Teacher Post
-
వివాదాలు.. వాయిదాలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. గతేడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహిస్తామని తొలుత ప్రకటించి పది రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాటవేతలో అందెవేసిన కూటమి‘గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం..’ అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం..గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తై జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి పూర్తికాలం శిక్షణ పొందుతున్నారు. ఇక గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్ కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. గత నెలలో చైర్మన్‌గా ఏఆర్ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో జనవరి 5న మెయిన్స్ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు. తీరా పది రోజులు గడవకుండానే మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ‘త్వరలో’..అంటే ఎప్పుడు?గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలివారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, మంత్రి చెబుతున్న ‘త్వరలో’ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
ఎంఈవో–2 పోస్టులకు గుడ్‌బై!
సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈలకు మంగళం పాడి రాష్ట్ర విద్యాశాఖ నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి సర్కారు ఇప్పుడు ఎంఈవో–2 పోస్టుల రద్దుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్‌ను క్లస్టర్‌గా మార్చి, ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు డీడీవో బాధ్యతలు అప్పగించనున్నారు. అంటే ఆ పాఠశాల పరిధిలోని (క్లస్టర్) ప్రాథమిక పాఠశాలల ఉపా«ద్యాయుల వేతనాల చెల్లింపు బాధ్యతను క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.ప్రస్తుతం విధుల్లో ఉన్న 679 మంది ఎంఈవో–2లు తిరిగి ప్రధానోపాధ్యాయులుగా వెళ్లనున్నారు. ఎంఈవో–1కు కూడా డీడీవో బాధ్యతలు తొలగించనున్నారు. ఇక క్లస్టర్ స్కూళ్లకు సమీపంలో తక్కువ విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా క్లస్టర్ స్కూళ్లలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పలు ప్రభుత్వ స్కూళ్లు మూతబడటం, ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ స్కూల్ హెచ్ఎంకే అజమాయిషీ ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ, ఆయా సబ్జెక్టులపై నిపుణులైన సీనియర్ ఉపాధ్యాయుల బోధనా అంశాలపై చర్చించేందుకు స్కూల్ కాంప్లెక్స్‌లు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మండల పరిధిని బట్టి 8 నుంచి 12 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్.. కాంప్లెక్స్‌గా ఉంది. ఇలా మండలంలో 4 నుంచి 6 కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో సుమారు 35 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటారు. అయితే, ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్‌లను క్లస్టర్‌గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ క్లస్టర్ పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలల్లోని 35 మంది ఉపాధ్యాయులపై అజమాయిషీని క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు. ఎంఈవో–1కు ఉన్న వేతనాల డ్రా చేసే విధులు తొలగించి.. కేవలం మండలంలోని స్కూళ్లపై పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఉంచుతారు. స్కూళ్ల రేషనలైజేషన్ కోసమే మార్పులు? క్లస్టర్ విధానం ద్వారా స్కూళ్ల రేషనలైజేషన్ చేయవచ్చని ఉపాధ్యాయుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఆ క్లస్టర్ స్కూల్ పరిధిలోని ఇతర పాఠశాలల్లో తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను క్లస్టర్ స్కూల్లో కలిపేస్తారు. దీంతో కొన్ని స్కూళ్లు మూతబడవచ్చని టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేగాక, మూతబడే స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దు చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియకు పావులు కదుపుతోందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. -
టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి గారి అబద్దాలు
-
తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ వెవువడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. చదవండి: గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు -
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్‌కుమార్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
పైరవీ ‘సార్ల’దే రాజ్యం!
►కరీంనగర్ నుంచి మేడ్చల్‌లోని ఓ స్కూల్‌కు ఓ టీచర్‌ను పైరవీతో బదిలీ చేశారు. నిజానికి ఆ టీచర్ సోషల్ సబ్జెక్టు చెప్పే టీచర్. కానీ ఆ స్కూల్లో ఆ సబ్జెక్టులో ఖాళీల్లేవు. ఇలాంటప్పుడు ఖాళీల్లేవని తిప్పి పంపాలి. కానీ ఖాళీ ఉన్న ఇంగ్లిష్ పోస్టులో ఇరికించేశారు. ఇదే జిల్లాలో మరో రెండు బడుల్లో సోషల్ సబ్జెక్టు పోస్టుల్లో ఇతర సబ్జెక్టు టీచర్లను తెచ్చారు. ►బదిలీల షెడ్యూల్ వెలువడకుండానే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన టీచర్‌ను హయత్ నగర్ మండలానికి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ.10 లక్షలు చేతులు మారినట్టు తెలిసింది. మరో టీచర్ నారాయణ పేట నుంచి మేడ్చల్ జిల్లాకు రూ.8 లక్షలు మధ్యవర్తి ద్వారా ఇచ్చి బదిలీ చేయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో ఇలా పైరవీలకు పెద్దపీట వేయడం టీచర్లలో కలకలం రేపుతోంది. ఒకవైపు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తూనే, మరోవైపు అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇవ్వడంపై గగ్గోలు పెడుతున్నారు. ఇది ప్రక్రియను ఆపహా స్యం చేయడమేనని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 200 మందిని నిబంధనలకు విరుద్ధంగా వాళ్లు కోరుకున్న స్కూళ్లకు పోస్టింగ్ ఇచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. నేరుగా ప్రభుత్వపెద్దల నుంచే సిఫార్సు లు వస్తున్నాయని, వాటిని ఉన్నతాధికారులు సంబంధిత డీఈవోలకు పంపుతున్నారని అంటున్నారు. డీఈవోలు ఏకంగా పోస్టింగ్ ఆర్డర్లే ఇచ్చేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా, పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలోకి ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ఇందుకేనా 317 జీవో... ప్రభుత్వం 317 జీవో ద్వారా దాదాపు 25 వేల మందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా వారికి అన్యాయం జరిగినట్టు చెబుతున్నారు. స్థానికత ఎంపిక సందర్భంగా కొత్త జిల్లాల్లో అర్బన్ ప్రాంతాల్లో పోస్టులను చూపించకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం వాటిని చూపించినా సీనియారిటీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లను కొంతమంది టీచర్లు ఎంచుకునే వీలుంది. ఇప్పుడు బదిలీకి ఏ స్కూల్లోనైనా రెండేళ్లు పనిచేసి ఉండాలి. కాబట్టి 317 జీవో ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే అవకాశమే లేదు. పట్టణ ప్రాంతాల్లో బడులను బ్లాక్ చేయడంతో తిరిగి ఇప్పుడు నచ్చినవారికి పోస్టులు ఇచ్చుకునే వీలుకలుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన కూడా... ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో నిమగ్నమై ఉన్న రోజు కూడా ఏకంగా ఏడు పైరవీ బదిలీలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీళ్లంతా పట్టుమని 30 కి.మీ. దూరం కూడా లేని బడుల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలతో ఇవన్నీ జరిగినట్టు చెబుతున్నారు. దీంతో తామేమీ చేయలేకపోతున్నామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకూ ముడుపులు ముడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ బదిలీలను రద్దు చేయాలి: చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైరవీలతో బదిలీలు చేయడమంటే ప్రక్రియను అపహాస్యం చేయడమే. నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలను అనుమతిస్తే ఉపాధ్యాయ వృత్తికే కళంకం ఏర్పడుతుంది. ఈ బదిలీలను రద్దు చేయాలి. లక్షల్లో బేరసారాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో పోస్టింగుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా మధ్యవర్తులు టీచర్లతో బేరాలు కుదుర్చుకుని ఒక్కో పోస్టుకు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బేరం కుదిరిన వెంటనే టీచర్లకు మాత్రం కోరు కున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు వస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి బదిలీ కోసం దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. కానీ కొంతమందికి షెడ్యూల్ విడుదల కాకముందే పోస్టింగ్‌లు వస్తే... మరికొంత మందికి బదిలీలకు దరఖాస్తు గడువు ముగియకుండానే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు బదిలీ చేసినా ఏప్రిల్ తర్వాతే రిలీవ్ చేస్తామని షెడ్యూల్లో స్పష్టంచేసినా... పైరవీల టీచర్లు మాత్రం కొత్త ప్రాంతాల్లో చేరిపోతున్నారు. -
డీఎస్సీ సిలబస్ కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల వారీగా పరిగణనలోకి తీసుకునే సిలబస్ ఖరారు దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), పండిట్ పోస్టులకు సంబంధించిన సిలబస్‌ను టీఎస్పీఎస్సీకి అందజేసిన విద్యాశాఖ... బుధవారం పీఈటీ పోస్టులతోపాటు మరో కేటగిరీకి చెందిన పోస్టుల సిలబస్‌ను కూడా అందించినట్లు తెలిసింది. దీనిపై విద్యా శాఖ అధికారులు, టీఎస్పీఎస్సీ అధికారులు పరిశీలన చేపట్టారు. దీంతో సిలబస్ ఖరారుపై కసరత్తు దాదాపు ముగింపునకు వచ్చింది. ‘తెలంగాణ’పై ప్రత్యేక అంశాలు గత డీఎస్సీల్లో ఇచ్చిన తరహాలోనే సిలబస్‌ను ఖరారు చేస్తున్నా.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలిసింది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని పాఠశాలల సిలబస్‌లో మార్పులు చేసి.. తెలంగాణకు సంబంధించిన అంశాలను చేర్చారు. ముఖ్యంగా తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో... తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జిల్లాలు, చారిత్రక అంశాలు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమం, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రముఖులు తదితర చాలా అంశాలను జోడించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీలో ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగే అవకాశమున్నట్లు సమాచారం. గురుకులాల్లోని టీజీటీ పోస్టులకు నిర్వహించిన తరహాలో కాకుండా.. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ)ను ఒకే పేపర్‌గా 160 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహించే అవకాశముంది. పోస్టులు, రోస్టర్ పాయింట్లపైనా.. విద్యా శాఖ ఇప్పటికే 31 జిల్లాల వారీగా పోస్టులు, వాటి రోస్టర్ పాయింట్ల వివరాలను టీఎస్పీఎస్సీకి అందజేసింది. వాటిపైనా విద్యాశాఖ, టీఎస్పీఎస్సీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈ ప్రక్రియ కూడా కొలిక్కి వస్తుండటంతో నోటిఫికేషన్ జారీకి సంబంధించి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య నోటిఫికేషన్ జారీచేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎంచుకునే అవకాశం అభ్యర్థికే కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యం లో.. జిల్లాల వారీగా అభ్యర్థుల స్థానికతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత జిల్లా పరిధిలోని అభ్యర్థి పుట్టిన గ్రామం, చదువుకున్న ప్రాంతాలు వేర్వేరు కొత్త జిల్లాల పరిధిలోకి వస్తే.. ఎక్కడ స్థానికత కావాలనేదానిపై అభ్యర్థులకే అవ కాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పుట్టిన గ్రామం, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతం.. ఈ రెండింటిలో అభ్యర్థి తనకు ఇష్టమైన జిల్లాలో స్థానికుడిగా క్లెయిమ్ చేసుకునే అవకాశమివ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ నెల 23న సుప్రీంకోర్టులో కేసు విచారణకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 23వ తేదీకంటే ముందే డీఎస్సీ నోటిఫి కేషన్ జారీ చేసి.. ఆ నోటిఫికేషన్ కాపీని కోర్టుకు సమర్పించవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
దసరాలోగా ‘గురుకుల’ ఫలితాలు
► నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్! ► సన్నద్ధమవుతున్న టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గురుకుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు దసరాలోపు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందనందున.. ఆ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు పదిహేను, ఇరవై రోజుల సమయం పట్టవచ్చని సమాచారం. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇటీవలే పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున.. త్వరగానే ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా కసరత్తు జరుగుతోందని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షల ఫలితాలన్నీ నెలాఖరులోగానే వెల్లడించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాయి. విద్యా శాఖ నుంచి సమాచారం కోసం.. 8,452 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే సంబంధిత పోస్టుల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, స్థానికత నిబంధనలు తదితర సమాచారం విద్యా శాఖ నుంచి రావాలని.. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీకి కసరత్తు మొదలవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం అందించేందుకు విద్యా శాఖకు కనీసం వారం పట్టవచ్చని.. ఆ తర్వాతే సిలబస్ ఖరారు, మార్గదర్శకాలు, అర్హతలను నిర్ధారించాల్సి ఉంటుందని వివరించాయి. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలాఖరులోగానీ అక్టోబర్‌లో గానీ వెలువడే అవకాశముందని పేర్కొన్నాయి. -
31న టీచర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు
హాజరుకానున్న 1.25 లక్షల మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీజీటీ, పీజీటీ రెండింటికి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా కాకుండా ఒకటే హాల్‌టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తున్నామని, మెయిన్ పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు 1.25 లక్షల మంది హాజరుకానున్నట్లు తెలిపింది. ఇక పీజీటీ, టీజీటీ తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పోస్టులకు వచ్చే నెల 14న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు వివరించింది. త్వరలోనే హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 040–23120301, 040–23120302 నంబర్లలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని వెల్లడించింది. -
‘ఉపాధ్యాయ’ మార్గదర్శకాలపై కమిటీ!
►ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు నిర్ణయం ►నియామక అర్హతలు, నిబంధనలపై పరిశీలన ►అభ్యర్థులకు తరగతిలో ‘డెమో’ బోధన పరీక్ష! ►ఈ అంశాలన్నింటినీ పరిశీలించనున్న కమిటీ ►కమిటీ ప్రతిపాదనల పరిశీలన అనంతరమే నోటిఫికేషన్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీ అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి ప్రాథమిక అంచనాకు వచ్చిన విద్యాశాఖ.. నియామకాలపై మార్గదర్శకాల రూపకల్ప నకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్ నిర్ణయించారు. ఇటీవల గురుకుల పోస్టుల భర్తీకి నిర్ణయించిన నిబం ధనలు వివాదాస్పదం కావడం, ఆ నోటిఫికే షన్ను రద్దు చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీకి పక్కాగా నిబంధనలను రూపొందించనున్నారు. దీనిపై కిషన్ గురువారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డితో చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించే అవకాశముంది. జాతీయ ఉపాధ్యాయ నిబంధనల మేరకే.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీకి అర్హతలను నిర్ణయిస్తామని ఈ సందర్భంగా కిషన్ వెల్లడించారు. ఇప్పటికే కేటగిరీల వారీగా పోస్టులకు ఉండాల్సిన అర్హతలను ఎన్సీటీఈ స్పష్టంగా నోటిఫై చేసిందని, వాటి ప్రకారం రాష్ట్రంలో నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. డెమో బోధన, ఇంటర్వూ్య? టీచర్ నియామకాల్లో తరగతి బోధనపై డెమో (ప్రత్యక్షంగా బోధించి చూపడం) విధానం ఉంటే బాగుంటుందని విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు టీచర్లకు బోధించడం సరిగా రావడం లేదని విద్యాశాఖ ఇప్పటికే గుర్తించింది. అయితే రాష్ట్రంలో సుమారు 8 వేల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి డెమో నిర్వహించా లనుకున్నా.. వేల మంది అభ్యర్థులకు డెమో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యమేనా, కాదా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. మరోవైపు డెమో కాకపోతే ఇంటర్వూ్యలైనా నిర్వహించాలన్న యోచన చేస్తున్నారు. ఈ అంశాలన్నింటిని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. నియామకమైన తర్వాతా శిక్షణ! టీచర్లుగా నియమితులైన వారికి జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో పొందుపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించాలన్న యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించాలా, వద్దా? అన్న అంశాన్నీ ఉన్నత స్థాయి కమిటీ తేల్చనుంది. మొత్తంగా అర్హతలు, నిబంధనలపై ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలు ఇచ్చిన అనంతరం.. వాటిపై తుది నిర్ణయం తీసుకున్నాకే టీచర్ల భర్తీ నోటిఫికేషన్ జారీ కానుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించిన మేరకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని టీఎస్ పీఎస్సీకే అప్పగించనున్నారు. గతంలో జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసేవారు. ఇప్పుడు టీఎస్పీ ఎస్సీకి అప్పగిస్తున్నందున కొత్త నిబంధనలు రూపొందించాల్సిన అవసరముంది. అందు వల్లే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. -
ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వ మెమో జారీ మచిలీపట్నం: ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 4వ తేదీన మెమో నం.18,836ను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో 2015 జనవరి 6వ తేదీ, 2015 సెప్టెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2004 అక్టోబర్ 20వ తేదీ నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల నియామకాన్ని చేపట్టవచ్చని పేర్కొన్నారు. అయితే దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల నియామకంపై నిషేధం ఉంది. ఈ మధ్యకాలంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయటంతో ఎయిడెడ్ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
పాన్‌గల్: జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని టీపీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చింతకుంట, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కల్వరాల, కేతేపల్లి, పాన్‌గల్ ఉన్నత పాఠశాలల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో 2048 ఖాళీ పోస్టులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం 2200 కలిపి మొత్తం 4248 ఉపాధ్యాయ పోస్టులు అవసరమవుతాయన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్, పీఆర్సీ బకాయిలు, పదోన్నతులు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన తదితర సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు విష్ణు, నాగేశ్వర్‌రెడ్డి, నాగరాజు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఏజెన్సీ సర్టిఫికెట్‌కు రూ. 10 వేలు ?
ఉపాధ్యాయులకు ఏజెన్సీ సర్టిఫికెట్ల గుబులు ఏటూరునాగారం : ఏజెన్సీలో ఉపాధ్యాయుల పోస్టు పొందాలంటే ఏజెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయ పోస్టులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొంత మంది నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను పొందారని తెలుస్తోంది. ఐటీడీఏలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేసి నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను తయారు చేసి అభ్యర్థులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ విభాగంలో కలకలం రేపిన తప్పుడు నిబంధనల ఉపాధ్యాయుల నియామకం విషయంలో కూడా ఏజెన్సీ సర్టిఫికెట్లు నకిలీవి ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీల సరిఫికెట్లుగా గుర్తించే డీఎల్సీ కమిటీ డీఎస్సీ- 2013 ఎంపిక జాబితాను రద్దు చేసింది. అయితే కొంత మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో డీటీల ద్వారా చేయించారు. వెరిఫికేషన్ చేయించి ఇవి నకిలీలు కావని, అసలు సర్టిఫికెట్లే అని ధ్రువీకరించి గిరిజన సంక్షేమశాఖకు అందజేశారు. ఒక్కసారి ఒక అభ్యర్థి సర్టిఫికెట్ డుప్లికేట్ అని తేలిన తర్వాత అతడు ఏజెన్సీవాసుడే అని ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం బాధాకరం. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన వ్యక్తులు, ఇందుకు సహకరించిన ఉద్యోగస్తులపై కూడా చర్యలు చేపట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలి ఆగబోయిన రవి, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి. గిరిజన సంక్షేమశాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు చేపట్టాలి. -
ఏజెన్సీ సర్టిఫికెట్‌కు రూ. 10 వేలు ?
ఉపాధ్యాయులకు ఏజెన్సీ సర్టిఫికెట్ల గుబులు ఏటూరునాగారం : ఏజెన్సీలో ఉపాధ్యాయుల పోస్టు పొందాలంటే ఏజెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయ పోస్టులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొంత మంది నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను పొందారని తెలుస్తోంది. ఐటీడీఏలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేసి నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను తయారు చేసి అభ్యర్థులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ విభాగంలో కలకలం రేపిన తప్పుడు నిబంధనల ఉపాధ్యాయుల నియామకం విషయంలో కూడా ఏజెన్సీ సర్టిఫికెట్లు నకిలీవి ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీల సరిఫికెట్లుగా గుర్తించే డీఎల్సీ కమిటీ డీఎస్సీ- 2013 ఎంపిక జాబితాను రద్దు చేసింది. అయితే కొంత మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో డీటీల ద్వారా చేయించారు. వెరిఫికేషన్ చేయించి ఇవి నకిలీలు కావని, అసలు సర్టిఫికెట్లే అని ధ్రువీకరించి గిరిజన సంక్షేమశాఖకు అందజేశారు. ఒక్కసారి ఒక అభ్యర్థి సర్టిఫికెట్ డుప్లికేట్ అని తేలిన తర్వాత అతడు ఏజెన్సీవాసుడే అని ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం బాధాకరం. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన వ్యక్తులు, ఇందుకు సహకరించిన ఉద్యోగస్తులపై కూడా చర్యలు చేపట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలి ఆగబోయిన రవి, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి. గిరిజన సంక్షేమశాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు చేపట్టాలి. -
తమ్ముళ్లకోసం...
రేషన్ షాపుల విభజనకు సన్నాహాలు ఇప్పటికే నాలుగు షాపుల ఏర్పాటు ప్రతీ 450 రేషన్ కార్డులకూ ఓ రేషన్‌షాపు విజయనగరం కంటోన్మెంట్: ఉపాధ్యాయ పోస్టుల కుదింపుకోసం రేషన్లైజేషన్ పేరుతో పాఠశాలలను తగ్గించేస్తున్న సర్కారు... తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు రేషన్ షాపులను విడదీసే యత్నానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే స్థానిక అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో కొన్ని షాపులను విభజించి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా షాపుల విభజనకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలోనే మునిసిపాలిటీల పరిధిలోని రేషన్ షాపులను విభజించాలన్న ఆదేశాలున్నప్పటికీ ఆ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ప్రతి 450కార్డులకు ఓ రేషన్‌షాపు జిల్లాలో 1390 రేషన్ షాపులున్నాయి. అన్నపూర్ణ కార్డులు 839, అంత్యోదయ 76,009, తెల్ల కార్డులు 6,01,987 ఉండగా వీటి పరిధిలో 17,79,516 మంది వినియోగదారులున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్కో రేషన్ షాపు పరిధిలోనూ రెండు వందల నుంచి పదమూడు వందల రేషన్ కార్డుల వరకూ ఉన్నాయి. వీటిని విభజించి ప్రతీ 450 నుంచి 500 రేషన్ కార్డులకు ఓ రేషన్ షాపును ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇదేదో పరిపాలనా సౌలభ్యం కోసమో లేక వినియోగ దారులకు మేలయిన పంపిణీ కోసమో అనుకుంటే పొరపాటే! కేవలం తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పన కోసమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నాయకులు, సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు అధికారులు ఈ విభజన ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్ సంగతి తేల్చకుండానే... కమీషన్ పెంపుపై ఎలాంటి ప్రకటన చేయకుండా ఇప్పుడిలా రేషన్ షాపుల విభజనను చేపట్టేందుకు నిర్ణయించడం దారుణమని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో ఉన్న రేషన్ షాపుల్లో తెలుగుదేశం పార్టీ అనుచరులున్న షాపులను వదిలేసి ఇతర షాపులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతం లో హుద్‌హుద్ తుఫాన్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సక్రమంగా సరుకులు పంపిణీ చేయలేదంటూ సుమారు 16 మంది రేషన్ డీలర్లను సస్పెండ్‌చేసి వారి స్థానాల్లో తెలుగుదేశం నాయకుల బంధువులను నియమించిన విషయం వారు గుర్తు చేస్తున్నారు. చాలా చోట్ల టెంపరరీగా తెలుగు తమ్ముళ్లే ఇప్పటికీ ఆయా షాపులను నడిపిస్తున్నారు. దీనిపై ఇంకా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకే తమను బలిపశువులను చేశారని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలతో విభజిస్తున్నారు మాకు ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు రేషన్ షాపులను విభజిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం ఒత్తిడి చేస్తే అధికారులు వంతపా డటం దారుణం. దీనిని మేం ఖండిస్తున్నాం. డీలర్ల కు ప్రతీ నెలా కుటుంబ పోషణకు ఆదాయం వచ్చే లా చేసి వారికి నచ్చినట్టు చేసుకోమనండి! అంతే కానీ డీలర్ల పొట్ట కొడితే మాత్రం ఖబడ్దార్ ! ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. - సముద్రపు రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం, విజయనగరం. -
సీఎం వద్దకు డీఎస్సీ ఫైలు!
♦15,628 టీచర్ పోస్టులతో ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ ♦సీఎం ఆమోదం రాగానే ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ ♦నియామక పరీక్షను ఎవరికి అప్పగించాలనే దానిపై స్పష్టత కోరిన అధికారులు ♦నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,628 ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలకు సంబంధించిన ఫైలు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు రాతపరీక్ష (టీఆర్టీ) నిర్వహణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయాన్ని కూడా తేల్చాలని ప్రతిపాదనల్లో కోరినట్లు తెలిసింది. గతంలో భావించినట్లుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) టీఆర్టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలా, జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో నిర్వహించాలా అన్నది తేల్చాలని పేర్కొంది. నియామకాల ఫైలు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా తగ్గిపోతున్న పోస్టులు 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖవర్గాలు చెప్పాయి. తర్వాత హేతుబద్ధీకరణ పేరిట 2015కు వాయిదా వేశాయి. ఆ సమయంలో ఉద్యోగుల లెక్కలు తీసినపుడు దాదాపు 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విభజన కమిటీ తేల్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించాక హేతుబద్ధీకరణ జరిగింది. అప్పుడు దాదాపు 17 వేల ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. కనీసం ఈ పోస్టుల భర్తీకైనా వెంటనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు భావించారు. కానీ అదీ జరగలేదు. 2015 చివరలోనో, 2016 జనవరిలోనో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని భావించారు. అదే సమయంలో నవ ంబర్ 16న టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఎన్నికలు, ఇతర కారణాలతో అదీ వాయిదా పడింది. మరోవైపు అధికారులు మరోసారి హేతుబద్ధీకరణ చేయగా... పోస్టుల సంఖ్య తెలుగు మీడియంలో 10,927, ఉర్దూ మీడియంలో 1,215కు పడిపోయింది. వీటితోపాటు గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నవాటిని కలుపుకొని మొత్తం 15,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్క వేసింది. వీటి భర్తీకి జనవరి 2న కేబినెట్ కూడా ఆమోదముద్ర వేయడంతో... వెంటనే టెట్ నోటిఫికేషన్, ఏప్రిల్ నెలాఖరుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసి, మళ్లీ ఆపేశారు. ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో... ఎట్టకేలకు ఈనెల 15 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతోపాటే టీఆర్టీ నిర్వహణపై తేల్చాలని సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎలాంటి వాయిదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వారు కోరుతున్నారు. రెండేళ్లుగా వాయిదాలు రాష్ట్రంలో 2013 నుంచి ఉపాధ్యాయ నియామకాల వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ శిక్షణ పొందుతున్నారు. వాస్తవానికి 2013లో నోటిఫికేషన్ వస్తుందని భావించినా, రాష్ట్ర విభజన, ఆందోళనల నేపథ్యంలో నోటిఫికేషన్‌ను నిలిపివేయడంతో నియామకాల ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత త్వరలోనే డీఎస్సీ అంటూ, ఇంకా సమయం పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల విరుద్ధ ప్రకటనలతో వారంతా ఆందోళనలో మునిగిపోయారు. -
చిరు తప్పిదం.. భారీ మూల్యం
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల్లో ఓఎమ్మార్ షీట్లలో దొర్లిన పొరపాట్లు అభ్యర్థుల కొంపముంచాయి. బబ్లింగ్ (గడులు నింపడం) చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా అనేక మందికి మార్కులు తారుమారయ్యాయి. ఫైనల్ ‘కీ’లోని సమాధానాల ఆప్షన్లను పరిశీలించుకొని అంచనా వేసుకున్న మార్కులకు ఫలితాల వెల్లడిలో వచ్చిన మార్కులకు మధ్య వ్యత్యాసం ఉండడంతో అభ్యర్థులు గగ్గోలుపెడుతున్నారు. ఓఎమ్మార్ షీట్లలో సమాధానాల ఆప్షన్లను నింపడంలో అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణను అధికారులు వినిపిస్తున్నారు. ఓఎమ్మార్ షీట్లలోని ఆప్షన్ల గడులను గతంలో పెన్సిల్‌తో నింపే పద్ధతి ఉండగా వాటిని స్కానింగ్ యంత్రాలు సరిగా గుర్తించలేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దీంతో పెన్సిల్‌కు బదులు పెన్నుతో నింపే విధానాన్ని ప్రవేశ పెట్టారు. నిర్ణీత ప్రశ్నకు సమాధానంగా గుర్తించిన ఆప్షన్‌కు ఇచ్చిన గడిలోపల మాత్రమే పూర్తిగా నింపాల్సి ఉంటుంది. అప్పుడే స్కానింగ్ యంత్రం దాన్ని మూల్యాంకనం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గడిని దాటి బయటకు వస్తే స్కానింగ్ యంత్రం దాన్ని స్వీకరించదు. ఇతర ఏ గుర్తులు పెట్టినా, గడుల బయట వేరే మార్కింగ్‌లు చేసినా స్కానింగ్ కాదు. ఈ విషయాలను స్పష్టంగా వివరిస్తూ ఓఎమ్మార్ షీటు వెనుక, అలాగే అభ్యర్థులకు ఇచ్చిన బుక్‌లెట్‌లోనూ పొందుపరిచామని, వాటిని అభ్యర్థులు పూర్తిగా పాటించాల్సి ఉందన్నారు. ఇవేవీ చూసుకోకుండా కొంతమంది గడులను ఇష్టానుసారంగా నింపేశారని చెబుతున్నారు. 50వేలకు పైగా ఓఎమ్మార్ పత్రాల్లో ఇలాంటి తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు. సిరీస్‌ను గుర్తుపెట్టని అభ్యర్థులు దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లలో తాము ఏ సిరీస్ ప్రశ్నపత్రానికి సమాధానాలు గుర్తిస్తున్నారో తెలియచేసే గడులను పూరించకుండా వదిలేశారు. ఇలాంటి వాటిని తిరిగి పరిశీలింపచేసి ఏ కేంద్రంలో ఏ టేబుల్‌కు ఆ ఓఎమ్మార్ పత్రం వెళ్లింది? అక్కడ ఏ సిరీస్ ప్రశ్నపత్రం ఇచ్చిందీ పరిశీలించి ఆమేరకు మళ్లీ స్కానింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువమంది ఓ గడిని దాటి రెండో గడిని తాకేలా మార్కు చేశారు. వాటిని స్కానింగ్ యంత్రాలు స్కాన్ చే సి ఉండకపోవచ్చని వివరిస్తున్నారు. అభ్యర్థులు చేసిన పొరపాట్ల కారణంగా ఓఎమ్మార్ షీట్లను స్కానింగ్ యంత్రాలు మూల్యాంకనం చే యకపోవడానికి విద్యాశాఖ బాధ్యత వహించబోదని స్పష్టం చేస్తున్నారు. -
టీచర్ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లేనట్లే!
ఓపెన్ కోటా ఏపీలోని జిల్లాలకే పరిమితం? ఉన్నతాధికారులతో చర్చించాక తుది నిర్ణయం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీలో చేపట్టనున్న ఉపాధ్యా య నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే ఈ ఓపెన్ కోటాను పరిమితం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. తెలంగాణ ప్రాంతం వేరే రాష్ట్రం కావడంతో అక్కడి వారిని ఈ పోస్టులకు అనుమతించరు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం సున్నితమైనది కావడంతో నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీచర్ పోస్టుల నియామకంపై మంగళవారం ఇవ్వనున్న నోటిఫికేషన్లో ఈ అంశాన్ని పొందుపరచడం లేదని తెలుస్తోంది. ప్రాధమిక విద్యాశాఖ డైరక్టరేట్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచే ఆన్లైన్ దరఖాస్తుల్లో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక కాలమ్‌లను పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ కాలమ్‌ల ఆధారంగా ఏపీలోని 13 జిల్లాల వారికే ఈ పోస్టులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నియామకాల సమయంలో ఓపెన్ కోటా భర్తీపై న్యాయపరమైన సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు చేపడుతున్నారు. నేరుగా స్పష్టం చేస్తే ఇబ్బందికరమే... పోస్టులను ఏపీకే పరిమితం చేస్తే ఇతర రాష్ట్రాల వారి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం వారికి అవకాశం దక్కదు. దీన్ని నోటిఫికేషన్లోనే పెడితే ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదంగా మారుతుందని ప్రభుత్వ ముఖ్యులు భావి స్తున్నారు. ఏపీ విద్యా మంత్రి సూచనల మేరకు సాధారణ పరిపాలనా కార్యదర్శి పాణిగ్రాహి దీనిపైపై ప్రత్యేక నోట్‌ను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకు సోమవారం సమర్పించారు. ‘‘ఇప్పటివరకు ఓపెన్ కోటాపై తుది నిర్ణయానికి రాలేదు. బుధవారం ఉన్నతాధికారులతో చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వి.ఉషారాణి వివరించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని 9,061 పోస్టులతోపాటు మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన 1,252 పోస్టులనూ ఈ డీఎస్సీలోనే భర్తీచేయనున్నామన్నారు. పోస్టుల వివరాలు, ఇతర సమాచారాన్ని ‘‘హెచ్‌టీటీపీ://ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’’ అనే పొందుపరిచినట్లు వివరించారు. -
పాఠాలు చెప్పేవారేరి..!
- జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ - రెండేళ్లుగా నియామకాలు నిల్ - కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయ నియామకాలపై సందిగ్ధత గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల నుంచి కొత్తగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీకి నోచుకున్నది లేదు. ప్రతీ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ నాలుగేళ్లయినా దానిని అమలు పరిచిన దాఖలాలు జిల్లాలో లేవు. రెండేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతోంది. ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఖాళీలు పేరుకుపోతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వెనకాడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో వందలాది ఎస్జీటీ పోస్టులు పేరుకుపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. ఉన్నత పాఠశాలల్లో సైతం సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా మారడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ వేసవి సెలవులను సరదాగా గడిపి భవితపై కోటి ఆశలతో మళ్లీ పాఠశాలల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ చేయగా, మళ్లీ ఇప్పటివరకూ ఉపాధ్యాయ నియామకాల ఊసే లేదు. ఫలితంగా రెండేళ్లుగా నూతన నియామకాలు, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి. కేటగిరీ వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులు జిల్లాలోని 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం-50 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-300, ఎస్జీటీ పోస్టులు-577 సహా భాషా పండిత, పీడీ, పీఈటీ పోస్టులు-62 భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత రెండేళ్ళుగా డీఎస్సీ నిర్వహణపై దృష్టి సారించని ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆర్నెల్లకోసారి నిర్వహిస్తూ వచ్చింది. సాధారణంగా టెట్ పరీక్ష తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సిండగా, రెండేళ్ళుగా టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులే వేల సంఖ్యలో ఉన్నారు. గత మార్చిలో జరిగిన టెట్‌కు జిల్లాలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు 19,496 మంది హాజరయ్యారు. టెట్‌లో అర్హత సాధించిన నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఉపాధ్యాయ కొలువులపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ ఏడాదిలోనైనా డీఎస్సీ ప్రకటన వస్తుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొంది. -
బడికి వేళాయె..
నేడు పాఠశాలల పునఃప్రారంభం - సర్కారు బడులకు సమస్యల స్వాగతం - వేధిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు - పర్యవేక్షణకు ఎంఈవోలు కరువు - మూలపడిన కంప్యూటర్లు ఖమ్మం : వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అయితే పుస్తకాలు, నోట్‌బుక్‌లకు పెరిగిన ధరలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరానికి ఆ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. వెంటాడుతున్న ఖాళీల కొరత... విద్యాశాఖను ఖాళీల కొరత వెంటాడుతోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 3,336 ఉండగా ఇందులో 1624 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 68 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు. అక్కడ ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. ఇక 686 పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఏ కారణంగానైనా ఆ టీచర్ బడికి రాకుంటే ఆరోజు అనధికారిక సెలవు ప్రకటించినట్లే. అలాగే జిల్లాలోని 46 మండలాలకు గాను 41 మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అటు ప్రధానోపాధ్యాయుడి విధులు, ఇటు ఎంఈవో విధులలో ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేక వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలోని నాలుగు డిప్యూటీ ఈవోల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులపై పర్యవేక్షణ కొరవడంతో పలు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు పాఠశాలల్లో స్వీపర్లు లేక, ఉన్నచోట వారికి సకాలంలో వేతనాలు అందక పోవడంతో పాఠశాలలు ఊడ్చడం, నీళ్లు తెచుకోవడం వంటి పనులు విద్యార్థులే చేయాల్సిన దుస్థితి నెలకొంది. వీటికి తోడు నిత్యం ఏదో సమస్యలతో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన, దశాబ్దాల తరబడి కార్యాలయాల్లో తిష్టవేసిన వారు ఉన్నతాధికారులు చెప్పిన మాటలు వినకుండా వారి కోటరీని కొనసాగించడం, నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయడం వంటి కారణాలతో పాఠశాలల పనితీరు అధ్వానంగా మారింది. ఇకపోతే ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పదోన్నతి గొడవలూ ఓ కొలిక్కి రాలేదు. వీటిని చక్కదిద్దేందుకే డీఈవో సమయం అంతా సరిపోతోంది. మరోవైపున పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాల ఉపాధ్యాయుల, విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. అక్కడి ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేయాలా.. ఆంధ్రలోకి వెళ్లాలా అనేది ఇప్పటివరకూ తేల్చలేదు. సమస్యల వలయంలో సర్కారు బడులు... రాజీవ్ విద్యామిషన్, ఆర్ఎంఎస్ఏతోపాటు ఇతర పాఠశాల గ్రాంట్లు కోట్ల రూపాయలు వస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలకు నిలయాలుగానే విరాజిల్లుతున్నాయి. 2012-13, 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1500 అదనపు తరగతి గదులు కావాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరారు. దీంతో జిల్లాకు రూ. 38.78 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 1358 గదుల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి పనులు నేటికీ మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా సకాలంలో భవనాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఈ విద్యా సంవత్సరానికి మరో 526 అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో మంజూరైన వాటినే పూర్తిచేయని అధికారులు కొత్తవాటి నిర్మాణానికి ఇంకెంత కాలం గడుపుతారోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల భవనాలు లేక పూరిగుడిసెలలోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిలో తాగునీటి వసతి లేదు. మరికొన్ని పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేక, కొన్ని చోట్ల బోధించేవారు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఇలా అనేక ప్రాంతాలలో పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి ఈ ఏడాదైనా విద్యాశాఖ గాడిన పడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. -
అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
కడప కలెక్టరేట్ : అంగన్వాడీ టీచర్ పోస్టులకు మంగళవారం అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జిల్లాలో 20 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ కేంద్రాల్లో ఆయాలుగా పనిచేస్తూ పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, 45 సంవత్సరాల్లోపు వయస్సున్న వారితో ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు మహిళలు తరలివచ్చారు. అర్హులను ఎంపిక చేయడానికి వీలుగా వారి అర్హతలను ఏజేసీ పరిశీలించారు. ఐసీడీఎస్ పీడీ లీలావతి పాల్గొన్నారు. -
ఏజెన్సీలో కొలువుల జాతర
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన గిరిజన అభ్యర్థులకు శుభవార్త.. ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 ఐటీడీఏల పరిధిలో 2,825 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వగా.. అందులో భద్రాచలం ఐటీడీఏకు 659 పోస్టులు కేటాయించింది. సున్నంవారిగూడెం గిరిజన డిక్లరేషన్‌లో భాగంగా ఈ పోస్టులకు అనుమతి ఇస్తూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ మంగళవారం జీవో 233 పేరిట ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఐటీడీఏ అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. స్పెషల్ డీఎస్సీ -2012 పేరిట 493 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే 2013 జనరల్ డీఎస్సీలో 42 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఐటీడీఏ అధికారులు బుధవారం నోటీస్‌బోర్డులో పెట్టనున్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులతో ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మంజూరైన పోస్టులలో 70 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారని తెలిసింది. మంజూరైన పోస్టుల వివరాలు... ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. పీజీ హెచ్ఎం 23, గణితం 44, ఫిజికల్ సైన్స్ 61, బయలాజికల్ సైన్స్ 52, ఇంగ్లిష్ 63, సాంఘికశాస్త్రం 34, తెలుగు 63, హిందీ 62, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు 59, పీఈటీలు 02, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 79 భర్తీ చేయనున్నారు. అలాగే ఎస్జీటీ 117 పోస్టుల భర్తీకి కూడా అనుమతి వచ్చింది. ఈ ఉత్తర్వులతో దాదాపు ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ కానున్నాయి. కాగా, ప్రతిసారీ ఏజెన్సీ డీఎస్సీ ప్రక్రియ ప్రహసనంలా మారుతోంది. ఏజెన్సీ సర్టిఫికెట్ల వివాదాల నేపథ్యంలో డీఎస్సీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. కుప్పలు తెప్పలుగా వస్తున్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించటం ఐటీడీఏ విద్యాశాఖలోని సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కార్యాలయ సిబ్బంది పోస్టులు పెరగకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. మరోసారి భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో వివాదాలు తలెత్తకుండా ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఐటీడీఏ విద్యాశాఖ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించి ఎలాంటి ఆరోపణలు రాకుండా నిష్పక్షపాతంగా, వేగవంతంగా ఈ ప్రక్రియ కొనసాగేలా చర్య తీసుకోవాలని ఐటీడీఏ పీవోను కోరుతున్నారు.