సీఎం వద్దకు డీఎస్సీ ఫైలు!
♦15,628 టీచర్ పోస్టులతో ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
♦సీఎం ఆమోదం రాగానే ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్
♦నియామక పరీక్షను ఎవరికి అప్పగించాలనే దానిపై స్పష్టత కోరిన అధికారులు
♦నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,628 ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలకు సంబంధించిన ఫైలు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు రాతపరీక్ష (టీఆర్‌టీ) నిర్వహణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయాన్ని కూడా తేల్చాలని ప్రతిపాదనల్లో కోరినట్లు తెలిసింది. గతంలో భావించినట్లుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్‌పీఎస్సీ) టీఆర్‌టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలా, జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో నిర్వహించాలా అన్నది తేల్చాలని పేర్కొంది. నియామకాల ఫైలు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏటా తగ్గిపోతున్న పోస్టులు
2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖవర్గాలు చెప్పాయి. తర్వాత హేతుబద్ధీకరణ పేరిట 2015కు వాయిదా వేశాయి. ఆ సమయంలో ఉద్యోగుల లెక్కలు తీసినపుడు దాదాపు 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విభజన కమిటీ తేల్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించాక హేతుబద్ధీకరణ జరిగింది. అప్పుడు దాదాపు 17 వేల ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. కనీసం ఈ పోస్టుల భర్తీకైనా వెంటనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు భావించారు. కానీ అదీ జరగలేదు. 2015 చివరలోనో, 2016 జనవరిలోనో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని భావించారు. అదే సమయంలో నవ ంబర్ 16న టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఎన్నికలు, ఇతర కారణాలతో అదీ వాయిదా పడింది. మరోవైపు అధికారులు మరోసారి హేతుబద్ధీకరణ చేయగా... పోస్టుల సంఖ్య తెలుగు మీడియంలో 10,927, ఉర్దూ మీడియంలో 1,215కు పడిపోయింది. వీటితోపాటు గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నవాటిని కలుపుకొని మొత్తం 15,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్క వేసింది. వీటి భర్తీకి జనవరి 2న కేబినెట్ కూడా ఆమోదముద్ర వేయడంతో... వెంటనే టెట్ నోటిఫికేషన్, ఏప్రిల్ నెలాఖరుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసి, మళ్లీ ఆపేశారు. ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో... ఎట్టకేలకు ఈనెల 15 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతోపాటే టీఆర్‌టీ నిర్వహణపై తేల్చాలని సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎలాంటి వాయిదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వారు కోరుతున్నారు.
రెండేళ్లుగా వాయిదాలు
రాష్ట్రంలో 2013 నుంచి ఉపాధ్యాయ నియామకాల వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ శిక్షణ పొందుతున్నారు. వాస్తవానికి 2013లో నోటిఫికేషన్ వస్తుందని భావించినా, రాష్ట్ర విభజన, ఆందోళనల నేపథ్యంలో నోటిఫికేషన్‌ను నిలిపివేయడంతో నియామకాల ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత త్వరలోనే డీఎస్సీ అంటూ, ఇంకా సమయం పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల విరుద్ధ ప్రకటనలతో వారంతా ఆందోళనలో మునిగిపోయారు.