టీచర్ల హేతుబద్ధీకరణ కష్టమే!
సర్కారు వద్ద పెండింగ్‌లో ఫైలు
క్రమబద్ధీకరణ చేస్తే పదోన్నతులకు పట్టుబట్టనున్న టీచర్లు
వాయిదా యోచనలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు ఈసా రి చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఓకే చెబితే ఉపాధ్యాయులు, సంఘాలు.. పదోన్నతులు, బదిలీల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో ఈసారికి దీన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టీచర్ల హేతుబద్ధీకరణపై ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ 2 నెలల కిందటే ఫైలు పంపినా, ఉపాధ్యాయ సంఘాలతో ఇటీవల చర్చించి ప్రతిపాదనల్ని పంపినా అవన్నీ ప్రభుత్వం వద్దే ఆగిపోయాయి. కాగా మరో 15 రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులు ఉంటాయా? లేదా? అన్న ఆందోళన టీచర్లలో నెలకొంది.
స్కూళ్ల మూసివేత ఓ కారణమే!
ప్రస్తుతం హేతుబద్ధీకరణ చేపట్టాలంటే గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు (జీవో నంబర్ 6) సవరణ చేయాలి. 19 మంది, అంతకంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక స్కూళ్లకు.. 75, అంతకంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లకు టీచర్లను ఇవ్వబోమని; ఆ స్కూళ్లను పక్క పాఠశాలల్లో విలీనం చేసి, పిల్లలను సమీపంలోని స్కూళ్లలో చేర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలా పక్క స్కూళ్లలో విలీనం చేస్తే 4 వేలకు పైగా స్కూళ్లు మూతపడతాయి. వాటిలో పోస్టులు రద్దు అవుతాయి. ఈ నిబంధనలను ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో స్కూళ్లను మూసేయమని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని, లేదా హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తే 4 వేల స్కూళ్లు మూతపడతాయి. అదే జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుం దని, అందుకే రేషనలైజేషన్ ప్రస్తుతానికి చేయొ ద్దనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఓకే చెబితే తప్ప టీచర్ల బదిలీలకు అవకాశం లభించదు. దీంతో ప్రభు త్వ నిర్ణయం కోసం టీచర్లు ఎదురుచూస్తున్నా.. పరోక్షంగా రేషనలైజేషన్‌తోపాటు టీచర్ల బది లీలు, పదోన్నతులు అన్నింటినీ ఇప్పటికి పక్కనబెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లేదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.