పాల్వంచలోని శేఖరంబంజరలో గల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మైనారిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 2016–17 విద్యా సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. భద్రాద్రి జిల్లాలో ఆ ఏడాది రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2017–18లో మరో నాలుగు పాఠశాలలను ప్రారంభించింది. ఈ గురుకులాల్లో 70 శాతం ముస్లిం మైనారిటీలకు, 30 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రతి పాఠశాలలో అరబిక్ ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నమాజు చేసుకునేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. స్పోర్ట్స్ కిట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ పీఈటీలనూ నియమించారు.
జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, కొత్తగూడెంలో బాలికలకు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెంలో బాలుర కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. భద్రాచలం, కొత్తగూడెం బాలుర పాఠశాలలను కలిపి పాల్వంచలోని శేఖరంబంజరలో ఉన్న కేఎల్‌ఆర్ భవనంలో కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం బాలికలకు నేషనల్ డిగ్రీ కళాశాల భవనాన్ని కేటాయించారు. ఈ రెండింటిఇల్లందు బాలుర పాఠశాలను సింగరేణి భవనంలో, అశ్వారావుపేట బాలికల పాఠశాలను జెడ్పీహెచ్‌ఎస్ పాత భవనంలో, బూర్గంపాడు బాలికల పాఠశాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమ వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో మొత్తం 1600 మంది విద్యనభ్యసించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 1400 మంది చదువుతున్నారు.
ఏడాదికి ఒక తరగతి చొప్పున అప్‌గ్రేడ్..
జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 627 మంది బాలికలు, 773 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం బాలికల పాఠశాలలో 360, బూర్గంపాడు బాలికల పాఠశాలలో 152, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 115 మంది బాలికలు, మిగితా పాఠశాలల్లో బాలురు చదువుతున్నారు. అయితే ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని కేఎల్‌ఆర్, కొత్తగూడెంలోని నేషనల్ డిగ్రీ కళాశాల భవనాలకు అద్దె చెల్లించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సొంత భవనాలను నిర్మించా లని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్, వికారాబాద్ జిల్లాలకు భవనాలు మంజూరయ్యాయి.
భద్రాద్రి జిల్లా రామవరంలో బాలికల పాఠశాల నిర్మాణానికి ఏడెకరాల స్థలాన్ని, అశ్వారావుపేటలో ఐదెకరాలు, ఇల్లెందులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మల్టీ సెక్టోరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌డీపీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బాలికలు, ఇల్లందు బాలుర పాఠశాలల్లో 9వ తరగతి వరకు అవకాశం ఉండగా మిగిలిన పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019–20 సంతవ్సరానికి జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 31 తుది గడువుగా నిర్ణయించారు. 9వ తరగతి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు.
పాఠశాలల్లో సకల సౌకర్యాలు
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు నాణ్యతా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఆటలు, యోగా ఉంటాయి. శీతాకాలంలో వేడినీళ్ల సౌకర్యం కూడా కల్పించాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్రమం తప్పకుండా మెనూ అందజేస్తున్నాం.
– జి.ముత్యం, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి
Comments
Please login to add a commentAdd a comment