రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు
స్కూల్ కాంప్లెక్స్‌లు క్లస్టర్‌గా మార్పు
క్లస్టర్ స్కూల్ హెచ్‌ఎంలకే డీడీవో బాధ్యతలు
దాని పరిధిలోని అన్ని స్కూళ్లపై వారిదే పెత్తనం
పాఠశాలల రేషనలైజేషన్ చేసే యోచనలో ప్రభుత్వం
ఉపాధ్యాయ పోస్టుల కుదింపునకు రంగం సిద్ధం!
సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్ శిక్షణ, సీబీఎస్‌ఈలకు మంగళం పాడి రాష్ట్ర విద్యాశాఖ నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి సర్కారు ఇప్పుడు ఎంఈవో–2 పోస్టుల రద్దుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్‌ను క్లస్టర్‌గా మార్చి, ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు డీడీవో బాధ్యతలు అప్పగించనున్నారు. అంటే ఆ పాఠశాల పరిధిలోని (క్లస్టర్) ప్రాథమిక పాఠశాలల ఉపా«ద్యాయుల వేతనాల చెల్లింపు బాధ్యతను క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.
ప్రస్తుతం విధుల్లో ఉన్న 679 మంది ఎంఈవో–2లు తిరిగి ప్రధానోపాధ్యాయులుగా వెళ్లనున్నారు. ఎంఈవో–1కు కూడా డీడీవో బాధ్యతలు తొలగించనున్నారు. ఇక క్లస్టర్ స్కూళ్లకు సమీపంలో తక్కువ విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా క్లస్టర్ స్కూళ్లలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పలు ప్రభుత్వ స్కూళ్లు మూతబడటం, ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్లస్టర్ స్కూల్ హెచ్‌ఎంకే అజమాయిషీ
ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ, ఆయా సబ్జెక్టులపై నిపుణులైన సీనియర్ ఉపాధ్యాయుల బోధనా అంశాలపై చర్చించేందుకు స్కూల్ కాంప్లెక్స్‌లు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మండల పరిధిని బట్టి 8 నుంచి 12 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్.. కాంప్లెక్స్‌గా ఉంది. ఇలా మండలంలో 4 నుంచి 6 కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో సుమారు 35 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటారు. అయితే, ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్‌లను క్లస్టర్‌గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ క్లస్టర్ పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలల్లోని 35 మంది ఉపాధ్యాయులపై అజమాయిషీని క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు. ఎంఈవో–1కు ఉన్న వేతనాల డ్రా చేసే విధులు తొలగించి.. కేవలం మండలంలోని స్కూళ్లపై పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఉంచుతారు.
స్కూళ్ల రేషనలైజేషన్ కోసమే మార్పులు?
క్లస్టర్ విధానం ద్వారా స్కూళ్ల రేషనలైజేషన్ చేయవచ్చని ఉపాధ్యాయుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఆ క్లస్టర్ స్కూల్ పరిధిలోని ఇతర పాఠశాలల్లో తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను క్లస్టర్ స్కూల్‌లో కలిపేస్తారు. దీంతో కొన్ని స్కూళ్లు మూతబడవచ్చని టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేగాక, మూతబడే స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దు చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియకు పావులు కదుపుతోందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment