![Meruga Nagarjuna says Strong supervision of gurukuls is mandatory - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/22/meruga-nag.jpg.webp?itok=GvjLdTzX)
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు.
కొన్ని గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేలా గురుకుల విద్యా సంస్థల టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో రూ.94.3 కోట్లతో క్రీడా ప్రతిభా కేంద్రాలను నిర్మిస్తామన్నారు.
విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బాలురకు బాక్సింగ్, తూర్పుగోదావరి జిల్లా తునిలో బాలికలకు విలు విద్య, కృష్ణా జిల్లా కృష్ణారావుపాలెంలో బాలురకు అథ్లెటిక్స్, ప్రకాశం జిల్లా పెదపావనిలో బాలికలకు అథ్లెటిక్స్, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో బాలురకు కబడ్డీ, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్‌లో బాలికలకు ఫెన్సింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment