దవా'ఖానా'..! | cheap quality meals ingovernment hospitals | Sakshi
Sakshi News home page

దవా'ఖానా'..!

Published Wed, Jan 14 2015 9:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

cheap quality meals ingovernment hospitals

ప్రభుత్వాస్పత్రుల్లో నాసిరకం భోజనం
ఖమ్మం: ముద్ద అన్నం.. నీళ్లచారు, మజ్జిగ.. సాంబారు లాంటి పప్పు.. నాసిరకం కోడిగుడ్లు, బ్రెడ్లు.. రుచీపచీలేని వంటకాలు తినలేక పస్తులుంటున్న తీరు.. ఇవీ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పుత్రుల్లో రోగుల అవస్థలు. ఓ పద్ధతి ప్రకారం మెనూ అమలు చేయాల్సిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పేషెంట్లు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. రోగులు డిశ్చార్జ్ అయినా.. భోజనం పెట్టినట్టు బిల్లులు నొక్కేస్తున్నా పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది పట్టనట్టే ఉంటున్నారు. మంగళవారం 'సాక్షి' పరిశీలనలో జిల్లాకేంద్ర ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లో ఆహార పదార్థాల అధ్వానస్థితి బయటపడింది.

ఏరియా ఆస్పత్రుల్లో రోగులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా భోజనాన్ని వడ్డిస్తుండటంతో రోగులు తినలేకపోతున్నారు. కొన్నిచోట్ల మెనూ ప్రకారం గడ్డు, పాలు, బ్రెడ్డు కూడా అందించడం లేదు. ఇదేమని అడిగితే తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు సమాధానం చెబుతుండటం గమనార్హం. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్స్‌కు అందిస్తున్న భోజనం నాణ్యతపై మంగళవారం 'సాక్షి' పరిశీలన చేసింది.

జిల్లా కేంద్రంలోని ఆస్పత్రితో పాటు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి, పెనుబల్లిలో ఏరియా ఆస్పత్రులున్నాయి. చికిత్స కోసం రోగులు అడ్మిట్ అయితే వారికి ఉదయం పాలు, బ్రెడ్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి. వైద్య విధాన పరిషత్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రోగులకు ఆహారపదార్థాలు అందిస్తారు. ఒక్కో రోగికి ఉదయం పాలు, బ్రెడ్‌తో పాటు రెండు పూటల భోజనం 400 గ్రాముల బియ్యం వండించి పెట్టాలి. చారు, గుడ్డు, మజ్జిగతో పాటు ఏదైనా కూర వడ్డించాలి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన రోగులకు రెండు కూరలు, గుడ్డు పెట్టాలి. సాధారణంగా ఒక్కో రోగికి రోజుకు రూ.40, ఆరోగ్యశ్రీ కింద రూ.100 వరకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. అయితే తమకు గిట్టుబాటు కావడం లేదంటున్న కాంట్రాక్టర్లు ఆరోగ్యశ్రీ వార్డుల్లోనూ నాసిరకంగా భొజనం అందిస్తున్నారు. జనరల్ వార్డుల్లో ఉన్న రోగులకు కూడా వారంలో రెండు రోజులే గుడ్లు పెడుతున్నారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నీళ్ల చారు వడ్డిస్తుండటంతో రోగులు దీన్ని తినలేక పారబోస్తున్నారు. కొంతమంది రోగులు డిశ్చార్జ్ అయినా.. వారికి కూడా భోజనం పెట్టినట్లు కాంట్రాక్టర్లు రికార్డుల్లో రాసుకొని బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఏరియా ఆస్పత్రుల అధికారులు సహకరిస్తున్నారని సమాచారం. ఈ భోజన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రతి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ అధికారిని ఏర్పాటు చేశారు. వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే కాంట్రాక్టర్లు నాణ్యతను విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన రోగులు మాత్రం ఈ భోజనం తిని ఎలా ఉండాలని వాపోతున్నారు.

కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఉదయం ఇచ్చే పాలు పలుచగా ఉంటున్నాయి.. మధ్యాహ్న భోజనానికి దొడ్డు బియ్యం ఉపయోగిస్తుండటంతో తినలేకపోతున్నామని రోగులు అంటున్నారు. అన్నంలో రాళ్లు, కూరలో ఉప్పు, కారం తక్కువగా ఉండటం, రుచి లేకపోవడంతో రోగులు తినలేక పారేస్తున్నారు. ప్రతి రోజు నీళ్ల చారు, ఆలుగడ్డ వంటి కూరలు పెడుతున్నారు. వాటి స్థానంలో ఆకు కూరలు పెట్టాలని రోగులు కోరుతున్నారు.

సత్తుపల్లిలో ఏరియా ఆస్పత్రిలో 58 మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. వీరికి ఉదయం కిచిడి, పాలు అందిస్తారు. మధ్యాహ్నం దొడ్డు బియ్యం అన్నం, బెండకాయ పులుసు, నీళ్ల సాంబారుతో మెనూ తూతూ మంత్రంగా పాటిస్తున్నారు. మజ్జిగ అసలే లేదు. రోగులకు ఇగురు కూర అందించాల్సి ఉండగా పులుసు కూరతోనే సరిపెడుతున్నారు. రోగులకు కొలత ప్రకారం చిన్న గిన్నెతో అన్నం వడ్డిస్తుండటంతో సరిపోక అర్థాకలితో అలమటిస్తున్నారు.
 
పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో రోగులు చలికి తట్టుకోలేక వైద్యం చేయించుకొని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 24 మంది వైద్యం పొందుతున్నారు. వీరికి ఉదయాన్నే పాలు, బ్రెడ్ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో ఉపయోగించే బియ్యం కొత్తవి, దొడ్డువి కావటంతో ఆ అన్నం తినేందుకు అవస్థలు పడుతున్నారు.

పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు ఉదయం పాలు, బ్రెడ్ అందించాల్సి ఉండగా రెండు ఇడ్లీలతో సరి పెడుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో నాణ్యత లోపిస్తోంది. దొడ్డు రేషన్ బియ్యం కావడంతో అన్నం ముద్దముద్దగా తయారవుతోంది. రుచీపచీ లేకుండా కూరలు వండిపెడుతున్నారు. దోసకాయ కూర , రసం ఇచ్చారు. వాటిల్లో నాణ్యత లేదని, కనీసం తాలింపు గింజలు,  ఎల్లిపాయలు, కరివేపాకు వంటి ఏమీ వేయలేదని రోగులు మండిపడ్డారు. నీళ్ల చారు ఎలా తాగాలని ప్రశ్నించారు. మధ్యాహ్నం, సాయంత్రం రెండు సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా గత వారం రోజులగా ఇవ్వటం లేదు.  సాంబారుకు బదులు రసం చేసి ఇచ్చారు. కొన్ని రోజులుగా మజ్జిగా ఇవ్వడం లేదు.
 
భద్రాచలం ఏరియా వైద్యశాలలో భోజనం నిర్వాహకులదే ఇష్టారాజ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు, రొట్టె ఇచ్చేటప్పుడు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం పెట్టేటప్పుడు ఆస్పత్రి అధికారులు కన్నెత్తయినా చూడటం లేదు. వాస్తవంగా భోజనం పంపిణీ సమయంలో ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి. కానీ భోజనం తయారు చేసే కార్మికులే వీటిని ప్రతి గదికి తిరిగి పెడుతున్నారు. ఇక్కడ తరచూ పప్పే వడ్డిస్తున్నారు. అది కూడా సాంబారు మాదిరే ఉంటుందని రోగులు చెబుతున్నారు. మజ్జిగ తాగలేని పరిస్థితి ఉంది. అరటిపండు కూడా అందరికీ ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement