minority schools
-
సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా..
నల్గొండ (ఆలేరు) : ‘మైనార్టీ గురుకుల విద్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా గడుపుతారు.. ఆడ పిల్లలు స్నానాలు చేస్తున్న గదుల్లోకి గౌస్ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు.. హాస్టల్‌కు కూతవేటు దూరంలో ఉండే స్కూల్లో పనిచేసే కొంత మంది సిబ్బంది గది అద్దెకు తీసుకున్నారు.. అక్కడకు తమను పంపించి బలవంతం చేస్తారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని, టీసీలు ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారు.. వీరి బారి నుంచి తమను కాపాడాలి’ అంటూ గుర్తుతెలియని బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యేకు, అధికారులకు, విలేకరులకు రాసిన ఉత్తరం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం రాసిన ఉత్తరం ఆదివారం వెలుగులోకి వచ్చినప్పటికీ శనివారమే కళాశాల ప్రిన్సిపాల్.. విషయాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని గుర్తుతెలియని బాలిక రాసిన ఉత్తరం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యాలయంలో 5వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు సుమారు 330మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కాలేజీలో పోలీసుల విచారణ ఆరోపణల లేఖపై యాదగిరిగుట్ట సీఐ నవీన్‌రెడ్డి ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం కాలేజీలో విచారణ జరిపారు. కళాశాలలో పనిచేసే ఆసియాపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఆమె భర్త అనీఫ్ విద్యార్థిని పేరిట తప్పుడు లేఖలు సృష్టించాడని తెలిపారు. కళాశాలలో పనిచేసే ఆసియా కుటుంబ సమస్యల వల్లే ఈ రాద్ధాంతం జరిగిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించామని, గుండె సంబంధ వ్యాధి ఉందని చెప్పడంతో వదిలేశామని తెలిపారు. లేఖ ఓ కుట్ర: ఎమ్మెల్యే సునీత గుర్తుతెలియని బాలిక రాసిన ఉత్తరం ఓ కుట్ర అని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. విషయం తెలుసుకున్న ఆమె ఆదివారం కళాశాలను సందర్శించారు. రికార్డులు, సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. లైంగిక వేధింపులపై ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు కారణమైన ఆసియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కళాశాలనుంచి తొలగించేందుకే.. ఆలేరు మైనార్టీ గురుకుల విద్యాలయంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కళాశాలలో అలాంటి ఘటనలు జరగలేదు. కావాలనే ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని అనుమానిస్తూ సాన్థిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కళాశాలలో ఆయాగా పనిచేసే ఆసియా భర్త ఇదంతా చేస్తున్నాడు. కళాశాల నుంచి ఆమెను తొలగించేందుకే ఈ లేఖను సృష్టించాడు. దీనిపై శనివారమే ఎమ్మెల్యే, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. – జహీర్ ఉన్నీసా, కళాశాల ప్రిన్సిపాల్ -
మైనారిటీలకు వరం.. గురుకులం..
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మైనారిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 2016–17 విద్యా సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. భద్రాద్రి జిల్లాలో ఆ ఏడాది రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2017–18లో మరో నాలుగు పాఠశాలలను ప్రారంభించింది. ఈ గురుకులాల్లో 70 శాతం ముస్లిం మైనారిటీలకు, 30 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రతి పాఠశాలలో అరబిక్ ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నమాజు చేసుకునేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. స్పోర్ట్స్ కిట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ పీఈటీలనూ నియమించారు. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, కొత్తగూడెంలో బాలికలకు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెంలో బాలుర కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. భద్రాచలం, కొత్తగూడెం బాలుర పాఠశాలలను కలిపి పాల్వంచలోని శేఖరంబంజరలో ఉన్న కేఎల్ఆర్ భవనంలో కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం బాలికలకు నేషనల్ డిగ్రీ కళాశాల భవనాన్ని కేటాయించారు. ఈ రెండింటిఇల్లందు బాలుర పాఠశాలను సింగరేణి భవనంలో, అశ్వారావుపేట బాలికల పాఠశాలను జెడ్పీహెచ్ఎస్ పాత భవనంలో, బూర్గంపాడు బాలికల పాఠశాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమ వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో మొత్తం 1600 మంది విద్యనభ్యసించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 1400 మంది చదువుతున్నారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున అప్‌గ్రేడ్.. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 627 మంది బాలికలు, 773 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం బాలికల పాఠశాలలో 360, బూర్గంపాడు బాలికల పాఠశాలలో 152, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 115 మంది బాలికలు, మిగితా పాఠశాలల్లో బాలురు చదువుతున్నారు. అయితే ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని కేఎల్ఆర్, కొత్తగూడెంలోని నేషనల్ డిగ్రీ కళాశాల భవనాలకు అద్దె చెల్లించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సొంత భవనాలను నిర్మించా లని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్, వికారాబాద్ జిల్లాలకు భవనాలు మంజూరయ్యాయి. భద్రాద్రి జిల్లా రామవరంలో బాలికల పాఠశాల నిర్మాణానికి ఏడెకరాల స్థలాన్ని, అశ్వారావుపేటలో ఐదెకరాలు, ఇల్లెందులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌డీపీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బాలికలు, ఇల్లందు బాలుర పాఠశాలల్లో 9వ తరగతి వరకు అవకాశం ఉండగా మిగిలిన పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019–20 సంతవ్సరానికి జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 31 తుది గడువుగా నిర్ణయించారు. 9వ తరగతి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు నాణ్యతా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఆటలు, యోగా ఉంటాయి. శీతాకాలంలో వేడినీళ్ల సౌకర్యం కూడా కల్పించాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్రమం తప్పకుండా మెనూ అందజేస్తున్నాం. – జి.ముత్యం, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి -
‘సాంఘిక’ ప్రమాణాలతో మైనారిటీ స్కూల్స్
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * సాంఘిక సంక్షేమ గురుకులాల ఫలితాలు సంతృప్తికరం * ఆ తరహాలోనే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ నడపాలి * మైనారిటీలకు మంచి విద్య ప్రభుత్వ బాధ్యత * ఇప్పటికే 71 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాం * వచ్చే ఏడాదికి మరో 89 పాఠశాలలు మంజూరు చేస్తాం * బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తాం సాక్షి, హైదరాబాద్: అద్భుత ఫలితాలు సాధిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు నడపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్‌తోపాటు పలు ఉన్నత విద్యా కోర్సులకు ఎంపికవుతున్నారన్నారు. ఆ పాఠశాలల నిర్వహణపై పూర్తి సంతృప్తితో ఉన్నానని, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలనూ అవే ప్రమాణాలతో నడపాలని ఆకాంక్షిం చారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, కొత్త రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల తరహాలోనే మైనారిటీలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలన్నారు. ముస్లింల పిల్లలు విద్యావంతులు కావాలని, అందుకోసం అవసరమైన చేయూత అందివ్వాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 120 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని గతంలో నిర్ణయించి ఈ విద్యా సంవత్సరం నుంచే 71 మైనారిటీ విద్యా సంస్థలను ప్రారంభించామన్నారు. అయితే వీటిల్లో చేరేందుకు మైనారిటీలు ఆసక్తి ఎక్కువగా చూపుతున్నందున ఆ స్కూళ్ల సంఖ్యను 160కి పెంచాలని నిర్ణయిం చామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మిగతా 89 పాఠశాలలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. మొత్తం 160 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 55 వేల మందికిపైగా విద్యార్థులకు విద్య, భోజనం, వసతి కల్పించాలన్నారు. ఈ విద్యాలయాలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందినీ నియమిస్తామని కేసీఆర్ చెప్పారు. విద్యా సంస్థల నిర్వహణకు కావాల్సిన వ్యయ అంచనాలను బడ్జెట్లో ప్రతిపాదించాలని అధికారులకు సూచిం చారు. సమావేశంలో మైనారిటీల సంక్షేమ వ్యవహారాల ఇన్చార్జి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతి కుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పట్టణాల్లో ఆరేసి మైనారిటీ స్కూల్స్... ముస్లింల జనాభ అధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఒక్కో చోట ఆరు చొప్పున (మూడు బాలికలకు, మూడు బాలురకు) మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 8 విద్యా సంస్థలున్నాయని, మరో 12 విద్యా సంస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ స్కూళ్లలో తొలుత 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించాలని, ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్లాలని కేసీఆర్ సూచించారు. మొదటి ఏడాది ప్రారంభించిన మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ బాగుందని అధికారులను సీఎం అభినందించారు. మైనారిటీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు చూసి సీఎం ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదికల్లా అన్ని విద్యా సంస్థలకు సొంత భవనాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణేశ్ ఉత్సవాల్లో లౌకిక స్ఫూర్తి గణేశ్ ఉత్సవాల సందర్భంగా లౌ కిక స్ఫూర్తి వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చాలా చోట్ల గణేశ్ మండపాల వద్ద ముస్లింలు పూజలు చేశారని, ఉత్సవాల్లో పాల్గొన్నారని, లడ్డూ వేలం లో పాల్గొని దక్కించుకున్నారన్నారు. రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌కి ప్రతీక అనేందుకు వినాయక చవితి ఉత్సవాలు తాజా ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మతాల పేరిట ఎన్నడూ విడిపోలేదని, బతుకమ్మ, దసరా, పీర్ల పండుగలను కలిసి జరుపుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. జమ్మిచెట్టు వద్దకు, పాలపిట్టను చూసేందుకు అందరూ కలిసే వెళ్తారన్నారు. మతాలకతీతంగా ప్రజలు భారీ స్థాయిలో దర్గాలను సందర్శిస్తారని గుర్తుచేశారు. అన్ని వర్గాల భావితరాల బాగు కోసం కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
దేశంలో ఎక్కడా లేని విధంగా 73 స్కూళ్లు..
కరీంనగర్: దేశంలో ఎక్కడా లేని విధంగా 73 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. సోమవారం కరీంనగర్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రంజాన్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జిల్లాకు 9 మైనారిటీ స్కూళ్లు
ప్రభుత్వం ప్రకటించిన 71 మైనారిటీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాకు తొమ్మిది ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వికారాబాద్ బాలుర పాఠశాలలో 5, 6,7 తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఎండీ షఫీ ఉల్లాతో కలిసి శివారెడ్డిపేట్‌లో ఉన్న ప్రభుత్వ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మైనార్టీలు 75 శాతం ఉంటే 25 శాతం ఇతర కులాల పేదవారు ఉంటారని తెలిపారు.