విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలకు ‘నాణ్యమైన విద్య’ అంటూ క్లస్టర్ స్కూళ్ల పేరుతో చాలా పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేయడానికి ఎంపిక చేసిన మూడు జిల్లాలో విజయనగరం జిల్లా ఉంది. దీంతో జిల్లాలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడనున్నాయి. మండలంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఒక పాఠశాల ఉండే విధంగా క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మండలాల్లో క్లస్టర్ సూళ్లకు అనుకూలమైన పాఠశాలలకు గుర్తింపు సర్వేలను ఎంఈఓల ద్వారా నిర్వహించారు. మూతపడే పాఠశాలలను ముందుగా ప్రకటిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుందని వాటి సంఖ్యను వెలువరించడానికి విద్యాశాఖ నిరాకరిస్తోంది.
తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలో క్లస్టర్ స్కూళ్లంటూ ప్రకటించింది. ఆ విధంగా అయితే మండలానికి 10 నుంచి 15 క్లస్టర్ స్కూళ్లు వచ్చే పరిస్థితి ఉండేది. కొద్దిరోజుల తర్వాత సవరించిన ఆదేశాల మేరకు 10 కిలోమీటర్ల పరిధిలో ఒక క్లస్టర్ పాఠశాల విధానం వచ్చింది. ఆ దిశగా మరోసారి సర్వే నివేదికలు పంపారు. తాజా ఆదేశాల మేరకు మండలానికి మూడు పాఠశాలల చొప్పున జిల్లాలోని 34 మండలాలలో కేవలం 102 క్లస్టర్ పాఠశాలలు మాత్రమే ఉంటాయి. ఒక్కో పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 2,927 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,320, మిగిలినవి ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. దీంతో జిల్లాలో 2,825 పాఠశాలలు ఒక్కసారిగా మూతపడే పరిస్థితి దాపురించింది.
రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం దృష్టంతా ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేయడంపైనే ఉంది. ప్రజలకు విద్యనందించే భారాన్ని తగ్గించుకునే విధంగా ఆదినుంచి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీర్చడం నుంచి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడం వరకు ఏ ఒక్కటీ ఇంతవరకు చే పట్టిన దాఖలాలు లేవు. చివరికి కేంద్రప్రభుత్వం నిధులు అందజేసే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను భర్తీచేయడానికి కూడా ముందుకు రావడంలేదు. ఎలాగూ పాఠశాల సంఖ్యను తగ్గిస్తాం... కాబట్టి టీచర్ల కొరతను తీర్చక్కర్లేదు అన్నట్టుగా పాలకులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న క్లస్టర్ స్కూళ్ల వ్యవస్థ వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులను 10 కిలోమీటర్ల దూరం పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించే పరిస్థితి అనుమానమే.
గ్రామాల నుంచి వ్యతిరేకత
పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని గంట్యాడ మండలం నుంచి పలు గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులు అంగీకరిస్తారా? అనే విషయంపైనే ప్రస్తుతం చర్చనడుస్తోంది. మిగిలిన స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న భవనాల సంగతి ఏంటనే విషయాలపై స్పష్టత లేదు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మోడల్ స్కూళ్లకు అన్ని సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఏర్పాటు చేయనున్న క్లస్టర్ స్కూళ్ల విషయంలో కూడా అదే గతి పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
వివరాలు తీసుకుంటాం: డీఈఓ
ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలల వరకు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు వివరాలను తీసుకుంటామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మండలాల వారీగా వివరాలు పూర్తిస్థాయిలో ఇంకారాలేదన్నారు. స్మార్ట్, గ్రీన్ స్కూళ్లగా వాటిని తీర్చిదిద్దుతారని తెలిపారు. ఎంపిక చేసే వాటిలో పక్కా భవనం, ఫర్నిచర్, ప్రహరీ, కంప్యూటర్లు ఉండాలన్నారు. గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం ఉండాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. అలాగే విద్యార్థుల నమోదు అధికంగా ఉండడం తప్పనిసరి అన్నారు. ఒక్కో క్లస్టర్ స్కూల్‌కు 5 నుంచి 6 పాఠశాలలు అటాచ్ అవ్వాలని, అవసరమైతే అదనంగా తరగతి గదులు, రెసిడెన్షియల్ హాస్టల్ కట్టుకునేందుకు అవకాశం ఉండాలని వివరించారు.
వీధి బడులకు శాశ్వత సెలవు!
Published Fri, Jan 23 2015 5:14 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement