సాక్షి, అమరావతి: పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే శనివారం విడుదలైన జీవోలో పథకం విధివిధానాలు వెల్లడిస్తూ.. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది.
ఈ నిబంధనకు 2024 వరకు మినహాయింపు లేదని పేర్కొంది. పేద బాలికల వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా బాలికల విద్యను ప్రోత్సహించడానికే ఈ నిబంధనను విధించింది. బాలికలు కోరుకున్న విద్యా స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించడంలో భాగంగా అర్హతల్లో దొర్లిన తప్పును సరిచేశారు. తద్వారా అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లైందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
పేద వర్గాల చదువుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు–నేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించడం అన్నది తప్పనిసరి చేయడం వల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా రంగం, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు.
అన్ని వర్గాల్లోనూ ఆనందం
‘పెళ్లి చేయాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలు పడాలో నాకు తెలుసు. అదే పేదోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఆనందం మాటేలా ఉన్నా అప్పుల తిప్పలు తప్పవు. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. అని పెద్దలు అనేవారు. అలా అప్పులపాలు కాకుండా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా ప్రభుత్వం అమలు చేయనున్న కళ్యాణమస్తు పథకం అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆడ పిల్ల ఉన్న ప్రతి పేదింట్లో పెళ్లి సందడి తేనుండటం పట్ల ఆడపిల్ల తల్లిగా చాలా ఆనందంగా ఉంది’ అని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గృహిణి దేవకి ముద్రబోయిన ఆనందం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు, వికలాంగుల కుటుంబాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేద ఆడపిల్లల కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు ఈ పథకాలు తోడ్పడనున్నాయి.
ఇక అప్పుల ఊబిలో ఇరుక్కోరెవరూ..
అనేక కుల వృత్తులపై ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల్లో పెళ్లి చేయాలంటే పడే కష్టాలు వర్ణనాతీతం. బీసీల్లో చాలా మంది తమ ఆడబిడ్డ కాపురం బాగుండాలని అప్పోసప్పో చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. నగా నట్రా, దుస్తుల కొనుగోలు, ఏర్పాట్లు తదితరాలకు అప్పు చేయక తప్పని పరిస్థితి. పేదలు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాలను ప్రకటించడం గొప్ప విషయం.
గతంలో చంద్రబాబు హడావుడిగా రూ.35 వేలు ప్రకటించారు కానీ, అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీని ఆచరణలో చూపిస్తూ రూ.50 వేలు అందించనున్నారు. బీసీ కులాంతర వివాహాలకు చంద్రబాబు ఆరంభ శూరత్వంగా రూ.50 వేలు ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ రూ.75 వేలు అందించనుండటం అభినందనీయం. బీసీలు పెళ్లి పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఈ పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
– వేముల బేబీరాణి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీ బీసీ సంఘం
ఎస్సీల ఇంట నిజమైన పెళ్లి సందడి
రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండే ఎస్సీల ఇంట్లో పెళ్లి చేయడం అంటే చాలా భారం. ఎస్సీల ఇళ్లలో పెళ్లికి చందాలు, అప్పులు చేయక తప్పని దయనీయ స్థితి గతంలో ఎక్కువ. ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. అంబేడ్కర్ మహనీయుడి రాజ్యాంగంతో ఎస్సీలు అనేక రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే వైఎస్సార్ పుణ్యమా అని ఆర్థికంగా ఊతమిచ్చారు.
తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఎస్సీల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు ఎస్సీల పెళ్లికి రూ.40 వేలు, కులాంతర వివాహానికి రూ.75 వేలు ప్రకటించి అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలోకి తెచ్చేలా కళ్యాణమస్తు ద్వారా ఎస్సీలకు రూ.లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలు ప్రకటించడం గొప్ప విషయం.
– నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, పీవీరావు మాల మహానాడు
గిరిజనులకు గొప్ప వరం
అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో జీవించే గిరిజనులు దాదాపు అందరూ నిరుపేదలే. బతుకుదెరువే కష్టమనుకునే తరుణంలో వారింట్లో పెళ్లి తంతు మరీ కష్టం. చాలా మంది గిరిజనులు పెళ్లి ఖర్చులకు కూడా లేక అవస్థలు పడేవారు. అటువంటి వారికి కళ్యాణమస్తు పేరుతో సీఎం వైఎస్ జగన్ గొప్పవరం ఇచ్చారు. గత ప్రభుత్వం గిరిజనుల పెళ్లికి రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు ప్రకటించి మమ అన్పించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ ఎస్టీల పెళ్లికి రూ.1 లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 అందించనుండటం అభినందనీయం.
– వడిత్యా శంకర్ నాయక్, గిరిజన నాయకుడు
గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితం
గత ప్రభుత్వం ఆర్భాటం జాస్తి.. ఆచరణ నాస్తి అనే రీతిలో వ్యవహరించింది. ఎన్నికల ముందు హడావుడిగా పథకాలను ప్రకటించిన చంద్రబాబు వాటిని అమలులోకి తేకుండా కాగితాలకే పరిమితం చేశారు. కానీ, మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా అత్యంత పవిత్రంగా భావించిన సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాన్ని ప్రకటించడం గొప్ప విషయం. మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దడంలో సీఎం వైఎస్ జగన్ చేతల్లో మరోసారి చూపించారు. మైనార్టీలకు చంద్రబాబు రూ.50 వేలు ప్రకటించి ఇవ్వకపోగా, సీఎం వైఎస్ జగన్ ఏకంగా రూ.లక్షకు పెంచి అందించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం.
– షేక్ మునీర్ అహ్మద్, కన్వీనర్, ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ
భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లికి భరోసా
నిర్మాణ రంగంలో సర్వశక్తులు ధారపోస్తూ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భవన నిర్మాణ కార్మికులు తమ ఇంట్లో పెళ్లికి అప్పులపాలు కాకుండా భరోసా ఇచ్చారు. కళ్యాణమస్తు పథకం ద్వారా రూ.40 వేలు అందించేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటించి దరఖాస్తు చేసుకొమ్మని చెప్పిందే కానీ ఆర్థిక సాయం అందించలేదు. భవన నిర్మాణ కార్మికులకే కాకుండా దివ్యాంగులకు సైతం అండగా నిలిచేలా వారి పెళ్లికి రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు.
– తాళం మావుళ్లు, భవన నిర్మాణ కార్మికుడు, మహాదేవపట్నం, పశ్చిమగోదావరి జిల్లా
బలహీన వర్గాలకు గొప్ప వరం
వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం బలహీన వర్గాలకు గొప్ప వరం అని ఏపీ బీసీ సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల హామీని ఆచరణలోకి తేస్తూ గొప్ప పథకాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ బీసీ సంఘ రాష్ట్ర సమావేశం తీర్మానం చేసింది. విజయవాడలోని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాధీ తోఫా పథకాలు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన కార్మికుల కుటుంబాలకు ఒక భరోసా ఇస్తాయన్నారు. ఈ వర్గాలు అప్పులపాలు కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా సీఎం వైఎస్ జగన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తమ్మిశెట్టి రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితా అజయ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కరణం అశోక్ మాట్లాడారు.
వైఎస్సార్ విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఫథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖ్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లిం మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, మాజీ వుడా చైర్మన్ రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment