cluster schools
-
ఎంఈవో–2 పోస్టులకు గుడ్‌బై!
సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈలకు మంగళం పాడి రాష్ట్ర విద్యాశాఖ నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి సర్కారు ఇప్పుడు ఎంఈవో–2 పోస్టుల రద్దుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్‌ను క్లస్టర్‌గా మార్చి, ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు డీడీవో బాధ్యతలు అప్పగించనున్నారు. అంటే ఆ పాఠశాల పరిధిలోని (క్లస్టర్) ప్రాథమిక పాఠశాలల ఉపా«ద్యాయుల వేతనాల చెల్లింపు బాధ్యతను క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.ప్రస్తుతం విధుల్లో ఉన్న 679 మంది ఎంఈవో–2లు తిరిగి ప్రధానోపాధ్యాయులుగా వెళ్లనున్నారు. ఎంఈవో–1కు కూడా డీడీవో బాధ్యతలు తొలగించనున్నారు. ఇక క్లస్టర్ స్కూళ్లకు సమీపంలో తక్కువ విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా క్లస్టర్ స్కూళ్లలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పలు ప్రభుత్వ స్కూళ్లు మూతబడటం, ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ స్కూల్ హెచ్ఎంకే అజమాయిషీ ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ, ఆయా సబ్జెక్టులపై నిపుణులైన సీనియర్ ఉపాధ్యాయుల బోధనా అంశాలపై చర్చించేందుకు స్కూల్ కాంప్లెక్స్‌లు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మండల పరిధిని బట్టి 8 నుంచి 12 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్.. కాంప్లెక్స్‌గా ఉంది. ఇలా మండలంలో 4 నుంచి 6 కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో సుమారు 35 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటారు. అయితే, ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్‌లను క్లస్టర్‌గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ క్లస్టర్ పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలల్లోని 35 మంది ఉపాధ్యాయులపై అజమాయిషీని క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు. ఎంఈవో–1కు ఉన్న వేతనాల డ్రా చేసే విధులు తొలగించి.. కేవలం మండలంలోని స్కూళ్లపై పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఉంచుతారు. స్కూళ్ల రేషనలైజేషన్ కోసమే మార్పులు? క్లస్టర్ విధానం ద్వారా స్కూళ్ల రేషనలైజేషన్ చేయవచ్చని ఉపాధ్యాయుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఆ క్లస్టర్ స్కూల్ పరిధిలోని ఇతర పాఠశాలల్లో తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను క్లస్టర్ స్కూల్లో కలిపేస్తారు. దీంతో కొన్ని స్కూళ్లు మూతబడవచ్చని టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేగాక, మూతబడే స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దు చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియకు పావులు కదుపుతోందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. -
క్లస్టర్ పాఠశాలలను వ్యతిరేకిస్తూ 24న ధర్నా
రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల తీర్మానం కర్నూలు(జిల్లా పరిషత్): క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ధర్నా చేయాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠవాలల విద్య సంస్కరణలో భాగంగా క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై బుధవారం స్థానిక గాంధినగర్‌లోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కన్వీనర్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శీలం కాంతారావు అధ్యక్షత వహించారు. క్లస్టర్ పాఠశాలల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ద్వారకా తిరుమల మండలంలో ఉన్న 57 గ్రామాల పాఠశాలలను కేవలం 10 పాఠశాలలుగా కుదించడం వల్ల 47 గ్రామాల్లో పాఠశాలలు మూతపడటం, ఉపాధ్యాయులు 40 మంది మిగులు చూపారన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు డ్రాపవుట్లుగా మారడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కుగ్రామాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పరోక్షంగా క్లస్టర్ పాఠశాలలను ప్రవేశపెడుతోందని విమర్శించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. హృదయరాజు మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాలలను కుదించి, మౌళిక వసతులు కల్పిస్తూ క్లస్టర్ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, పది గ్రామాల నుంచి బస్సుల ద్వారా విద్యార్థులను తరలిస్తామని ప్రభుత్వం చెప్పడం బడుగు, బలహీనవర్గాల వారికి విద్యను దూరం చేయడమేనన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. రత్నం ఏసేపు మాట్లాడుతూ క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకైనా సిద్దమన్నారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రైవేటపరం చేయడానికి క్లస్టర్ ప్రతిపాదన అని, దీన్ని విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 24న ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం(జిటిఎ) జిల్లా కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ గతంలో ప్రవేశపెట్టిన పథకాలు జయప్రదం కాకుండా కొత్త పథకాన్ని ఎలాంటి చర్చలు లేకుండా ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభత్వు పాఠశాలలను నాశనం చేయడానికి క్లస్టర్ ప్రతిపాదనలో ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. కమలాకరరావు, ఎస్. ఇస్మాయిల్, జీటీఎ నాయకులు రామచంద్రుడు, ఐఎఫ్టీయు నాయకులు టి. నాగరాజు, పీవైఎల్ యువజన సంఘం నాయకులు టి. తిరుపాలు, తదితరులు పాల్గొన్నారు. -
వీధి బడులకు శాశ్వత సెలవు!
విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలకు ‘నాణ్యమైన విద్య’ అంటూ క్లస్టర్ స్కూళ్ల పేరుతో చాలా పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేయడానికి ఎంపిక చేసిన మూడు జిల్లాలో విజయనగరం జిల్లా ఉంది. దీంతో జిల్లాలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడనున్నాయి. మండలంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఒక పాఠశాల ఉండే విధంగా క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మండలాల్లో క్లస్టర్ సూళ్లకు అనుకూలమైన పాఠశాలలకు గుర్తింపు సర్వేలను ఎంఈఓల ద్వారా నిర్వహించారు. మూతపడే పాఠశాలలను ముందుగా ప్రకటిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుందని వాటి సంఖ్యను వెలువరించడానికి విద్యాశాఖ నిరాకరిస్తోంది. తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలో క్లస్టర్ స్కూళ్లంటూ ప్రకటించింది. ఆ విధంగా అయితే మండలానికి 10 నుంచి 15 క్లస్టర్ స్కూళ్లు వచ్చే పరిస్థితి ఉండేది. కొద్దిరోజుల తర్వాత సవరించిన ఆదేశాల మేరకు 10 కిలోమీటర్ల పరిధిలో ఒక క్లస్టర్ పాఠశాల విధానం వచ్చింది. ఆ దిశగా మరోసారి సర్వే నివేదికలు పంపారు. తాజా ఆదేశాల మేరకు మండలానికి మూడు పాఠశాలల చొప్పున జిల్లాలోని 34 మండలాలలో కేవలం 102 క్లస్టర్ పాఠశాలలు మాత్రమే ఉంటాయి. ఒక్కో పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 2,927 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,320, మిగిలినవి ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. దీంతో జిల్లాలో 2,825 పాఠశాలలు ఒక్కసారిగా మూతపడే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం దృష్టంతా ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేయడంపైనే ఉంది. ప్రజలకు విద్యనందించే భారాన్ని తగ్గించుకునే విధంగా ఆదినుంచి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీర్చడం నుంచి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడం వరకు ఏ ఒక్కటీ ఇంతవరకు చే పట్టిన దాఖలాలు లేవు. చివరికి కేంద్రప్రభుత్వం నిధులు అందజేసే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను భర్తీచేయడానికి కూడా ముందుకు రావడంలేదు. ఎలాగూ పాఠశాల సంఖ్యను తగ్గిస్తాం... కాబట్టి టీచర్ల కొరతను తీర్చక్కర్లేదు అన్నట్టుగా పాలకులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న క్లస్టర్ స్కూళ్ల వ్యవస్థ వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులను 10 కిలోమీటర్ల దూరం పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించే పరిస్థితి అనుమానమే. గ్రామాల నుంచి వ్యతిరేకత పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని గంట్యాడ మండలం నుంచి పలు గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులు అంగీకరిస్తారా? అనే విషయంపైనే ప్రస్తుతం చర్చనడుస్తోంది. మిగిలిన స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న భవనాల సంగతి ఏంటనే విషయాలపై స్పష్టత లేదు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మోడల్ స్కూళ్లకు అన్ని సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఏర్పాటు చేయనున్న క్లస్టర్ స్కూళ్ల విషయంలో కూడా అదే గతి పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వివరాలు తీసుకుంటాం: డీఈఓ ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలల వరకు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు వివరాలను తీసుకుంటామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మండలాల వారీగా వివరాలు పూర్తిస్థాయిలో ఇంకారాలేదన్నారు. స్మార్ట్, గ్రీన్ స్కూళ్లగా వాటిని తీర్చిదిద్దుతారని తెలిపారు. ఎంపిక చేసే వాటిలో పక్కా భవనం, ఫర్నిచర్, ప్రహరీ, కంప్యూటర్లు ఉండాలన్నారు. గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం ఉండాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. అలాగే విద్యార్థుల నమోదు అధికంగా ఉండడం తప్పనిసరి అన్నారు. ఒక్కో క్లస్టర్ స్కూల్‌కు 5 నుంచి 6 పాఠశాలలు అటాచ్ అవ్వాలని, అవసరమైతే అదనంగా తరగతి గదులు, రెసిడెన్షియల్ హాస్టల్ కట్టుకునేందుకు అవకాశం ఉండాలని వివరించారు. -
పేదలకు విద్య... ‘క్లస్ట’తరమే!
రాజ్యాంగం హామీ ఇచ్చిన నిర్బందోచిత ప్రాథమిక విద్యకు తిలోదకాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏటా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పోటీలో దూసుకుపోతుంటే నోళ్లు వెళ్లబెడుతున్న సర్కారీ బడులు ప్రస్తుతం మనుగడనే కోల్పోయే దుస్థితి దాపురించింది. పాఠశాలల నిర్వహణ చేతకాక చేతులెత్తేసిన ప్రభుత్వం క్లస్టర్ స్కూళ్లంటూ పిల్లల జీవితాలతో మరో ప్రయోగం చేసి విద్యను పేదలకు అందనంత ఎత్తుకు తీసుకుపోయేందుకు సమాయత్తమవుతోంది. ఏలూరు సిటీ : ప్రాథమిక విద్యారంగం భారం మోయలేకపోతున్న ప్రభుత్వం దాన్ని వదిలించుకొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏటా బడ్జెట్లో రూ. వేలకోట్లు కుమ్మరిస్తోన్నా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడంలో విఫలమౌతోన్న సర్కారు క్లస్టరు స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తోంది. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఈ రెండింటినీ ఒకేచోట నిర్విహ ంచేలా ఈ కొత్త వ్యవస్థను తెరపైకి తెస్తోంది. జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో భారీసంఖ్యలో స్కూళ్లను తగ్గించనుంది. పెలైట్ ప్రాజెక్టుగా ద్వారకాతిరుమల మండలంలో ఈ విధానం అమలు చేశారు. ఇక్కడ సుమారు 40 పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడగా, ఉపాధ్యాయులు ఖాళీగా మిగలనున్నారు. మండలానికి 10 క్లస్టర్ స్కూళ్లు సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి, నిర్లక్ష్యాన్ని తొలగించడం, ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడంలో భాగంగా క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మండలాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేకుండానే నడుస్తున్నాయి. అలాంటిచోట్ల ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సమీకృత విద్యాసంస్థలను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగానే జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. మండలానికి 10 వరకు క్లస్టర్ స్కూల్స్ ఉంటాయి. అంటే రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ పాఠశాల ఉంటుంది. రెసిడెన్షియల్ తరహాలో ఏర్పా టు చేసే ఈ పాఠశాలల్లో బోధనతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నా రు? టీచర్లు ఎంతమంది పనిచేస్తున్నారు? అనే విషయాలపై విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారులు నివేదిక తయారు చేశారు. పేద వర్గాలకు విద్య దూరం సమీకృత పాఠశాలల ఏర్పాటుతో ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండే అవకాశాలు కనుమరుగవుతాయి. దీంతో పిల్లలను దూరంగా పంపలేక, ఇంట్లో ఉంచుకోలేక పేద తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని విద్యారంగ నిపుణులు అంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఫలితాలు బాగున్నంత మాత్రాన అన్ని స్కూళ్లను అలా మార్చేస్తే కొత్త ఇబ్బం దులు తలెత్తుతాయంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,600 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రతి మండలంలో సుమారు 30 నుంచి 60 వరకు ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయి. క్రమేపీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తుండగా క్లస్టర్ విధానంతో వాటి మనుగడ ప్రమాదంలో పడింది. అలాగే జిల్లాలో ఉన్న 151 సంక్షేమ హాస్టల్స్ ఈ స్కూళ్ల ఏర్పాటుతో కనుమరుగుకానున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌కు వరం ప్రతి విద్యార్థికీ భోజన, వసతితో కూడిన చదువు అందించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ తరహా పాఠశాలలతో ఉపయోగం ఉన్నా... పేద వర్గాలకు నష్టం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా మండలానికి 10 క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే పిల్లలంతా ఎలాగూ అక్కడకు రారు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంలా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ విద్యాసంస్థల దెబ్బకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కుదేలయ్యాయి. ఇక ఈ విధానంతో కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి ప్రాథమిక విద్య వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. విద్యకు పేదలను దూరం చేసే పథకం ఈ విధానం ద్వారా భారీఎత్తున ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్టే. పాఠశాలలు మూసివేస్తే అక్క డ లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవంతులు, ఇతర విద్యా సామగ్రి ఏం చేస్తారు. ఇది ప్రాథమిక విద్యకు పేదలను దూరం చేసే పథకం మాత్రమే. స్కూళ్లలో సరిపడినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది. - గగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ 1938 సార్వత్రిక విద్యకు విఘాతం 1986లో ప్రవేశపెట్టిన అందరికీ విద్య విధానానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి భారం లేకుండా చేసుకొనేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మండలాన్ని యూనిట్‌గా కాకుండా ఒక గ్రామంలోని రెండు, మూడు స్కూళ్లను విలీనం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా రెండు, మూడు గ్రామాలకు ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే కష్టాలు తప్పవు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. - షేక్‌సాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ కార్పొరేట్‌కు సహకారమే గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా ప్రభుత్వమే సహకారం అంది స్తోంది. బస్‌పాస్‌లు అందించినంత మాత్రాన చిన్నారులు ఇతర గ్రామాలకు ఎలా వెళ్లగలరు? ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్లస్టర్ విధానం వల్ల డ్రాపవుట్స్ భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. - పి.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ