‘సాంఘిక’ ప్రమాణాలతో మైనారిటీ స్కూల్స్ | 'Social' standards With Minority Schools | Sakshi
Sakshi News home page

‘సాంఘిక’ ప్రమాణాలతో మైనారిటీ స్కూల్స్

Published Sat, Sep 17 2016 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

‘సాంఘిక’ ప్రమాణాలతో మైనారిటీ స్కూల్స్ - Sakshi

‘సాంఘిక’ ప్రమాణాలతో మైనారిటీ స్కూల్స్

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
* సాంఘిక సంక్షేమ గురుకులాల ఫలితాలు సంతృప్తికరం
* ఆ తరహాలోనే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ నడపాలి
* మైనారిటీలకు మంచి విద్య ప్రభుత్వ బాధ్యత
* ఇప్పటికే 71 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాం
* వచ్చే ఏడాదికి మరో 89 పాఠశాలలు మంజూరు చేస్తాం
* బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తాం

సాక్షి, హైదరాబాద్: అద్భుత ఫలితాలు సాధిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు నడపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్‌తోపాటు పలు ఉన్నత విద్యా కోర్సులకు ఎంపికవుతున్నారన్నారు. ఆ పాఠశాలల నిర్వహణపై పూర్తి సంతృప్తితో ఉన్నానని, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలనూ అవే ప్రమాణాలతో నడపాలని ఆకాంక్షిం చారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, కొత్త రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల తరహాలోనే మైనారిటీలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలన్నారు.

ముస్లింల పిల్లలు విద్యావంతులు కావాలని, అందుకోసం అవసరమైన చేయూత అందివ్వాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 120 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని గతంలో నిర్ణయించి ఈ విద్యా సంవత్సరం నుంచే 71 మైనారిటీ విద్యా సంస్థలను ప్రారంభించామన్నారు. అయితే వీటిల్లో చేరేందుకు మైనారిటీలు ఆసక్తి ఎక్కువగా చూపుతున్నందున ఆ స్కూళ్ల సంఖ్యను 160కి పెంచాలని నిర్ణయిం చామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మిగతా 89 పాఠశాలలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. మొత్తం 160 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 55 వేల మందికిపైగా విద్యార్థులకు విద్య, భోజనం, వసతి కల్పించాలన్నారు.

ఈ విద్యాలయాలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందినీ నియమిస్తామని కేసీఆర్ చెప్పారు. విద్యా సంస్థల నిర్వహణకు కావాల్సిన వ్యయ అంచనాలను బడ్జెట్లో ప్రతిపాదించాలని అధికారులకు సూచిం చారు. సమావేశంలో మైనారిటీల సంక్షేమ వ్యవహారాల ఇన్‌చార్జి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతి కుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఆ పట్టణాల్లో ఆరేసి మైనారిటీ స్కూల్స్...
ముస్లింల జనాభ అధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఒక్కో చోట ఆరు చొప్పున (మూడు బాలికలకు, మూడు బాలురకు) మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 8 విద్యా సంస్థలున్నాయని, మరో 12 విద్యా సంస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ స్కూళ్లలో తొలుత 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించాలని, ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్లాలని కేసీఆర్ సూచించారు. మొదటి ఏడాది ప్రారంభించిన మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ బాగుందని అధికారులను సీఎం అభినందించారు. మైనారిటీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు చూసి సీఎం ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదికల్లా అన్ని విద్యా సంస్థలకు సొంత భవనాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
గణేశ్ ఉత్సవాల్లో లౌకిక స్ఫూర్తి
గణేశ్ ఉత్సవాల సందర్భంగా లౌ కిక స్ఫూర్తి వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చాలా చోట్ల గణేశ్ మండపాల వద్ద ముస్లింలు పూజలు చేశారని, ఉత్సవాల్లో పాల్గొన్నారని, లడ్డూ వేలం లో పాల్గొని దక్కించుకున్నారన్నారు. రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌కి ప్రతీక అనేందుకు వినాయక చవితి ఉత్సవాలు తాజా ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మతాల పేరిట ఎన్నడూ విడిపోలేదని, బతుకమ్మ, దసరా, పీర్ల పండుగలను కలిసి జరుపుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. జమ్మిచెట్టు వద్దకు, పాలపిట్టను చూసేందుకు అందరూ కలిసే వెళ్తారన్నారు. మతాలకతీతంగా ప్రజలు భారీ స్థాయిలో దర్గాలను సందర్శిస్తారని గుర్తుచేశారు. అన్ని వర్గాల భావితరాల బాగు కోసం కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement