులకు సైతం అండగా నిలిచేలా వారి పెళ్లికి రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. – తాళం మావుళ్లు, భవన నిర్మాణ కార్మికుడు, మహాదేవపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బలహీన వర్గాలకు గొప్ప వరం వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం బలహీన వర్గాలకు గొప్ప వరం అని ఏపీ బీసీ సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల హామీని ఆచరణలోకి తేస్తూ గొప్ప పథకాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ బీసీ సంఘ రాష్ట్ర సమావేశం తీర్మానం చేసింది. విజయవాడలోని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాధీ తోఫా పథకాలు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన కార్మికుల కుటుంబాలకు ఒక భరోసా ఇస్తాయన్నారు. ఈ వర్గాలు అప్పులపాలు కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా సీఎం వైఎస్ జగన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తమ్మిశెట్టి రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితా అజయ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కరణం అశోక్ మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఫథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖ్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లిం మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, మాజీ వుడా చైర్మన్ రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తీసుకువచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేసేలా సమగ్ర మార్గదర్శకాలతో కూడిన జీవోను సాంఘిక సంక్షేమ శాఖ శనివారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లయ్యింది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట మేరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అంటే ఇలా ఉండాలని చాటి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం కొన్ని వర్గాలకే ప్రకటించి అమలు చేయకుండా కాగితాలకే పరిమితం అయిన పెళ్లి కానుకను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ వర్తించేలా వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అమలోకి తెచ్చింది. పేద వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికంగా వివాహ నగదు బహుమతిని ఇస్తోంది. గత సర్కారు బీసీలకు మొండిచేయి ► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక అన్ని వర్గాలకు వర్తింప చేయలేదు. 2017లో బీసీలను పథకంలో చేర్చినప్పటికీ వారికి పెళ్లి కానుక డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2018–19 నాటికి 17,909 జంటలకు చంద్రబాబు సర్కారు పెళ్లి కానుక డబ్బులు రూ.68.68 కోట్లను ఎగనామం పెట్టింది. ► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక మార్గదర్శకాలు కూడా సమగ్రంగా లేవు. లబ్ధిదారులకు ఇవ్వాలనే కోణంలో కాకుండా ఎలా ఎగనామం పెట్టాలనే కోణంలోనే నియమ నిబంధనలను రూపొందించింది. అయితే ఇప్పుడు వాటిన్నింటికీ మార్పులు చేసిన వైఎస్ జగన్ సర్కారు.. అర్హులైన వారందరికీ వర్తించేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అర్హతలు, విధి విధానాలు ఇలా.. ► వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తారు. ► వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత. ► వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు) ► వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. ► మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు. ► కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. ► నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు) ► నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ► ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. ► మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు. ► ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది. -
గురుకులాలపై ‘గురి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చదివేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మరింత అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సాంఘిక సంక్షేమ శాఖ దృష్టి సారించింది. విద్యా బోధనలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఎక్కువ శిక్షణ అవసరమైన బోధన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ టేబుల్‌ను మారుస్తోంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరగతులను వర్గీకరించబోతున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు.. తగిన మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో మరిన్ని సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి.. వారందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు వీలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అన్ని స్థాయిల్లో విద్యా బోధనను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేలైన బోధన అందిస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలపై పేద వర్గాలకు నమ్మకం కుదిరింది. ఈ సందర్భంలో మా వంతు బాధ్యతగా విద్యార్థులకు మరింత మేలైన విద్యా బోధన అందించేందుకు చర్యలు చేపట్టాం. గురుకుల జూనియర్ కాలేజీల్లో గతంలో ఇంటర్ సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేయాలని ఆదేశించాం. రాష్ట్రంలోని కొన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించి పరిష్కరిస్తున్నాం. ఇకపై గురుకులాలను సందర్శించి వాటికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటా. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తున్నారని అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సాంఘిక సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. ముఖ్యమంత్రికి అతి ఇష్టమైన శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అంటే ముందుగా గుర్తొచ్చేది షెడ్యూల్డ్ కులాలు. సాంఘిక సంక్షేమ హాస్టల్లలో మౌలిక వసతులు కల్పించడానికి రాజీపడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 1700 వసతి గృహాల్లో 700 ఎత్తివేశారన్నారు. 'ఆ దిశగానే అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుతున్నా. ప్రభుత్వ పరంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించే అధికారులు మీరే. సోషల్ ఆడిట్ పెట్టి మరీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. దళితుల కోసం ముందుండి నడిపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీల అభిప్రాయాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ప్రభుత్వం నడిపేది అధికారులైన మీరే' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చదవండి: (మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ..: సీఎం జగన్) -
గురుకులాలపై పటిష్ట పర్యవేక్షణ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. కొన్ని గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేలా గురుకుల విద్యా సంస్థల టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో రూ.94.3 కోట్లతో క్రీడా ప్రతిభా కేంద్రాలను నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బాలురకు బాక్సింగ్, తూర్పుగోదావరి జిల్లా తునిలో బాలికలకు విలు విద్య, కృష్ణా జిల్లా కృష్ణారావుపాలెంలో బాలురకు అథ్లెటిక్స్, ప్రకాశం జిల్లా పెదపావనిలో బాలికలకు అథ్లెటిక్స్, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో బాలురకు కబడ్డీ, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్‌లో బాలికలకు ఫెన్సింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: గురుకులాల్లో వినూత్నంగా బోధన
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా చదువుకు నోచుకోలేకపోతున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకుల పాఠశాలల పరిధిలో ఆటపాటలతో విద్యార్థులు చదువు కొనసాగేలా గ్రామ అభ్యస బృందాలను (విలేజ్ లెర్నింగ్ సర్కిల్) ఏర్పాటుచేసింది. ఇందుకు జిల్లాకు రెండేసి గురుకులాలను ఎంపికచేసి వాటికి గ్రామ అభ్యస బృందాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఇలా రాష్ట్రంలోని 26 గురుకుల పాఠశాల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులను ఎంపికచేశారు. బోధన ప్రక్రియ ఈ నెల 1 నుంచి మొదలైంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో చదివే విద్యార్థులు ముగ్గురు నుంచి పది మందిని ఒక గ్రూపుగా ఏర్పాటుచేశారు. ఒక్కో గ్రామంలో గురుకుల విద్యార్థులు పన్నెండు మంది కంటే ఎక్కువగా ఉంటే రెండో గ్రూపు ఏర్పాటుచేశారు. ప్రతి బృందానికి విడిగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి వారికి అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లుచేశారు. అలాగే, ప్రతి గ్రూపునకు సబ్జెక్టుల వారీగా విద్యాబోధన చేసేలా ఉపాధ్యాయులను నియమించారు. గ్రామంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ కనీసం గంట నుంచి రెండు గంటలపాటు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. పాఠాలతోపాటు ఆటపాటలు కూడా గురుకుల విద్యార్థులకు నేర్పించి వారిలో ఉత్సాహం నింపేలా చర్యలు చేపట్టడం విశేషం. కాగా, గ్రామ అభ్యస బృందాలకు సీనియర్ విద్యార్థి నాయకత్వం వహిస్తాడు. ఈ బృందాలను పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ వలంటీర్లు పర్యవేక్షిస్తారు. స్పందన బాగుంది రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ప్రారంభించిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు స్పందన బాగుంది. పూర్తిస్థాయిలో ఈ బృందాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చాం. సెల్ఫోన్లు అందరికీ ఉండే అవకాశం లేనందున నేరుగా గ్రామ అభ్యస బృందం పేరుతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి నేరుగా ఉపాధ్యాయులే ఆయా సబ్జెక్టుల్లో బోధించే ఏర్పాటుచేశాం. ఒక్కోసారి ఉపాధ్యాయుడు వేరొక ప్రాంతం నుంచి ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పినా గ్రామ అభ్యస బృందంలో ఏ ఒక్కరైనా మొబైల్ ఫోన్ ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదు. – బండి నవ్య, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ -
‘పది’కి సన్నద్ధం
సాక్షి, అమరావతి: అది విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ హాస్టల్. సమయం సాయంత్రం ఆరున్నర. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంతో హాస్టళ్లలో విద్యార్థులు పట్టుదలతో చదువుతున్నారు. నిశ్శబ్ద వాతావరణంలో పుస్తకాలలో లీనమైపోయారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్టడీ అవర్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు సరఫరా చేశారు. అలాగే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్, హిందీ, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపునకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థుల చదువుపై పర్యవేక్షణతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. హాస్టళ్లలో, స్కూళ్లలో ప్రత్యేక పాఠాలు.. హాస్టళ్లలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు చెప్పిస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు అభ్యసన సమయాలు కేటాయిస్తున్నారు. పిల్లలు ఎలా చదువు పరిశీలనకు డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు విజిట్స్ నిర్వహిస్తున్నారు. నిరంతరం స్లిప్ టెస్ట్‌లు పెడుతూ.. విద్యార్థుల మార్కుల ద్వారా వారి అభ్యసన తీరును పరిశీలిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. బృంద చర్చలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక స్కూలు ముగిసిన తరువాత ఒక గంటపాటు స్టడీ అవర్ కొనసాగిస్తున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 759 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 13,070 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం 1,066 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో వీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 8,071 మంది బాలురు, 4,999 మంది బాలికలు ఉన్నారు. తెలుగు మీడియంలో ఎక్కువ మంది చదువుతున్నారు.