వివాదాలు.. వాయిదాలు! | Postponement of filling up of teacher posts | Sakshi
Sakshi News home page

వివాదాలు.. వాయిదాలు!

Published Thu, Nov 14 2024 5:34 AM | Last Updated on Thu, Nov 14 2024 7:12 AM

Postponement of filling up of teacher posts

పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కారు గేమ్‌

16,347 పోస్టులతో డీఎస్సీ అంటూ హంగామా

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్‌ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. 

గతేడాది డిసెంబర్‌ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ ‘‘త్వరలో’’ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను జనవరి 5న నిర్వహిస్తామని తొలుత ప్రకటించి పది రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు. 

ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్‌ కమిషన్‌ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దాటవేతలో అందెవేసిన కూటమి
‘గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులకు చెప్పాం..’ అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. 

ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్‌ 6న నోటిఫికేషన్‌ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం..
గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తై జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్‌ ఉద్యోగాలను వదిలేసి పూర్తికాలం శిక్షణ పొందుతున్నారు. 

ఇక గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్‌ కమిషన్‌కు చైర్మన్‌ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. గత నెలలో చైర్మన్‌గా ఏఆర్‌ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి. 

ఈ క్రమంలో జనవరి 5న మెయిన్స్‌ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు. తీరా పది రోజులు గడవకుండానే మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. 



‘త్వరలో’..అంటే ఎప్పుడు?
గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్‌ తొలివారంలో నోటిఫికేషన్‌ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక ‘‘త్వరలో’’ నోటిఫికేషన్‌ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. 

ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్‌ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు.  నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, మంత్రి చెబుతున్న ‘త్వరలో’ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement